సంక్షిప్తవార్తలు(5)

ప్రొ హాకీ లీగ్‌ ఐరోపా అంచె టోర్నీలో భారత పురుషుల జట్టు రెండో మ్యాచ్‌లో ఓడిపోయింది.

Updated : 25 May 2024 06:37 IST

భారత హాకీ జట్టు ఓటమి 

ఆంట్వెర్ప్‌ (బెల్జియం): ప్రొ హాకీ లీగ్‌ ఐరోపా అంచె టోర్నీలో భారత పురుషుల జట్టు రెండో మ్యాచ్‌లో ఓడిపోయింది. 1-4తో ఆతిథ్య బెల్జియంకు తలొంచింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన బెల్జియం.. 49 నిమిషాల అయ్యేసరికి 3-0 ఆధిక్యంలో నిలిచింది. ఫెలిక్స్‌ (22వ), హెండ్రిక్స్‌ (34వ), చార్లియర్‌ (49వ) గోల్స్‌ కొట్టారు. మరో అయిదు నిమిషాల్లో మ్యాచ్‌ ముగుస్తుందనగా అభిషేక్‌ (55వ) కొట్టిన ఓ మెరుపు షాట్‌తో భారత్‌ ఖాతా తెరిచింది. చివరి నిమిషంలో హెండ్రిక్స్‌ (60వ) గోల్‌తో  బెల్జియం 4-1తో ఘన విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్‌లో అర్జెంటీనాను షూటౌట్లో ఓడించిన హర్మన్‌ప్రీత్‌ సేన.. బెల్జియంపై ఆ స్ఫూర్తిని ప్రదర్శించలేకపోయింది. ప్రొ హాకీ లీగ్‌ మహిళల విభాగంలోనూ భారత్‌కు నిరాశ ఎదురైంది. శుక్రవారం భారత్‌ 0-2తో బెల్జియం చేతిలో చిత్తయింది. అలెక్సియా (34వ), లూయిస్‌ (36వ) ఫీల్డ్‌ గోల్స్‌ కొట్టి బెల్జియంను విజయపథంలో నడిపించారు.


పాక్‌.. బాబర్‌ సారథ్యంలో 

కరాచి: టీ20 ప్రపంచకప్‌లో పోటీపడే పాకిస్థాన్‌ జట్టును ప్రకటించారు. బాబర్‌ అజామ్‌ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో అనుభవజ్ఞుడైన పేసర్‌ హారిస్‌ రవూఫ్‌కు చోటు దక్కింది. ఫిబ్రవరిలో పీఎస్‌ఎల్‌ సందర్భంగా గాయపడ్డ రవూఫ్‌.. ఇప్పుడు పూర్తి ఫిట్‌గా ఉన్నాడని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు పేర్కొంది. పాకిస్థాన్‌ జట్టు భారత్, ఐర్లాండ్, కెనడా, అమెరికాతో పాటు గ్రూప్‌-ఎలో ఉంది.

పాకిస్థాన్‌ జట్టు: బాబర్‌ అజామ్, అబ్రార్, అజామ్‌ ఖాన్, ఫకర్‌ జమాన్, రవూఫ్, ఇఫ్తికార్, ఇమాద్‌ వసీమ్, అబ్బాస్‌ అఫ్రిది, ఆమిర్, రిజ్వాన్, నసీమ్‌ షా, సయిమ్‌ ఆయూబ్, షాదాబ్‌ ఖాన్, షహీన్‌ షా అఫ్రిది, ఉస్మాన్‌ ఖాన్‌.


మెరిసిన రింకు

కోబె: ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత అథ్లెట్‌ రింకు హుడా పతకంతో మెరిశాడు. పురుషుల ఎఫ్‌46 జావెలిన్‌ త్రోలో అతను మూడో స్థానంలో నిలిచాడు. నాలుగో ప్రయత్నంలో అతను జావెలిన్‌ను 62.77 మీటర్ల దూరం విసిరాడు. అయితే రెండో స్థానంలో నిలిచిన శ్రీలంక అథ్లెట్‌ ప్రియాంత హెరాత్‌ (64.59మీ) అగ్రస్థానం దక్కించుకున్న క్యూబా క్రీడాకారుడు వరోనా (65.16మీ)కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశాడు. దీంతో ఈ ఫలితాలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయినా రింకూకు పతకం ఖాయమే. 


సచిన్‌ శుభారంభం 

బ్యాంకాక్‌: పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్తు దక్కించుకోవడానికి చివరి అవకాశమైన రెండో బాక్సింగ్‌ ప్రపంచ క్వాలిఫయర్స్‌లో భారత ఆటగాడు సచిన్‌ సివాచ్‌ శుభారంభం చేశాడు. శుక్రవారం పురుషుల 57 కేజీల విభాగం తొలి రౌండ్లో ఈ జాతీయ ఛాంపియన్‌ 5-0 తేడాతో అలెక్స్‌ ముకుకా (న్యూజిలాండ్‌)పై ఏకపక్ష విజయం సాధించాడు. . ఈ పోటీల్లో కనీసం సెమీస్‌ చేరితే పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది. అమిత్‌ పంగాల్‌ (51 కేజీ), నరేంద్ర బెర్వాల్‌ (+92 కేజీ)కు తొలి రౌండ్లో బై లభించింది.


క్వాలిఫయర్స్‌ కోసం 27 మందితో.. 

భువనేశ్వర్‌: కువైట్‌తో జూన్‌ 6న జరిగే ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ఆసియా క్వాలిఫయర్స్‌ రెండో రౌండ్‌ మ్యాచ్‌కు  27 మందితో భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య జట్టును ప్రకటించింది. ఫార్వర్డ్‌ పతిబ్‌ గొగోయ్, డిఫెండర్‌ మహ్మద్‌ హమద్‌ గాయాల కారణంగా చోటు దక్కించుకోలేకపోయారు. దిగ్గజ ఆటగాడు, కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రికి కెరీర్‌లో ఇదే ఆఖరి మ్యాచ్‌ కావడంతో అందరి దృష్టి భారత్‌-కువైట్‌ పోరుపైనే నిలిచింది. ఇటీవలే అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికిన ఛెత్రి.. కువైట్‌తో మ్యాచే చివరిదని చెప్పిన సంగతి తెలిసిందే. గ్రూప్‌-ఏలో 4 పాయింట్లతో భారత్‌ రెండో స్థానంలో ఉంది. ఖతార్‌ (12) అగ్రస్థానంలో ఉండగా.. అఫ్గానిస్థాన్‌ (4), కువైట్‌ (3).. తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. గ్రూప్‌లో టాప్‌-2 జట్లు మూడో రౌండ్‌ చేరతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని