భరాలికి స్వర్ణం

ప్రపంచ యూత్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత టీనేజర్‌ దేవబ్రత్‌ భరాలి స్వర్ణం గెలిచాడు. పెరూలోని లిమాలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల 73 కేజీల విభాగంలో స్నాచ్‌లో 136.. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 160 కేజీలు ఎత్తిన భరాలి.. మొత్తం మీద 296 కేజీలతో అగ్రస్థానంలో నిలిచాడు.

Published : 26 May 2024 02:53 IST

దిల్లీ: ప్రపంచ యూత్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత టీనేజర్‌ దేవబ్రత్‌ భరాలి స్వర్ణం గెలిచాడు. పెరూలోని లిమాలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల 73 కేజీల విభాగంలో స్నాచ్‌లో 136.. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 160 కేజీలు ఎత్తిన భరాలి.. మొత్తం మీద 296 కేజీలతో అగ్రస్థానంలో నిలిచాడు. రెండో స్థానంలో నిలిచిన ర్యాన్‌ మెక్‌డొనాల్డ్‌ (అమెరికా, 284 కేజీలు) కంటే భరాలి 12 కేజీలు ఎక్కువ ఎత్తడం విశేషం. కొటెల్‌స్కై (ఉక్రెయిన్, 283 కేజీ) కాంస్యం నెగ్గాడు. 81 కేజీల విభాగంలో భారత లిఫ్టర్‌ సాయిరాజ్‌ పరదేశి కాంస్యం సాధించాడు. అతడు స్నాచ్‌లో 135 కేజీలతో మూడో స్థానంలో నిలిచి పతకం అందుకున్నాడు. మొత్తంగా సాయిరాజ్‌ 300 కేజీలు (135 స్నాచ్‌+165 క్లీన్‌ అండ్‌ జెర్క్‌) ఎత్తి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 


హాకీలో అమ్మాయిలు, అబ్బాయిల ఓటమి 

ఆంట్వెర్ప్‌ (బెల్జియం): ప్రొ హాకీ లీగ్‌ ఐరోపా అంచె టోర్నీలో భారత జట్లు ఓటమిపాలయ్యాయి. అమ్మాయిల జట్టు 1-2తో ఆతిథ్య బెల్జియం చేతిలో పరాజయంపాలైంది. యాంబ్రె (14వ), బ్లాక్‌మన్స్‌ (20వ) గోల్స్‌తో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. 34వ నిమిషంలో సంగీత కుమారి చేసిన ఫీల్డ్‌ గోల్‌తో భారత్‌ ఖాతా తెరిచింది. ఈ పర్యటనలో తొలి మ్యాచ్‌లో 0-5తో అర్జెంటీనా చేతిలో ఓడిన సలీమా బృందం.. తర్వాత 0-2తో బెల్జియంకు తలొంచింది. మరోవైపు భారత పురుషుల జట్టు 1-3తో టైబ్రేకర్‌లో బెల్జియం చేతిలో ఓడింది. నిర్ణీత సమయానికి రెండు జట్లు 2-2తో సమానంగా నిలిచాయి. భారత్‌ తరఫున అర్జీత్‌సింగ్‌ (11వ), సుఖ్‌జీత్‌ (57వ).. బెల్జియం జట్టులో ఫెలిక్స్‌ (30వ), ఫ్లోరెంట్‌ (50వ) గోల్స్‌ కొట్టారు. షూటౌట్లో భారత్‌ ఒకే గోల్‌ (సుఖ్‌జీత్‌) కొట్టింది. అభిషేక్, ప్రసాద్, అర్జీత్‌ విఫలమయ్యారు. మరోవైపు విలియమ్, ఫ్లోరెంట్, బొకార్డ్‌ గోల్స్‌తో బెల్జియం విజయాన్ని అందుకుంది. 


అభిమన్యు ముందంజ 

బ్యాంకాక్‌: పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్తు సాధించడానికి ఆఖరి అవకాశంగా జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్‌ క్వాలిఫయర్స్‌లో అభిమన్యు (80 కేజీ) శుభారంభం చేశాడు. శనివారం అతడు 3-0తో నికోలోవ్‌ (బల్గేరియా)ను చిత్తు చేశాడు. ఇప్పటికే సచిన్‌ సివాచ్‌ (57 కేజీ) కూడా  తొలి రౌండ్‌ను అధిగమించాడు. 


ఇంగ్లాండ్‌దే రెండో టీ20

బర్మింగ్‌హామ్‌: పాకిస్థాన్‌తో నాలుగు మ్యాచ్‌ల టీ20ల సిరీస్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌ బోణీ కొట్టింది. శనివారం రెండో టీ20లో 23 పరుగుల తేడాతో నెగ్గి 1-0 ఆధిక్యంలో నిలిచింది. మొదట ఇంగ్లాండ్‌ 7 వికెట్లకు 183 పరుగులు చేసింది. బట్లర్‌ (84; 51 బంతుల్లో 8×4, 3×6) టాప్‌ స్కోరర్‌. విల్‌ జాక్స్‌ (37; 23 బంతుల్లో 4×4, 2×6) రాణించాడు.  షహీన్‌షా అఫ్రిది (3/36), ఇమాద్‌ వసీమ్‌ (2/19), హారిస్‌ రవూఫ్‌ (2/34) ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఛేదనలో టాప్లీ (3/41), మొయిన్‌ అలీ (2/26), ఆర్చర్‌ (2/28) ధాటికి పాక్‌ 19.2 ఓవర్లలో 160కే ఆలౌటైంది. ఫకార్‌ జమాన్‌ (45), బాబర్‌ అజామ్‌ (32) మాత్రమే రాణించారు. ఈ సిరీస్‌లో తొలి టీ20 వర్షం కారణంగా రద్దయింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని