గోల్డెన్‌ స్పైక్‌ మీట్‌కు నీరజ్‌ దూరం

భారత జావెలిన్‌త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా.. చెక్‌ రిపబ్లిక్‌లో జరిగే అస్ట్రావా గోల్డెన్‌ స్పైక్‌ మీట్‌కు దూరమయ్యాడు. గాయంతో అతడు తప్పుకున్నాడని మొదట వార్తలు వచ్చాయి. కానీ తనకు ఎలాంటి గాయం కాలేదని ముందు జాగ్రత్త చర్యగా పోటీ నుంచి వైదొలిగానని వివరణ ఇచ్చాడు.

Published : 27 May 2024 03:12 IST

దిల్లీ: భారత జావెలిన్‌త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా.. చెక్‌ రిపబ్లిక్‌లో జరిగే అస్ట్రావా గోల్డెన్‌ స్పైక్‌ మీట్‌కు దూరమయ్యాడు. గాయంతో అతడు తప్పుకున్నాడని మొదట వార్తలు వచ్చాయి. కానీ తనకు ఎలాంటి గాయం కాలేదని ముందు జాగ్రత్త చర్యగా పోటీ నుంచి వైదొలిగానని వివరణ ఇచ్చాడు. ‘‘ఇటీవల త్రోయింగ్‌ సెషన్‌ తర్వాత మే 28న ఆరంభమయ్యే గోల్డెన్‌ స్పైక్‌ టోర్నీలో బరిలో దిగకూడదని భావించా. తొడ కండరాల్లో ఏదో ఇబ్బందిగా అనిపించింది. నేనేమి గాయపడలేదు. ఒలింపిక్స్‌కు ముందు సాహసాలు చేయకూడదని అనుకుంటున్నా. పూర్తిగా ఫిట్‌గా ఉన్నా అనిపిస్తే బరిలో దిగుతా’’ అని నీరజ్‌ చెప్పాడు. దోహా డైమండ్‌ లీగ్‌లో రజతం గెలిచిన నీరజ్‌.. ఈ క్రమంలో జావెలిన్‌ను 88.36 మీటర్లు విసిరాడు. జూన్‌ 18న ఫిన్లాండ్‌లో ఆరంభమయ్యే పావో నూర్మి క్రీడల్లో ఒలింపిక్‌ ఛాంపియన్‌ నీరజ్‌ పోటీపడే అవకాశాలున్నాయి. 


అమెరికాలో టీమ్‌ఇండియా 

న్యూయార్క్‌: టీ20 ప్రపంచకప్‌ కోసం అమెరికాకు టీమ్‌ఇండియా చేరుకుంది. కెప్టెన్‌ రోహిత్‌ సహా జట్టులోని మరికొంత మంది ఆటగాళ్లు ఆదివారం న్యూయార్క్‌లో అడుగుపెట్టారు. బుమ్రా, సిరాజ్, సూర్యకుమార్, పంత్, శివమ్‌ దూబె, జడేజా, కుల్‌దీప్‌ యాదవ్, అక్షర్‌తో పాటు రిజర్వ్‌ ఆటగాళ్లు శుభమ్‌ గిల్, ఖలీల్‌ అహ్మద్‌ అక్కడికి వెళ్లారు. ప్రధాన కోచ్‌ ద్రవిడ్‌తో పాటు కోచింగ్‌ సిబ్బంది కూడా అమెరికా చేరుకున్నారు. కోహ్లి, హార్దిక్‌ పాండ్య ఈ జట్టుతో వెళ్లలేదు. ఐపీఎల్‌లో ఎలిమినేటర్‌ ఆడిన కోహ్లి రెండో విడత ఆటగాళ్ల బృందంతో కలిసి న్యూయార్క్‌కు పయనమయ్యే అవకాశముంది. యూకేలో ఉన్న వైస్‌కెప్టెన్‌ హార్దిక్‌ జట్టుతో ఎప్పుడు చేరతాడన్నదానిపై స్పష్టత లేదు. రెండో క్వాలిఫయర్‌ ఆడిన రాజస్థాన్‌ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, శాంసన్, చాహల్, అవేశ్‌ (రిజర్వ్‌) సోమవారం బయల్దేరనున్నారు.


అభినాష్, నిశాంత్‌ శుభారంభం 

బ్యాంకాక్‌: ప్రపంచ బాక్సింగ్‌ క్వాలిఫయర్స్‌లో అభినాష్‌ జామ్‌వాల్‌ (63.5 కేజీ), నిశాంత్‌ దేవ్‌ (71 కేజీ) శుభారంభం చేశారు. ఆదివారం తొలి రౌండ్లో అభినాష్‌ 5-0తో లావ్‌రెనోవాస్‌ (లిథుయేనియా)ను చిత్తు చేశాడు. మరో బౌట్లో నిశాంత్‌ అంతే తేడాతో ఆర్నాండో బిగాఫా (గినియా బిసావూ)పై విజయం సాధించాడు. ఇప్పటికే సచిన్‌ సివాచ్‌ (57 కేజీ), అభిమన్యు (80 కేజీ) తొలి రౌండ్లో గెలిచారు. అమిత్‌ ఫంగాల్‌ (51 కేజీ), సంజీత్‌ (92 కేజీ), నరేందర్‌ (92 కేజీల+), జైస్మిన్‌ (57 కేజీ), అరుంధతి చౌదరి (66 కేజీ)లకు తొలి రౌండ్లో బై దక్కింది. అంకుషిత బొరో (60 కేజీ) సోమవారం తొలి రౌండ్‌ ఆడనుంది.


అమ్మాయిలకు మరో ఓటమి 

ప్రొహాకీ లీగ్‌ 

ఆంట్వెర్ప్‌: ప్రొ హాకీ లీగ్‌ ఐరోపా అంచెలో భారత అమ్మాయిల జట్టు ఓటమి బాట వీడట్లేదు. సలీమా బృందం వరుసగా నాలుగో పరాజయాన్ని చవిచూసింది. ఆదివారం భారత్‌ 0-3తో అర్జెంటీనా చేతిలో ఓడింది. ఆరంభం నుంచే అర్జెంటీనా దాడి మొదలైంది. తొలి నిమిషంలో సెలీనా గోల్‌ కొట్టి అర్జెంటీనాను ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. తర్వాత కాంపాయ్‌ (39వ), గ్రానాటో (47వ) గోల్స్‌తో ఆ జట్టు 3-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. భారత్‌కు కూడా అవకాశాలు దక్కినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. జూన్‌ 1న జర్మనీతో భారత్‌ తలపడనుంది. 


హోల్డర్‌కు గాయం.. జట్టులోకి మెకాయ్‌

సెయింట్‌ జాన్స్‌: టీ20 ప్రపంచకప్‌కు ముందు వెస్టిండీస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ జేసన్‌ హోల్డర్‌ గాయంతో ఈ పొట్టికప్‌కు దూరమయ్యాడు. అతని స్థానాన్ని మెకాయ్‌తో భర్తీ చేస్తున్నట్లు క్రికెట్‌ వెస్టిండీస్‌ ప్రకటించింది. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడుతూ హోల్డర్‌ గాయపడ్డాడు. ‘‘మా కూర్పులో జేసన్‌ అనుభవజ్ఞుడైన ఆటగాడు. మైదానం బయట, లోపల అతని గైర్హాజరీ కచ్చితంగా లోటే. పూర్తి ఫిట్‌నెస్‌తో జేసన్‌ తిరిగి వస్తాడని ఆశిస్తున్నాం. మెకాయ్‌ నైపుణ్యాలపై నమ్మకముంది’’ అని క్రికెట్‌ వెస్టిండీస్‌ తెలిపింది. మరోవైపు కైల్‌ మేయర్స్, ఫాబియన్‌ అలెన్, మాథ్యూ ఫోర్డ్, ఫ్లెచర్, హేడెన్‌ వాల్ష్‌ను రిజర్వ్‌ ప్లేయర్లుగా ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని