నిశాంత్‌ రెండు నిమిషాల్లోనే..

ప్రపంచ బాక్సింగ్‌ క్వాలిఫయర్స్‌ టోర్నీలో భారత కుర్రాడు నిశాంత్‌ దేవ్‌ దూసుకెళ్తున్నాడు. 71 కేజీల విభాగంలో అతడు ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. రెండో రౌండ్లో నిశాంత్‌ కేవలం 2 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట్‌గాన్‌బాటర్‌ (మంగోలియా)ని చిత్తు చేశాడు.

Published : 29 May 2024 01:45 IST

బ్యాంకాక్‌: ప్రపంచ బాక్సింగ్‌ క్వాలిఫయర్స్‌ టోర్నీలో భారత కుర్రాడు నిశాంత్‌ దేవ్‌ దూసుకెళ్తున్నాడు. 71 కేజీల విభాగంలో అతడు ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. రెండో రౌండ్లో నిశాంత్‌ కేవలం 2 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట్‌గాన్‌బాటర్‌ (మంగోలియా)ని చిత్తు చేశాడు. ఆరంభం నుంచి బాటర్‌పై పంచ్‌లతో విరుచుకుపడిన నిశాంత్‌.. అతడిని నాకౌట్‌ చేశాడు. మరోవైపు అభినాష్‌ జామ్‌వాల్‌ (63.5 కేజీ) పోరాటం ముగిసింది. రెండో రౌండ్లో  జోస్‌ మాన్యుల్‌ (కొలంబియా) చేతిలో అతడు ఓడాడు. ఈ పోరులో ఇద్దరూ నువ్వానేనా అన్నట్లుగా పోరాడడంతో చివరికి స్కోర్లు సమమయ్యాయి. కానీ పంచ్‌ల లెక్కలు చూసిన తర్వాత న్యాయ నిర్ణేతలు జోస్‌ వైపే మొగ్గడంతో అభినాష్‌కు నిరాశ తప్పలేదు. సచిన్‌ సివాచ్‌ (57 కేజీ) ప్రిక్వార్టర్స్‌ చేరాడు. రెండో రౌండ్లో సచిన్‌ 5-0తో ఫెడ్రిక్‌ జెన్సన్‌ (డెన్మార్క్‌)ను చిత్తు చేశాడు. 


గాయాలున్నా భారత్‌ ఫేవరెటే: మోర్గాన్‌ 

లండన్‌: టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా బలమైన పోటీదారని ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ అన్నాడు. ‘‘గాయాలతో కూడా టీమ్‌ఇండియా బలంగానే ఉంది. నాణ్యమైన జట్టు కావడం వల్లే ఎవరెవరికి 15 మంది ప్రపంచకప్‌ జట్టులో చోటు దొరకలేదో చర్చించుకుంటున్నాం. నా దృష్టిలో భారత్‌ ఫేవరెట్‌. కాగితంపై ఆ జట్టు చాలా నాణ్యంగా కనిపిస్తోంది. దానికి తగ్గట్లుగా ప్రదర్శన చేస్తే ఏ జట్టునైనా ఓడించగలదు’’ అని చెప్పాడు. గిల్, రాహుల్‌ వంటి ఆటగాళ్లకు భారత జట్టులో చోటు దక్కని సంగతి తెలిసిందే. ‘‘నేనే జట్టును ఎంపిక చేసి ఉంటే యశస్వి జైస్వాల్‌ స్థానంలో గిల్‌ను తీసుకునేవాణ్ని. నేను గిల్‌తో కలిసి ఆడా. అతడు ఎలా ఆలోచిస్తాడో, ఎలా పని చేస్తాడో నాకు తెలుసు. గిల్‌ భవిష్యత్తు నాయకుడు’’ అని మోర్గాన్‌ చెప్పాడు.


ఆ జెర్సీ ధరిస్తే హార్దిక్‌ వేరు: హర్భజన్‌ 

చెన్నై: ఐపీఎల్‌లో ఆటగాడిగా, ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌గా పేలవ ప్రదర్శనతో తీవ్ర విమర్శలెదుర్కొన్నాడు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య. అయితే టీమ్‌ఇండియా జెర్సీ ధరించాక హార్దిక్‌ వేరుగా ఉంటాడని, ఈ టోర్నీలో అతను మెరుగైన ప్రదర్శన చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌. ‘‘నీలి రంగు జెర్సీ ధరిస్తే కొత్త హార్దిక్‌ను చూస్తాం. అతడికి పరుగులు ఎలా చేయాలో, వికెట్లు ఎలా పడగొట్టాలో తెలుసు. అతను ఈ మధ్య ఇబ్బందులు పడ్డాడు. తన ఫామ్‌ ఆందోళకనరమే. కానీ భారత్‌ తరఫున ప్రపంచకప్‌లో గొప్పగా రాణించాలని కోరుకుంటున్నా’’ అని భజ్జీ తెలిపాడు.


భారత్‌కు టైటిళ్లు 

దక్షిణాసియా యూత్‌ టీటీ 

దిల్లీ: దక్షిణాసియా యూత్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత అండర్‌-19 బాలికల జట్టు టైటిల్‌ను నిలబెట్టుకుంది. మంగళవారం జరిగిన ఫైనల్లో ఆ జట్టు 3-0తో నేపాల్‌పై విజయం సాధించింది. సయాలి వాణి 11-6 12-10, 11-8తో బిమండీ బండారపై, ప్రీత 7-11, 11-3, 11-7, 6-11, 11-8తో కవింద్యపై, తనీషా 11-8, 11-7, 11-7తో దివ్య ధరణి నెగ్గారు. దివ్యాన్షి, సింద్రెలా దాస్, కావ్య భట్‌లతో కూడిన అండర్‌-15 బాలికల జట్టూ విజేతగా నిలిచింది. ఫైనల్లో 3-0తో శ్రీలంకను మట్టికరిపించింది. దివ్యాన్షి 11-8, 11-7, 11-9తో యోషినిపై, సింద్రెలా 11-9, 11-9, 11-4తో శాన్యపై, కావ్య 11-3, 11-8, 11-7తో సమిందిపై నెగ్గారు. అండర్‌-15 బాలుర విభాగంలోనూ భారత జట్టు టైటిల్‌ గెలుచుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని