సాత్విక్‌ జోడీకి షాక్‌

భారత డబుల్స్‌ స్టార్లు సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌శెట్టిలకు షాక్‌! సింగపూర్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో ఈ నంబర్‌వన్‌ జంట తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది.

Updated : 29 May 2024 09:29 IST

తొలి రౌండ్లోనే ఇంటిముఖం 
సింగపూర్‌ ఓపెన్‌ 

సింగపూర్‌: భారత డబుల్స్‌ స్టార్లు సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌శెట్టిలకు షాక్‌! సింగపూర్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో ఈ నంబర్‌వన్‌ జంట తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. పారిస్‌ ఒలింపిక్స్‌ ముంగిట ఫామ్‌ చాటుకునే ఉద్దేశంతో బరిలో దిగిన సాత్విక్‌ ద్వయం తొలి రౌండ్లో 20-22, 18-21తో డానియల్‌ లాండ్‌గార్డ్‌-మాడ్స్‌ వెస్టర్‌గార్డ్‌ (డెన్మార్క్‌) జంట చేతిలో కంగుతింది. 47 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో స్వాతిక్‌ జంట పోరాడినా.. ఫినిషింగ్‌ చేయలేకపోయింది. తొలి గేమ్‌లో విరామ సమయానికి 6-11తో వెనుకబడిన భారత జోడీ.. తర్వాత పుంజుకుంది. 17-17తో స్కోరు సమం చేసింది. ఒక దశలో 20-18తో గేమ్‌ గెలిచేందుకు సిద్ధమైంది. ఈ స్థితిలో తడబడిన సాత్విక్‌ జంట.. ప్రత్యర్థికి పుంజుకునే అవకాశం ఇచ్చింది. దీంతో ఈ గేమ్‌ను డెన్మార్క్‌ జోడీ గెలుచుకుంది. రెండో గేమ్‌లోనూ సాత్విక్‌-చిరాగ్‌ సహజసిద్ధంగా  ఆడలేకపోయారు. అనవసర తప్పిదాలతో 3-6తో వెనుకబడిన భారత ద్వయం.. ఆ తర్వాత గాడిలో పడింది. 17-16తో ఒక దశలో ఆధిక్యంలోకి కూడా వెళ్లింది. కానీ ఈ స్థితిలో మళ్లీ తడబడి గేమ్‌తో పాటు మ్యాచ్‌ కోల్పోయింది. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో ప్రియాన్షు రజావత్‌ 21-23, 19-21తో లీ చెక్‌ (అమెరికా) చేతిలో ఓడగా.. మహిళల సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్‌ 19-21, 20-22తో చోయిక్‌వాంగ్‌ (థాయ్‌లాండ్‌)కు తలొంచింది. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్లో రుతుపర్ణా-శ్వేతపర్ణా 12-21, 21-12, 13-21తో చాంగ్‌చింగ్‌-యెం్ చింగ్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో.. మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్లో సూర్య-అమృత 8-21, 17-21తో లీచున్‌-జుయూ (కొరియా) చేతిలో ఓడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని