హంపిపై వైశాలి విజయం

నార్వే చెస్‌ టోర్నీలో భారత స్టార్‌ కోనేరు హంపిపై యువ క్రీడాకారిణి ఆర్‌.వైశాలి పైచేయి సాధించింది. బుధవారం జరిగిన రెండో రౌండ్లో హంపి (1.5 పాయింట్లు)ని ఓడించిన వైశాలి.. 4 పాయింట్లతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

Published : 30 May 2024 02:43 IST

స్టావెంజర్‌ (నార్వే): నార్వే చెస్‌ టోర్నీలో భారత స్టార్‌ కోనేరు హంపిపై యువ క్రీడాకారిణి ఆర్‌.వైశాలి పైచేయి సాధించింది. బుధవారం జరిగిన రెండో రౌండ్లో హంపి (1.5 పాయింట్లు)ని ఓడించిన వైశాలి.. 4 పాయింట్లతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. పురుషుల విభాగంలో హికరు నకముర (2.5- అమెరికా)పై మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (3- నార్వే), ప్రజ్ఞానంద (2)పై డింగ్‌ లిరెన్‌ (2.5- చైనా) గెలుపొందారు.


భారత జట్టు సన్నాహాలు షురూ 

న్యూయార్క్‌: టీ20 ప్రపంచకప్‌ లక్ష్యంగా భారత జట్టు సన్నాహాలు మొదలుపెట్టింది. స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి మినహా మిగతా జట్టంతా సాధనకు శ్రీకారం చుట్టింది. రెండు నెలల పాటు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఐపీఎల్‌ ఆడిన భారత ఆటగాళ్లు.. పొట్టి కప్పులో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లకు తగ్గట్లుగా ప్రాక్టీస్‌ ప్రారంభించింది. ఆటగాళ్లు వాతావరణానికి అలవాటుపడేలా మైదానంలో కసరత్తులు చేయించినట్లు స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌ సోహమ్‌ దేశాయ్‌ తెలిపాడు. ఇక వ్యక్తిగత కారణాలతో విరామం తీసుకున్న కోహ్లి.. శుక్రవారం జట్టుతో చేరే అవకాశముంది. సుదీర్ఘ ప్రయాణం నేపథ్యంలో శనివారం బంగ్లాదేశ్‌తో వార్మప్‌ మ్యాచ్‌లో కోహ్లి ఆడడం కష్టమే.


ప్రపంచ చెస్‌ పోరుకు భారత్‌ బిడ్‌ 

దిల్లీ: భారత యువ సంచలనం గుకేశ్‌ సొంత రాష్ట్రంలో ప్రపంచ చెస్‌ టైటిల్‌ కోసం పోటీపడే అవకాశముంది. ఈ ఏడాది ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ పోరుకు ఆతిథ్యమిచ్చేందుకు భారత్‌ బిడ్‌ దాఖలు చేసింది. తమిళనాడు ప్రభుత్వం ఈ బిడ్‌ వేసింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ డింగ్‌ లిరెన్‌ (చైనా), 17 ఏళ్ల గుకేశ్‌ మధ్య ఈ టైటిల్‌ సమరాన్ని నిర్వహించేందుకు ఇప్పటివరకూ దాఖలైన బిడ్‌ ఇదొక్కటే. ఈ నెల 31 వరకు గడువు ఉంది. సింగపూర్‌ కూడా దీని నిర్వహణకు ఆసక్తితో ఉన్నట్లు తెలిసింది. ఒకవేళ ఆతిథ్య హక్కులు భారత్‌కే దక్కితే చెన్నైలో నవంబర్‌ 20 నుంచి డిసెంబర్‌ 15 వరకు ఈ టైటిల్‌ పోరు జరిగేందుకు ఆస్కారముంది. దీని కోసం అఖిల భారత చెస్‌ సమాఖ్య సుమారు రూ.71 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఫిడేకు దాదాపు రూ.9 కోట్లు చెల్లించాలి. ‘‘భారత్‌ నుంచి బిడ్‌ స్వీకరించాం. ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోరు కోసం ఇప్పటివరకైతే ఏ ఇతర దేశం బిడ్‌ వేయలేదు. ఈ వారంతో గడువు ముగుస్తుంది. ఆ తర్వాత ఫిడే మండలి సమావేశం ఉంది. అనంతరం ఆతిథ్య దేశాన్ని నిర్ణయిస్తాం’’ అని ఫిడే సీఈవో ఎమిల్‌ సుటోవ్‌స్కీ తెలిపాడు. గత నెలలో క్యాండిడేట్స్‌ టోర్నీ గెలిచిన గుకేశ్‌ ప్రపంచ చెస్‌ పోరుకు అర్హత సాధించిన అతి పిన్న వయస్సు ఆటగాడిగా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. భారత్‌ గతంలో రెండు సార్లు ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌కు ఆతిథ్యమిచ్చింది. 2000లో విజేతగా నిలిచిన ఆనంద్‌.. 2013లో కార్ల్‌సన్‌ చేతిలో ఓడాడు.


క్వార్టర్స్‌లో నిశాంత్, అంకుషిత 

ఒలింపిక్‌ బాక్సింగ్‌ క్వాలిఫయర్స్‌

బ్యాంకాక్‌: పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించే దిశగా భారత బాక్సర్లు నిశాంత్‌ దేవ్, అంకుషిత బోరో ముందడుగు వేశారు. ప్రపంచ బాక్సింగ్‌ క్వాలిఫయర్స్‌లో వీళ్లిద్దరూ క్వార్టర్స్‌ చేరారు. పురుషుల 71 కేజీల విభాగం ప్రిక్వార్టర్స్‌లో నిశాంత 5-0తో పీరపట్‌ (థాయ్‌లాండ్‌)ను చిత్తు చేయగా.. మహిళల 60 కేజీల ప్రిక్వార్టర్స్‌లో అంకుషిత 4-1తో రిమ్మా వొలొసెంకో (కజక్‌స్థాన్‌)ను ఓడించింది.   66 కేజీల విభాగంలో అరుంధతి చౌదరి 5-0తో పియెనీరో (ప్యూర్టోరికో)ను మట్టికరిపించి ప్రిక్వార్టర్స్‌ చేరింది.


జర్మనీ చేతిలో భారత్‌ ఓటమి 

మోన్‌చెంగ్లాడ్‌బాచ్‌ (జర్మనీ): ఐరోపా   పర్యటనలో భారత జూనియర్‌ పురుషుల హాకీ జట్టుకు చుక్కెదురైంది. మంగళవారం ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 2-3తో జర్మనీ చేతిలో పరాజయం చవిచూసింది. భారత్‌ తరఫున యోగేంబర్‌ రావత్, గుర్‌జ్యోత్‌ సింగ్‌ చెరో గోల్‌ సాధించారు. ఆఖరి క్షణాల్లో లభించిన పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచిన జర్మనీ.. భారత్‌ ఆశలపై నీళ్లు చల్లింది.


అగ్రస్థానంతోనే కప్పులోకి.. 

దుబాయ్‌: టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా నంబర్‌వన్‌ జట్టుగానే అడుగు పెట్టబోతోంది. తాజాగా ప్రకటించిన ఐసీసీ టీమ్‌ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. భారత్‌ ఖాతాలో 264 పాయింట్లున్నాయి. ఆస్ట్రేలియా 257 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ (254), వెస్టిండీస్‌ (252), న్యూజిలాండ్‌ (250) వరుసగా 3, 4, 5 స్థానాల్లో నిలిచాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని