గట్టెక్కిన స్వైటెక్‌

తొలి సెట్‌ టైబ్రేకర్‌లో నెగ్గింది.. కానీ రెండో సెట్లో 1-6తో షాక్‌. నిర్ణయాత్మక మూడో సెట్లోనేమో 2-5తో వెనుకంజ. ఇంకేముంది.. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో స్వైటెక్‌ ఓటమి ఖాయమని.. ఒసాక చేతిలో పరాజయంతో ఈ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ రెండో రౌండ్లోనే ఇంటి ముఖం పడుతుందనిపించింది.

Published : 30 May 2024 02:43 IST

ఉత్కంఠ పోరులో ఒసాకపై గెలుపు
ఫ్రెంచ్‌ ఓపెన్‌ 

తొలి సెట్‌ టైబ్రేకర్‌లో నెగ్గింది.. కానీ రెండో సెట్లో 1-6తో షాక్‌. నిర్ణయాత్మక మూడో సెట్లోనేమో 2-5తో వెనుకంజ. ఇంకేముంది.. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో స్వైటెక్‌ ఓటమి ఖాయమని.. ఒసాక చేతిలో పరాజయంతో ఈ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ రెండో రౌండ్లోనే ఇంటి ముఖం పడుతుందనిపించింది. కానీ ఆశలు వదలని.. పోరాటాన్ని ఆపని స్వైటెక్‌ అద్భుతమే చేసింది. వరుసగా అయిదు గేమ్‌లు నెగ్గి విజయాన్ని అందుకుంది. రోలాండ్‌ గారోస్‌లో తనకెందుకు ఎదురులేదో ఈ పోలండ్‌ భామ మరోసారి చాటింది.

పారిస్‌

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రెండు సార్లు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇగా స్వైటెక్‌ (పోలండ్‌) గట్టెక్కింది. బుధవారం మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్లో ఆమె 7-6 (7-1), 1-6, 7-5 తేడాతో నాలుగు గ్రాండ్‌స్లామ్‌ల విజేత ఒసాక (జపాన్‌)పై పోరాడి గెలిచింది. గంటా 9 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన తొలి సెట్లో ఇద్దరు క్రీడాకారిణులు గొప్పగా పోరాడారు. విన్నర్లతో సత్తాచాటిన 22 ఏళ్ల స్వైటెక్‌ మూడో గేమ్‌లో బ్రేక్‌ సాధించి, ఆపై 3-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. దీంతో ఆమె గెలుపు సులువే అనిపించింది. అయితే ఒసాక వదల్లేదు. ఎనిమిదో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసి 4-4తో స్కోరు సమం చేసింది. అక్కడి నుంచి ఇద్దరూ సర్వీస్‌లు నిలబెట్టుకోవడంతో పోరు టైబ్రేకర్‌కు మళ్లింది. ఇందులో స్వైటెక్‌కు తిరుగులేకుండా పోయింది. రెండో సెట్లో 26 ఏళ్ల ఒసాక పూర్తి భిన్నమైన క్రీడాకారిణిగా కనిపించింది. క్రాస్‌ కోర్టు షాట్లతో స్వైటెక్‌ను బోల్తా కొట్టించింది. తన సర్వీస్‌ను నిలబెట్టుకోలేక, ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేయలేక స్వైటెక్‌ నిస్సహాయంగా మారిపోయింది. ఒక్క గేమ్‌ మాత్రమే కోల్పోయిన ఒసాక 32 నిమిషాల్లోనే సెట్‌ ముగించింది. నిర్ణయాత్మక చివరి సెట్‌లో పోరు మరోస్థాయికి చేరింది. ప్రతి పాయింట్‌ కోసం ఈ ఇద్దరూ సివంగుల్లా తలపడ్డారు. ఒసాక 5-2తో గెలుపు వైపు సాగిపోయింది. ఆ దశలో స్వైటెక్‌ గొప్పగా పుంజుకుంది. వరుసగా అయిదు గేమ్‌లు గెలిచి, విజేతగా నిలిచింది. మరోవైపు ఎనిమిదో సీడ్‌ జాబెర్‌ (ట్యూనీసియా) 6-3, 1-6, 6-3తో ఒసోరియో (కొలంబియా)పై, కెనిన్‌ (అమెరికా) 6-3, 6-3తో 21వ సీడ్‌ గార్సియా (ఫ్రాన్స్‌)పై గెలిచారు.

అల్కరాస్‌ జోరు: పురుషుల సింగిల్స్‌లో స్పెయిన్‌ కుర్రాడు అల్కరాస్‌ మూడో రౌండ్లో అడుగుపెట్టాడు. రెండో రౌండ్లో మూడో సీడ్‌ అల్కరాస్‌ 6-3, 6-4, 2-6, 6-2 తేడాతో డి జాంగ్‌ (నెదర్లాండ్స్‌)ను ఓడించాడు. ఈ మ్యాచ్‌లో కుడి చేతి నొప్పి కారణంగా అల్కరాస్‌ ఫోర్‌హ్యాండ్‌ను సమర్థంగా ఆడలేకపోయాడు. తొలి సెట్‌ రెండో గేమ్‌లో అల్కరాస్‌ సర్వీస్‌ బ్రేక్‌ చేసిన జాంగ్‌ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. కానీ అక్కడి నుంచి పుంజుకున్న అల్కరాస్‌ వరుసగా రెండు సెట్లు నెగ్గాడు. మూడో సెట్లో ఓడినా.. నాలుగో సెట్లో మరింత చెలరేగి మ్యాచ్‌ ముగించాడు. ఈ మ్యాచ్‌లో అల్కరాస్‌ 2 ఏస్‌లు, 35 విన్నర్లు సంధించాడు. అంతకంటే ముందు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జకోవిచ్‌ టోర్నీలో శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో టాప్‌సీడ్‌ జకో 6-4, 7-6 (7-3), 6-4తో హర్బర్ట్‌ (ఫ్రాన్స్‌)పై గెలిచాడు. రెండో రౌండ్లో ఆరో సీడ్‌ రుబ్లెవ్‌ (రష్యా) 6-3, 6-4, 6-3తో మార్టినెజ్‌ (స్పెయిన్‌)పై, తొమ్మిదో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌) 6-3, 6-2, 6-7 (2-7), 6-4తో డేనియల్‌ (జర్మనీ)పై నెగ్గారు. అంతకుముందు భారీ వర్షం కారణంగా 23 సింగిల్స్‌ మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. రెండు స్టేడియాల్లో మాత్రం పైకప్పు మూసి మ్యాచ్‌లు నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని