సింధు పరాజయం

పారిస్‌ ఒలింపిక్స్‌కు ముందు ఫామ్‌లోకి రావాలని భావించిన భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధుకు నిరాశ ఎదురైంది. ఇండోనేసియా ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 1000 టోర్నీ నుంచి సింధు నిష్క్రమించింది.

Published : 06 Jun 2024 03:45 IST

జకార్త: పారిస్‌ ఒలింపిక్స్‌కు ముందు ఫామ్‌లోకి రావాలని భావించిన భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధుకు నిరాశ ఎదురైంది. ఇండోనేసియా ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 1000 టోర్నీ నుంచి సింధు నిష్క్రమించింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో సింధు 15-21, 21-15, 14-21తో వెన్‌ సు (చైనీస్‌ తైపీ) చేతిలో పరాజయం చవిచూసింది. ఒక గంటా 10 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో సింధు పోరాడినా ఫలితం లేకపోయింది. ఇప్పటి వరకు వీరిద్దరు నాలుగు సార్లు తలపడగా.. మూడింట్లో సింధు నెగ్గగా, వెన్‌కు ఇదే తొలి విజయం. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్లో అశ్విని పొన్నప్ప- తనీషా క్రాస్టో జోడీ 21-15, 21-15తో జాకీ డెంట్‌ - క్రిస్టల్‌ లాయ్‌ (కెనడా) జంటపై గెలిచి ప్రిక్వార్టర్స్‌ చేరుకుంది. మరో మ్యాచ్‌లో రుతుపర్ణ పాండా- శ్వేతపర్ణ పాండా జంట 12-21, 9-21తో కిమ్‌ యియాంగ్‌- కాంగ్‌ యాంగ్‌ (కొరియా) జోడీ చేతిలో ఓడింది.


కార్ల్‌సన్‌ చేతిలో ప్రజ్ఞానంద ఓటమి 

స్టావెంజర్‌: భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద నార్వే చెస్‌ టోర్నీ ఎనిమిదో రౌండ్లో టాప్‌ సీడ్‌ కార్ల్‌సన్‌ చేతిలో పోరాడి ఓడాడు. ఈ గెలుపుతో నకముర (అమెరికా)పై ఒక పాయింట్‌ స్పష్టమైన ఆధిక్యంతో కార్ల్‌సన్‌ (నార్వే) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మరో రెండు రౌండ్లు మిగిలి ఉన్న టోర్నీలో అతడు ప్రస్తుతం 14.5 పాయింట్లతో ఉన్నాడు. నకముర (13.5) అలీరెజా (ఫ్రాన్స్‌) చేతిలో ఓడిపోయాడు. పేలవ ఫామ్‌ను కొనసాగించిన ప్రపంచ ఛాంపియన్‌ డింగ్‌ లిరెన్‌ (చైనా).. కరువానా (అమెరికా) చేతిలో కంగుతిన్నాడు. మహిళల విభాగంలో వైశాలి (11.5).. అనా ముజిచుక్‌ (ఉక్రెయిన్‌)పై గెలిచింది. తింగ్‌జీ లీ (చైనా) చేతిలో కోనేరు హంపి (8) ఓడిపోయింది. 


పారాలింపిక్స్‌కు 13 మంది పారా షూటర్లు 

దిల్లీ: పారిస్‌ పారాలింపిక్స్‌కు భారత్‌ నుంచి 13 మంది పారా షూటర్లు అర్హత సాధించారు. ఈ ఏడాది ఆగస్టు 28న ఆరంభమయ్యే పారాలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌లో 9 విభాగాల్లో వీళ్లు పోటీపడనున్నారు. కృష్ణ నగార్, శివరాజన్, నితేశ్‌ కుమార్, మనోజ్‌ సర్కార్, మానసి జోషి, మణ్‌దీప్‌ కౌర్, సుహాస్, సుకాంత్, తరుణ్, పలక్‌ కోహ్లి, తులసీమతి, మనీష, నిత్యశ్రీ పారాలింపిక్స్‌లో అదృష్టం పరీక్షించుకోనున్నారు. టోక్యో పారాలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్‌ ఎస్‌హెచ్‌6లో కృష్ణ నగార్‌ పసిడి గెలిచిన సంగతి తెలిసిందే. ఈ సారి పారా బ్యాడ్మింటన్‌లో   కొత్తగా మహిళల సింగిల్స్‌లో ఎస్‌ఎల్‌3, ఎస్‌హెచ్‌6.. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఎస్‌హెచ్‌6 విభాగాలను చేర్చారు. 


ఫైనల్లో సరబ్‌జోత్‌ 

మ్యూనిక్‌: ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌ పురుషుల 10 మీటర్ల  ఎయిర్‌ పిస్టల్‌లో భారత షూటర్‌ సరబ్‌జోత్‌ సింగ్‌ ఫైనల్‌ చేరాడు. బుధవారం క్వాలిఫికేషన్లో 588 స్కోరుతో అతను అగ్రస్థానంలో నిలిచాడు. మరోవైపు 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌లో పురుషుల్లో చెయిన్‌ సింగ్, స్వప్నిల్, ఐశ్వరీ ప్రతాప్‌.. మహిళల్లో అంజుమ్, సిఫ్త్‌ కౌర్, ఆషి ఎలిమినేషన్‌ రౌండ్‌ దాటారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు