17ఏళ్ల మిరా మాయ

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సంచలనాల మోత. మహిళల సింగిల్స్‌లో టైటిల్‌ ఫేవరెట్లకు షాక్‌. రెండు సార్లు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత అయిన రెండో సీడ్‌ సబలెంకాకు 17 ఏళ్ల మిరా ఆంద్రీవా చెక్‌ పెట్టింది. మరోవైపు 2022 వింబుల్డన్‌ ఛాంపియన్, నాలుగో సీడ్‌ రిబకినాను పౌలీని మట్టికరిపించింది.

Published : 06 Jun 2024 03:52 IST

సబలెంకాకు షాక్‌
రిబకినా కూడా ఔట్‌
ఫ్రెంచ్‌ ఓపెన్‌

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సంచలనాల మోత. మహిళల సింగిల్స్‌లో టైటిల్‌ ఫేవరెట్లకు షాక్‌. రెండు సార్లు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత అయిన రెండో సీడ్‌ సబలెంకాకు 17 ఏళ్ల మిరా ఆంద్రీవా చెక్‌ పెట్టింది. మరోవైపు 2022 వింబుల్డన్‌ ఛాంపియన్, నాలుగో సీడ్‌ రిబకినాను పౌలీని మట్టికరిపించింది. సంచలన విజయాలు సాధించిన ఆంద్రీవా, పౌలీని తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ సెమీస్‌ చేరారు. 

పారిస్‌

ఫ్రెంచ్‌ ఓపెన్లో మిరా ఆంద్రీవా అదరగొట్టింది. బుధవారం మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో ఈ రష్యా టీనేజీ అమ్మాయి 6-7 (5-7), 6-4, 6-4 తేడాతో ప్రపంచ రెండో ర్యాంకర్‌ సబలెంకా (బెలారస్‌)పై సంచలన విజయాన్ని అందుకుంది. ఏస్‌లు, విన్నర్లతో చెలరేగిన ఆంద్రీవా తీవ్రమైన పోటీని దాటి విజేతగా నిలిచింది. హోరాహోరీగా సాగిన తొలి సెట్లో క్రీడాకారిణులిద్దరూ గొప్పగా పోరాడటంతో ఆధిపత్యం చేతులు మారింది. ఒక గేమ్‌లో సబలెంక బ్రేక్‌ పాయింట్‌ సాధిస్తే.. ఆ తర్వాత గేమ్‌లో ఆంద్రీవా బ్రేక్‌ చేస్తూ గట్టిపోటీనిచ్చింది. ఓ దశలో 5-3తో ఆమె దూసుకెళ్లింది. కానీ వరుసగా మూడు గేమ్‌లు నెగ్గిన సబలెంక అంత సులువుగా వదల్లేదు. ఆ తర్వాతి గేమ్‌లో ఆంద్రీవా గెలవడంతో పోరు టైబ్రేకర్‌కు మళ్లింది. ఇందులో సబలెంక గెలిచింది. రెండో గేమ్‌లోనూ పోరు రసవత్తరంగానే సాగింది. కానీ 4-4తో స్కోరు సమమైన తర్వాత వరుసగా రెండు గేమ్‌లు నెగ్గి ఆంద్రీవా పోటీలో నిలిచింది. ఇదే విధంగా సాగిన చివరి సెట్లోనూ ఆంద్రీవా జోరు కొనసాగించి మ్యాచ్‌ కైవసం చేసుకుంది. ఈ పోరులో ఆంద్రీవా 4 ఏస్‌లు, 43 విన్నర్లు కొట్టింది. మరో క్వార్టర్స్‌లో 12వ సీడ్‌ పౌలీని (ఇటలీ) 6-2, 4-6, 6-4 తేడాతో నాలుగో సీడ్‌ రిబకినా (కజకిస్థాన్‌)ను కంగుతినిపించింది. ఏస్‌లు (10), విన్నర్లలో (35) రిబాకినాదే పైచేయి అయినప్పటికీ సర్వీస్‌లను పాయింట్లుగా మార్చడంలో పౌలీని సఫలమైంది. తొలి గేమ్‌లోనే ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన ఆమెకు తొలి సెట్లో పెద్దగా పోటీనే ఎదురవలేదు. రెండో సెట్లో రిబకినా పుంజుకున్నా.. పౌలీని కూడా వదలకపోవడంతో ఆట పోటాపోటీగా సాగింది. 3-4తో వెనుకబడ్డ దశలో రిబకినా ఎనిమిదో గేమ్‌లో బ్రేక్‌ సాధించి ముందంజ వేసింది. ఆ తర్వాత వరుసగా రెండు గేమ్‌లు నెగ్గి పోరును నిర్ణయాత్మక సెట్‌కు తీసుకెళ్లింది. మూడో సెట్లో క్రీడాకారిణులిద్దరూ నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. పౌలీని సర్వీస్‌లు బ్రేక్‌ చేస్తే.. వెంటనే రిబకినా బ్రేక్‌ పాయిట్లు సాధించింది. కానీ తొమ్మిదో గేమ్‌లో బ్రేక్‌ పాయింట్‌ సాధించిన పౌలీని ఈ సారి మాత్రం అవకాశం ఇవ్వలేదు. సర్వీస్‌ నిలబెట్టుకుని మ్యాచ్‌ సొంతం చేసుకుంది. 

అల్కరాస్‌ జోరు: పురుషుల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో మూడో సీడ్‌ అల్కరాస్‌ (స్పెయిన్‌) 6-3, 7-6 (7-3), 6-4తో తొమ్మిదో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌)పై గెలిచాడు. విన్నర్‌తో తొలి సెట్‌ తొలి గేమ్‌లోనే బ్రేక్‌ సాధించిన అల్కరాస్‌ ఆపై 4-2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. తొమ్మిదో గేమ్‌లో మరోసారి ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసి సెట్‌ గెలుచుకున్నాడు. రెండో సెట్‌లోనూ అల్కరాస్‌ 4-1తో సులువుగానే నెగ్గేలా కనిపించాడు. కానీ గొప్పగా పుంజుకున్న సిట్సిపాస్‌ 4-4తో ప్రత్యర్థిని అందుకున్నాడు. ఈ దశలో మళ్లీ జోరందుకున్న అల్కరాస్‌.. పోరును టైబ్రేకర్‌కు మళ్లించి నెగ్గాడు. మూడో సెట్‌ 3-3 వరకూ హోరాహోరీగా సాగింది. కానీ ఏడో గేమ్‌లో బ్రేక్‌ పాయింట్‌ సాధించిన అల్కరాస్‌ ఇక వదల్లేదు. తన సర్వీసులు నిలబెట్టుకుని మ్యాచ్‌ ముగించాడు. ఈ పోరులో అతను 3 ఏస్‌లు, 27 విన్నర్లు కొట్టాడు.

సెమీస్‌లో బోపన్న జోడీ: 44 ఏళ్ల వయసులోనూ సత్తాచాటుతోన్న భారత ఆటగాడు రోహన్‌ బోపన్న.. 36 ఏళ్ల మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా)తో కలిసి పురుషుల డబుల్స్‌లో సెమీస్‌ చేరాడు. క్వార్టర్స్‌లో రెండో సీడ్‌ బోపన్న- ఎబ్డెన్‌ 7-6 (7-3), 5-7, 6-1తో పదో సీడ్‌ సాండర్‌- వీజెన్‌ (బెల్జియం)పై నెగ్గారు. రసవత్తరంగా సాగిన తొలి సెట్‌లో రెండు జోడీలూ సర్వీస్‌లు నిలబెట్టుకోవడంతో పోరు టైబ్రేకర్‌కు చేరింది. ఇందులో విన్నర్లతో బోపన్న ద్వయం పైచేయి సాధించింది. రెండో సెట్లో ఓటమి ఎదురైనా.. నిర్ణయాత్మక మూడో సెట్లో మాత్రం బోపన్న జోడీ చెలరేగింది. ఒక్క గేమ్‌ మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని