అటు స్వైటెక్‌.. ఇటు పౌలీని

ఫ్రెంచ్‌ ఓపెన్లో హ్యాట్రిక్‌పై గురి పెట్టిన ఇగా స్వైటెక్‌ (పోలెండ్‌) టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది.

Published : 07 Jun 2024 04:16 IST

ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో ప్రవేశం
పారిస్‌ 

ఫ్రెంచ్‌ ఓపెన్లో హ్యాట్రిక్‌పై గురి పెట్టిన ఇగా స్వైటెక్‌ (పోలెండ్‌) టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. దూకుడైన ఆటతో ఈ టాప్‌సీడ్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో 6-2, 6-4తో మూడోసీడ్‌ కొకోగాఫ్‌ (అమెరికా)ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో రెండో సెట్లో మాత్రమే స్వైటెక్‌కు గాఫ్‌ నుంచి పోటీ ఎదురైంది.శనివారం టైటిల్‌ పోరులో పౌలీని (ఇటలీ)తో స్వైటెక్‌ అమీతుమీ తేల్చుకోనుంది. మరో సెమీస్‌లో పన్నెండో సీడ్‌ పౌలీని 6-3, 6-1 టీనేజ్‌ సంచలనం ఆండ్రీవా (రష్యా) జోరుకు కళ్లెం వేసింది.

తుది నాలుగులో జ్వెరెవ్‌: జర్మనీ స్టార్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్లో తుది నాలుగు జాబితాలో చోటు సంపాదించాడు. పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో నాలుగో సీడ్‌ జ్వెరెవ్‌ 6-4, 7-6 (7-5), 6-4తో పదకొండో సీడ్‌ డిమినర్‌ (అర్జెంటీనా) పోరాటానికి తెరదించాడు. పురుషుల డబుల్స్‌లో రోహన్‌ బోపన్న-మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా) జోడీ జోరుకు బ్రేక్‌ పడింది. సెమీఫైనల్లో బోపన్న-ఎబ్డెన్‌ 5-7, 6-2, 2-6తో సిమోన్‌ బొలిలీ-ఆండ్రియా వావాసోరి (ఇటలీ) చేతిలో ఓడిపోయారు. మరోవైపు లారా సిగ్మండ్‌ (జర్మనీ)-రోజర్‌ వెస్లిన్‌ (ఫ్రాన్స్‌) జంట మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌ గెలుచుకుంది.

పురుషుల సెమీస్‌

అల్కరాస్‌ (స్పెయిన్‌) × సినర్‌ (ఇటలీ)
జ్వెరెవ్‌ (జర్మనీ)  × రూడ్‌ (నార్వే)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని