Sunil Chhetri: ఫుట్‌బాల్‌ ధీర

ఉత్తమ కళాశాలలో ప్రవేశం కోసం ఆ కుర్రాడు ఫుట్‌బాల్‌తో స్నేహం చేశాడు. ఈ కాంక్షే అతడిని ఆటలో మమేకం చేసింది.

Updated : 07 Jun 2024 05:09 IST

ఉత్తమ కళాశాలలో ప్రవేశం కోసం ఆ కుర్రాడు ఫుట్‌బాల్‌తో స్నేహం చేశాడు. ఈ కాంక్షే అతడిని ఆటలో మమేకం చేసింది. అత్యుత్తమ ప్రదర్శన.. అసాధారణ నైపుణ్యాలను రాబట్టి భారత ఫుట్‌బాల్‌కే చిరునామాగా మార్చింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు జాతీయ జట్టుతో సాగాడు. ఆటకు ఆదరణ పెంచి.. ఫుట్‌బాల్‌ను కెరీర్‌గా ఎంచుకునేలా యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. ఆ భారత దిగ్గజమే సునీల్‌ ఛెత్రి. ఇప్పుడు ఆ ప్రేమకు వీడ్కోలు చెబుతూ.. ఆ బంధానికి ముగింపు పలుకుతూ.. ఆటను వదిలేశాడు. 

ఈనాడు క్రీడావిభాగం

కప్పటిలా ఫుట్‌బాల్‌కు ఆదరణ లేదని.. ఆటను పట్టించుకునే వాళ్లు కరవయ్యారని.. సవాళ్ల దారిలో వెళ్లాల్సి ఉంటుందని తెలుసు. కానీ ఛెత్రి మాత్రం ఫుట్‌బాల్‌ ప్రయాణాన్ని ప్రారంభించాడు. అడ్డంకులు అధిగమించాడు. గొప్ప ప్రదర్శనతో ఫుట్‌బాల్‌ గురించి తిరిగి మాట్లాడుకునేలా చేశాడు. అద్భుతమైన నాయకత్వ లక్షణాలతో అదరగొట్టాడు. సుమారు రెండు దశాబ్దాలుగా జట్టు భారాన్ని మోశాడు. తనను ఆపేందుకు ప్రత్యర్థి జట్లు ప్రత్యేక ప్రణాళికలు వేసేలా.. తనపైనే భారతావని ఆశలు పెట్టుకునే స్థాయికి ఎదిగాడు. భారత ఫుట్‌బాల్‌కు పర్యాయపదంగా మారాడు. 2005లో పాకిస్థాన్‌తో పోరుతో 21 ఏళ్ల వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అతను.. ఇప్పుడు 39 ఏళ్ల వయసులో కువైట్‌తో మ్యాచ్‌తో దిగ్గజంగా రిటైరయ్యాడు. అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన, అత్యధిక గోల్స్‌ చేసిన భారత ఆటగాడు అతనే. మరెన్నో రికార్డులు ఖాతాలో వేసుకోవడమే కాకుండా దేశంలో ఫుట్‌బాల్‌కు తిరిగి ఆదరణ పెంచడంలోనూ ఛెత్రి ప్రధాన పాత్ర పోషించాడు. అతణ్ని ప్రేరణగా తీసుకుని ఇప్పుడు ఎంతో మంది ఆట వైపు వస్తున్నారు. ఆధునిక భారత ఫుట్‌బాల్‌కు అతనో మార్గదర్శి. 1984లో మన సికింద్రాబాద్‌లో పుట్టిన ఛెత్రి.. 2002లో మోహన్‌ బగాన్‌ క్లబ్‌తో ప్రొఫెషనల్‌ కెరీర్‌ ప్రారంభించాడు. అతని తల్లిదండ్రులు, సోదరీమణులు కూడా ఫుట్‌బాల్‌ ప్లేయర్లే కావడం విశేషం. రక్తంలోనే ఆటను నింపుకొన్న అతను 11 అంతర్జాతీయ టైటిళ్లు గెలిచాడు. జట్టు 2007, 2009, 2012లో నెహ్రూ కప్‌.. 2011, 2015, 2021, 2023 శాఫ్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిళ్లు సొంతం చేసుకోవడంలో ఛెత్రి కీలకంగా వ్యవహరించాడు. 39 ఏళ్ల వయసులోనూ ప్రస్తుత భారత ఫుట్‌బాల్‌ గురించి మాట్లాడుకోవాల్సి ముందు గుర్తొచ్చేది ఛెత్రినే. అతడి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్నది సమాధానం లేని ప్రశ్న.

ఎవరొస్తారు? 

ఛెత్రి కంటే ముందు భారత ఫుట్‌బాల్‌లో ప్రతిభావంతులైన ఆటగాళ్లున్నారు. ఛెత్రి ఆడుతున్నప్పుడు కూడా ఎంతో మంది వచ్చారు. అతని రిటైర్మెంట్‌ తర్వాత కూడా మరెంతోమంది జాతీయ జట్టుకు ఆడతారు. కానీ అతనిలాంటి ఆటగాడు మరొకరు వస్తారా? అంటే కచ్చితంగా అవునని సమాధానం చెప్పలేం! ఆ 9వ నంబర్‌కు న్యాయం చేసేవాళ్లు రావడం కష్టమే. అలాంటి స్ట్రైకర్‌ వారసత్వాన్ని కొనసాగించడమంటే మాటలు కాదు. బాక్స్‌ లోపల ఫినిషింగ్‌ నైపుణ్యాలు, తలతో బంతిని లోపలికి పంపే తీరు, కచ్చితమైన పాస్‌లు అందించే విధానం, బంతిని నియంత్రణలో ఉంచుకోవడం, నిలకడగా దాడి కొనసాగించడం.. ఇలా ఛెత్రి తనదైన ముద్ర వేశాడు. అతని స్థానంలో ఆడేందుకు చాలా మంది ఆటగాళ్లే రేసులో ఉన్నా, ఆ స్థాయిని అందుకోవడానికి తీవ్రంగా శ్రమించక తప్పదు. 22 ఏళ్ల విక్రమ్‌ ప్రతాప్‌ సింగ్‌ ముంబయి సిటీ తరపున ఈ సీజన్‌లో 8 గోల్స్‌ కొట్టాడు. ఛెత్రిలా అతను మైదానంలో తీవ్రత చూపిస్తాడు. శారీరక సామర్థ్యం, మెరుగైన ఫిట్‌నెస్‌తో 24 ఏళ్ల రహీం అలీ ఉన్నాడు. అతను ఏటీకే మోహన్‌ బగాన్‌ తరపున ఐఎస్‌ఎల్‌లో 17 మ్యాచ్‌ల్లో 6 గోల్స్‌ సాధించాడు. నార్త్‌ఈస్ట్‌ యునైటెడ్‌ ఎఫ్‌సీ తరపున ఐఎస్‌ఎల్‌లో 18 మ్యాచ్‌ల్లో 10 గోల్స్‌ చేసిన 28 ఏళ్ల మన్వీర్‌ సింగ్‌కు బంతిపై మంచి నియంత్రణ ఉంది. వీళ్లతో పాటు కుర్రాళ్లు శివశక్తి నారాయణన్, లాలియాంజులా చాంగ్టె, పార్థిబ్‌ గొగోయ్, కియాన్‌ నాసిరి, గుర్‌కీరత్‌ సింగ్‌ కూడా ఉన్నారు. ఈ ప్రతిభావంతులైన ఆటగాళ్లను జాగ్రత్తగా సానబెట్టాల్సిన అవసరం ఉంది. జట్టులో ఒక్కరిపైనే దృష్టి సారించకుండా నాలుగైదుగురిని ఛెత్రి స్థాయికి తీసుకొస్తే అప్పుడు ప్రపంచకప్‌లో భారత్‌ ఆడే రోజు మరెంతో దూరంలో ఉండదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని