రవూఫ్‌ బాల్‌ ట్యాంపరింగ్‌ చేశాడు: అమెరికా పేసర్‌

పాకిస్థాన్‌ పేసర్‌ హారిస్‌ రవూఫ్‌ బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడంటూ అమెరికా బౌలర్‌ రస్టీ థెరాన్‌ సంచలన ఆరోపణ చేశాడు.

Published : 08 Jun 2024 03:02 IST

డలాస్‌: పాకిస్థాన్‌ పేసర్‌ హారిస్‌ రవూఫ్‌ బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడంటూ అమెరికా బౌలర్‌ రస్టీ థెరాన్‌ సంచలన ఆరోపణ చేశాడు. ఇన్నింగ్స్‌ ముగియడానికి రెండు ఓవర్ల ముందు మార్చిన బంతిని రవూఫ్‌ గోటితో గీకడం వల్లే రివర్స్‌ స్వింగ్‌ సాధ్యమైందని విమర్శించాడు. ‘‘మ్యాచ్‌ మధ్యలో మార్చిన బంతిని పాక్‌ ట్యాంపర్‌ చేయలేదని నటిద్దామా? కేవలం 2 ఓవర్ల ముందు మార్చిన బంతితో రివర్స్‌ స్వింగా? రవూఫ్‌ తన బొటన వేలి గోటితో బంతిపై గీకడాన్ని స్పష్టంగా చూడొచ్చు’’ అని ఎక్స్‌లో ఐసీసీని ట్యాగ్‌ చేస్తూ థెరాన్‌ పేర్కొన్నాడు.


దయనీయమైన ప్రదర్శన: అక్రమ్చ్‌

డలాస్‌: టీ20 ప్రపంచకప్‌లో అమెరికా చేతిలో ఓడిన పాకిస్థాన్‌పై మాజీ ఆటగాడు వసీం అక్రమ్‌ విరుచుకుపడ్డాడు.    ‘‘దయనీయమైన ప్రదర్శన. ఆటలో గెలుపోటములు భాగం. కాని చివరి బంతి వరకు పోరాడాలి. పాక్‌ క్రికెట్‌కు ఇదో మచ్చ. ఇక్కడ్నుంచి సూపర్‌ 8కు అర్హత సాధించడానికి పాక్‌ చాలా కష్టపడాలి. ఈనెల 9న భారత్‌.. ఆ తర్వాత మరో రెండు మంచి జట్లు ఐర్లాండ్, కెనడాతో పాక్‌ తలపడాలి’’ అని అక్రమ్‌ తెలిపాడు.


సిఫ్త్‌ కౌర్‌కు కాంస్యం 

మ్యూనిక్‌: ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌ షూటింగ్‌లో భారత క్రీడాకారిణి సిఫ్త్‌ కౌర్‌ శర్మ మెరిసింది. మహిళల 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌లో కాంస్య పతకం సాధించింది. శుక్రవారం ఫైనల్లో సిఫ్త్‌ 452.9 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. కేవలం 0.1 పాయింటు తేడాతో రజతం కోల్పోయింది. ప్రపంచ నంబర్‌వన్‌ సియోనైడ్‌ మెకింతోష్‌ (466.7- ఇంగ్లాండ్‌) స్వర్ణం, ఎయిర్‌ రైఫిల్‌ ప్రపంచ ఛాంపియన్‌ హాన్‌ జియాయు (452.8- చైనా) రజత పతకాలు గెలిచారు. ఈ టోర్నీని భారత్‌ రెండు పతకాలతో ముగించింది.


లక్ష్యసేన్‌ ఔట్చ్‌

జకార్త: ఇండోనేసియా ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 1000 టోర్నీలో భారత స్టార్‌ ఆటగాడు లక్ష్యసేన్‌ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో లక్ష్యసేన్‌ 22-24, 18-21తో ఆండర్స్‌ ఆంథోన్సెన్‌ (డెన్మార్క్‌) చేతిలో పరాజయం చవిచూశాడు. 61 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో చివరికి ప్రత్యర్థిదే పైచేయి అయింది.


ప్రజ్ఞానంద ఓటమి 

స్టావెంజర్‌ (నార్వే): భారత గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌.ప్రజ్ఞానంద (13 పాయింట్లు)కు నార్వే చెస్‌ టోర్నీలో పరాజయం ఎదురైంది. తొమ్మిదో రౌండ్లో ఫాబియానో కరువానా (10.5- అమెరికా) చేతిలో ప్రజ్ఞానంద ఓటమి పాలయ్యాడు. ఫిరౌజా అలీరెజా (12- ఫ్రాన్స్‌)పై మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (16- నార్వే) విజయం సాధించాడు. కార్ల్‌సన్, నకముర (14.5- అమెరికా), ప్రజ్ఞానంద వరుసగా తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. మహిళల విభాగంలో వెంజున్‌ జు (16- చైనా) చేతిలో కోనేరు హంపి (9) పరాజయంపాలైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని