అమెరికాకు ఆశలు..

భారత్, పాకిస్థాన్, అమెరికా, కెనడా, ఐర్లాండ్‌.. ఇవీ టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్‌- ఎ జట్లు. ప్రతి గ్రూప్‌లోనూ ఒక్కో జట్టు.. మిగతా నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతోంది.

Published : 08 Jun 2024 03:12 IST

డల్లాస్‌: భారత్, పాకిస్థాన్, అమెరికా, కెనడా, ఐర్లాండ్‌.. ఇవీ టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్‌- ఎ జట్లు. ప్రతి గ్రూప్‌లోనూ ఒక్కో జట్టు.. మిగతా నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతోంది. గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్‌-8కు అర్హత సాధిస్తాయి. ఈ నేపథ్యంలో గ్రూప్‌- ఎ నుంచి భారత్, పాకిస్థాన్‌ కచ్చితంగా ముందంజ వేస్తాయనే అంచనాలు నెలకొన్నాయి. కానీ పాక్‌పై సంచలన విజయంతో సమీకరణాలను అమెరికా మార్చేసింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ముగిసిన ఈ మ్యాచ్‌లో.. సూపర్‌ ఓవర్లో యుఎస్‌ అద్భుత విజయాన్ని అందుకుంది. మొదట పాక్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. ఛేదనలో యుఎస్‌ కూడా 20 ఓవర్లలో 3 వికెట్లకు 159 పరుగులే చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కెప్టెన్‌ మోనాంక్‌ పటేల్‌ (50) విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆండ్రీస్‌ గౌస్‌ (35), ఆరోన్‌ జోన్స్‌ (36 నాటౌట్‌) కీలక పరుగులు చేశారు. అనంతరం సూపర్‌ ఓవర్లో మొదట అమెరికా 18 పరుగులు చేసింది. అమీర్‌ వేసిన ఈ ఓవర్లో వైడ్ల రూపంలోనే 7 పరుగులు రావడం గమనార్హం. ఆ తర్వాత సౌరభ్‌ గొప్పగా బౌలింగ్‌ చేయడంతో పాక్‌ 13 పరుగులకే పరిమితమైంది. అమెరికా ఇప్పటికే కెనడాపై గెలిచింది. రెండు విజయాలతో గ్రూప్‌లో అగ్రస్థానంలో ఉంది. ఇంకా భారత్, ఐర్లాండ్‌తో ఆడాల్సి ఉంది. ఒకవేళ భారత్‌తో ఓడిపోయినా.. ఐర్లాండ్‌పై గెలిస్తే అమెరికా సూపర్‌-8కు అర్హత సాధించడం తేలికే. మిగతా రెండు మ్యాచ్‌ల్లో ఓడినా ఆ జట్టు అవకాశాలను కొట్టిపారేయలేం. పాక్‌ ఇంకా భారత్, కెనడా, ఐర్లాండ్‌తో ఆడాల్సి ఉంది. టీమ్‌ఇండియా చేతిలో ఓడి, మిగతా మ్యాచ్‌ల్లో గెలిచినా పాక్‌ ముందంజ వేయడం కష్టమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని