సంక్షిప్త వార్తలు (5)

దాదాపు రెండు దశాబ్దాలుగా భారత ఫుట్‌బాల్‌ చిరునామాగా కొనసాగిన సునీల్‌ ఛెత్రి లేకుండా మన జట్టు కఠిన పరీక్షకు సిద్ధమైంది. ఇటీవల కువైట్‌తో మ్యాచ్‌తో ఛెత్రి అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే.

Updated : 11 Jun 2024 06:16 IST

ఛెత్రి లేని జట్టుకు కఠిన పరీక్ష
నేడు ఖతార్‌తో పోరు

దోహా: దాదాపు రెండు దశాబ్దాలుగా భారత ఫుట్‌బాల్‌ చిరునామాగా కొనసాగిన సునీల్‌ ఛెత్రి లేకుండా మన జట్టు కఠిన పరీక్షకు సిద్ధమైంది. ఇటీవల కువైట్‌తో మ్యాచ్‌తో ఛెత్రి అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిఫా ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ రెండో రౌండ్లో భాగంగా గోల్‌కీపర్‌ గుర్‌ప్రీత్‌ సింగ్‌ సారథ్యంలో మంగళవారం ఖతార్‌తో భారత్‌ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్‌ మొట్టమొదటి సారి మూడో రౌండ్‌కు అర్హత సాధిస్తుంది. కానీ ఇప్పటికే రెండో రౌండ్‌ దాటిన బలమైన ఖతార్‌పై గెలవడం అంత సులువేం కాదు. ప్రస్తుతం గ్రూప్‌- ఎలో అయిదేసి మ్యాచ్‌లాడిన ఖతార్‌ (4 విజయాలు, ఒక డ్రా), భారత్‌ (ఒక విజయం, రెండేసి డ్రాలు, ఓటములు), అఫ్గానిస్థాన్‌ (ఒక విజయం, రెండేసి డ్రాలు, ఓటములు), కువైట్‌ (ఒక గెలుపు, ఒక డ్రా, మూడు ఓటములు) వరుసగా 1 నుంచి 4 స్థానాల్లో ఉన్నాయి. ఒకవేళ ఖతార్‌తో భారత్‌ డ్రా చేసుకున్నా ముందంజ వేసే అవకాశముంటుంది. కానీ ఆ వెంటనే జరిగే అఫ్గానిస్థాన్‌- కువైట్‌ మ్యాచ్‌ కూడా డ్రా కావాలి. అప్పుడు భారత్, అఫ్గాన్‌ చెరో 6 పాయింట్లతో సమానంగా ఉన్నా.. మెరుగైన గోల్స్‌ అంతరంతో మన జట్టు మూడో రౌండ్‌ చేరుతుంది. 


దివ్య ముందంజ

గాంధీనగర్‌: ప్రపంచ జూనియర్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ దివ్య దేశ్‌ముఖ్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది. సోమవారం ఎనిమిదో రౌండ్లో నార్మన్‌ సెనియా (రష్యా)ను ఆమె ఓడించింది. దీంతో 7 పాయింట్లతో దివ్య ముందంజలో ఉంది. మరో భారత అమ్మాయి రక్షిత రవి, మరియమ్‌ (ఆర్మేనియా) 6.5 పాయింట్లతో ఉమ్మడిగా రెండో స్థానంలో నిలిచారు. ఎనిమిదో రౌండ్లో కల్‌డ్రోవా (రష్యా)పై రక్షిత విజయం సాధించింది. తేజస్విని.. సురభి చేతిలో ఓడగా..  మృదుల్‌తో పోరులో వైష్ణవి పరాజయం చవిచూసింది. ఈ టోర్నీలో మరో మూడు రౌండ్లు మిగిలున్నాయి.


లాహోర్‌ వేదికగా భారత్‌ వేట!

లాహోర్‌: వచ్చే ఏడాది పాకిస్థాన్‌ ఆతిథ్యమిచ్చే ఛాంపియన్స్‌ ట్రోఫీలో లాహోర్‌ వేదికగా భారత్‌ మ్యాచ్‌లు ఆడే అవకాశాలున్నట్లు పీసీబీ వర్గాలు తెలిపాయి. 2025 ఏప్రిల్‌లో జరిగే ఈ ఈవెంట్లో పాల్గొనే భారత జట్టుకు ప్రయాణ భారాన్ని తగ్గించడం కోసం.. ఉత్తమమైన భద్రత కల్పించడానికి లాహోర్‌ను ఎంచుకోవాలని పీసీబీ యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ టోర్నీలో ఇతర మ్యాచ్‌లకు రావల్పిండి, కరాచి వేదికలుగా నిలవనున్నాయి. గతేడాది భద్రతా కారణాలతో ఆసియాకప్‌ ఆడేందుకు పాకిస్థాన్‌ రావడానికి టీమ్‌ఇండియా అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో తటస్థ వేదిక శ్రీలంకలో భారత్‌ మ్యాచ్‌లు ఆడింది. అయితే ఛాంపియన్స్‌ ట్రోఫీ షెడ్యూల్‌ని ఐసీసీ ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. 


అప్పుడు కళ్లల్లో నీళ్లు తిరిగాయి: రవిశాస్త్రి 

న్యూయార్క్‌: భారత వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌కు ఘోర రోడ్డు ప్రమాదం జరగడం తనను కన్నీళ్లు పెట్టించిందని మాజీ ఆటగాడు రవిశాస్త్రి అన్నాడు. పంత్‌ను ఆసుపత్రిలో చూసినప్పుడు బాధ మరింత తీవ్రమైనట్లు చెప్పాడు. ‘‘పంత్‌ ప్రమాదం గురించి చదివినప్పుడు నా కళ్లల్లో నీళ్లు వచ్చాయి. అతడిని ఆసుపత్రిలో చూసినప్పుడు అంతకంటే ఎక్కువగా చలించిపోయా. ఆ స్థితి నుంచి క్రికెట్లో అత్యున్నత పోరాటమైన భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్‌లో అతను ఆడుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి పంత్‌ జీవితం ప్రేరణ. కష్టాలు, మృత్యు ముఖం నుంచి విజయాన్ని ఎలా లాక్కోవచ్చో చూపించాడు’’ అని రవిశాస్త్రి తెలిపాడు.


ప్రణయ్‌ సత్తాచాటేనా! 

సిడ్నీ: భారత స్టార్‌ ఆటగాడు హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 టోర్నీ సవాల్‌కు సిద్ధమయ్యాడు. పారిస్‌ ఒలింపిక్స్‌కు ముందు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సత్తాచాటి ఫామ్‌లోకి రావాలని ప్రణయ్‌ ఉవ్విళ్లూరుతున్నాడు. మంగళవారం ప్రారంభమయ్యే ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో వైగర్‌ కోలో (బ్రెజిల్‌)తో ప్రణయ్‌ తలపడనున్నాడు. రిక్కీ టాంగ్‌ (ఆస్ట్రేలియా)తో సమీర్, ఆల్వి (ఇండోనేసియా)తో మిథున్, షెంగ్‌ (కెనడా)తో కిరణ్‌ జార్జ్‌ పోటీపడనున్నారు. మహిళల సింగిల్స్‌లో పై యి (చైనీస్‌ తైపీ)తో సామియా, పొలీనా బురోవా (ఉక్రెయిన్‌)తో ఆకర్షి కశ్యప్, మాళవిక బాన్సోద్‌తో కెయుర మోపాటి, లూసియా కాస్టిలో (పెరూ)తో అష్మిత చాలిహా తమ పోరాటం ప్రారంభించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని