ఈ ఆటతో కప్పు వస్తుందా?

పాకిస్థాన్‌తో భారత్‌ పోరు అంటే ఉండే తీవ్రతే వేరు. చిరకాల ప్రత్యర్థిపై టీమ్‌ఇండియా గెలవాలని దేశమంతా కోరుకుంటుంది. అలాంటి ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌లో మన బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. నిర్లక్ష్యంగా ఆడి పెవిలియన్‌ చేరారు. బంతితో బుమ్రా మాయ చేశాడు కాబట్టి సరిపోయింది లేదంటే పాక్‌ చేతిలో పరాభవం తప్పేది కాదు.

Updated : 11 Jun 2024 07:41 IST

పాకిస్థాన్‌తో భారత్‌ పోరు అంటే ఉండే తీవ్రతే వేరు. చిరకాల ప్రత్యర్థిపై టీమ్‌ఇండియా గెలవాలని దేశమంతా కోరుకుంటుంది. అలాంటి ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌లో మన బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. నిర్లక్ష్యంగా ఆడి పెవిలియన్‌ చేరారు. బంతితో బుమ్రా మాయ చేశాడు కాబట్టి సరిపోయింది లేదంటే పాక్‌ చేతిలో పరాభవం తప్పేది కాదు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ సేన ఆటతీరు ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఇలాంటి జట్టుతో, ఈ స్థాయి ప్రదర్శనతో కప్పు దక్కుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈనాడు క్రీడావిభాగం

టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటిగా టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా అడుగుపెట్టింది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను చిత్తుచేసింది. కానీ అత్యంత కీలకమైన, ప్రపంచం దృష్టిని ఆకర్షించిన పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో మాత్రం త్రుటిలో పరాజయాన్ని తప్పించుకుంది. ప్రత్యర్థి స్థానంలో పాక్‌ కాకుండా వేరే జట్టు ఉండి ఉంటే భారత్‌ ఓడిపోయేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా బ్యాటర్లు తేలిపోయారు. నాసా కౌంటీ స్టేడియంలోని డ్రాప్‌ఇన్‌ పిచ్‌లు పేస్‌కు అనుకూలిస్తున్నాయని తెలుసు. పరిస్థితులు బౌలర్లకు వరంగా.. బ్యాటర్లకు కఠినంగా ఉన్నాయని కూడా తెలుసు. కానీ అదే మైదానంలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో పిచ్‌ ఇబ్బందిపెట్టిన దానికంటే బ్యాటర్ల నిర్లక్ష్యపు శాతమే ఎక్కువ. ఇది 119 పరుగులకు పరిమితమయ్యే పిచ్‌ ఏ మాత్రం కాదు. 150కి పైగా పరుగులు సాధించే సంకేతాలు కనిపించాయి. భారత ఓపెనర్లు ఇద్దరూ ఆరంభంలోనే నిష్క్రమించినప్పటికీ.. పది ఓవర్ల వరకు భారత్‌ మెరుగైన స్థితిలోనే కనిపించింది. కానీ ఆ తర్వాత టీమ్‌ఇండియా బ్యాటర్లే నిర్లక్ష్యంగా ఆడి వికెట్లు పారేసుకున్నారు. పాకిస్థాన్‌ ఫీల్డర్లకు క్యాచ్‌ల ప్రాక్టీస్‌ కోసమన్నట్లు బంతిని గాల్లోకి లేపి పెవిలియన్‌కు వరుస కట్టారు. భారత ఇన్నింగ్స్‌లో 8 మంది క్యాచౌటయ్యారు. ప్రత్యర్థి పేసర్లకు దాసోహమన్నారు. వరుసగా వికెట్లు పడుతున్నప్పుడు కాస్త జాగ్రత్తగా క్రీజులో కుదురుకుందామనే తాపత్రయం ఎవరిలోనూ కనిపించలేదు. భారత జట్టులో అత్యధిక స్కోరు చేసిన పంత్‌ కూడా చాలాముందే పెవిలియన్‌ చేరాల్సింది. పాక్‌ ఫీల్డర్ల పేలవ ఫీల్డింగ్‌తో అతడు బతికిపోయాడు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లోనే పికప్‌ షాట్‌తో సిక్సర్‌ కొట్టిన రోహిత్‌.. అదే తరహా షాట్‌తో బంతిని గాల్లోకి లేపి ఔటయ్యాడు. ఐపీఎల్‌లో అదరగొట్టిన విరాట్‌ కోహ్లి, శివమ్‌ దూబె ఈ ప్రపంచకప్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విఫలమయ్యారు. కీలక సమయాల్లో నిలబడాల్సింది పోయి వికెట్లు సమర్పించుకున్నారు. కవర్‌ పాయింట్‌ ఫీల్డర్‌కు విరాట్, బౌలర్‌కు దూబె లడ్డూ లాంటి క్యాచ్‌లిచ్చారు. సూర్యకుమార్, హార్దిక్, జడేజా కూడా అంతే. పంత్‌ కూడా ఓపిక నశించి అనవసరమైన షాట్‌ ఆడి నిష్క్రమించాడు. ఓ దశలో 89/3తో మెరుగ్గా కనిపించిన భారత్‌.. ఆ తర్వాత 30 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఈ అనూహ్య పతనానికి ప్రత్యర్థి పేసర్ల ఉత్తమ బౌలింగ్‌ కంటే కూడా మన బ్యాటర్ల షాట్ల ఎంపిక, బాధ్యతారాహిత్యమే కారణం. 

క్యాచ్‌లూ పట్టలేక..

అసలే స్వల్ప లక్ష్యం. గెలుపు అవకాశాలు ఉండాలంటే వికెట్లు పడగొట్టి ఒత్తిడి పెంచాల్సిందే. కానీ పాక్‌ ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే వరుసగా రెండు ఓవర్లలో ఓపెనర్ల క్యాచ్‌లను భారత ఫీల్డర్లు జారవిడిచారు. బుమ్రా వేసిన ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌ నాలుగో బంతికి రిజ్వాన్‌ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను ఫైన్‌లెగ్‌లో దూబె నేలపాలు చేశాడు. ఆ తర్వాతి ఓవర్‌ తొలి బంతికే సిరాజ్‌ తన బౌలింగ్‌లోనే బాబర్‌ క్యాచ్‌ను ఒడిసి పట్టలేకపోయాడు. మరోవైపు బౌలింగ్‌ కూడా సరిదిద్దుకోవాల్సి ఉంది. బుమ్రాకు కొత్త బంతిని ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్న కలుగుతోంది. దిగ్గజ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌ కూడా ఇదే సందేహం లేవనెత్తాడు. మిగతా ఇద్దరు ప్రధాన పేసర్లు సిరాజ్, అర్ష్‌దీప్‌ తగినంత ప్రభావం చూపలేకపోయారు. ఉత్కంఠ పరిస్థితుల్లోనూ అనవసరంగా నోబాల్, వైడ్లు వేశారు. బుమ్రా సంచలన బౌలింగ్‌తో భారత్‌ గట్టెక్కింది. ఇప్పటికైతే గండం గడిచింది. కానీ సూపర్‌-8, ఆ తర్వాత మ్యాచ్‌లు మరింత కీలకమవుతాయి. చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి రావొచ్చు. అప్పుడూ ఇలాంటి ప్రదర్శనే చేస్తే భారత్‌ నిష్క్రమించక తప్పదు. అందుకే బ్యాటింగ్, ఫీల్డింగ్‌ను మెరుగుపర్చుకోవడంపై టీమ్‌ఇండియా దృష్టి పెట్టాలి. బౌలింగ్‌ మరింత పుంజుకోవాలి. బుమ్రాకు మిగతా బౌలర్ల నుంచి సహకారం అందితే బౌలింగ్‌లో తిరుగుండదు. పాక్‌తో మ్యాచ్‌ నుంచి పాఠాలు నేర్చుకుని, తప్పులు సరిదిద్దుకుంటే భారత్‌ కప్‌ దిశగా అడుగులు వేసే అవకాశముంది.


‘‘నిరాశజనకమైన బ్యాటింగ్‌ ప్రదర్శన. సరిగ్గా చెప్పాలంటే టీమ్‌ఇండియా బ్యాటర్లలో అహంకారం, నిర్లక్ష్యం కనిపించింది. ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి ప్రతి బంతిని కొట్టాలనే దృక్పథంతోనే ఆడారు. ఇదేమీ ఐర్లాండ్‌ బౌలింగ్‌ కాదు. ఐర్లాండ్‌ను కించపర్చాలని కాదు కానీ పాకిస్థాన్‌ బౌలింగ్‌ దళానికి ఎంతో అనుభవముంది. బంతి ప్రభావం చూపుతున్నప్పుడు ఆ బౌలింగ్‌ను గౌరవించాలి. ఒక ఓవర్‌ మిగిలి ఉండగానే ఆలౌటవడమనదే ఆటగాళ్ల ఆలోచనా విధానం సరిగ్గా లేదని చాటుతోంది. బౌలింగ్‌ దాడిని బుమ్రాతో ఎందుకు ఆరంభించలేదు. అతను ప్రపంచంలోనే ఉత్తమ ఫాస్ట్‌బౌలర్‌. కానీ అతనికి కొత్త బంతి ఇవ్వలేదు. రెండు ఓవర్లు గడిస్తే బంతి ప్రభావం తగ్గుతుంది. అయినా మూడో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన బుమ్రాకు రిజ్వాన్‌ వికెట్‌ దక్కేదే. కానీ దూబె క్యాచ్‌ వదిలేశాడు. తన రెండో ఓవర్లో అతను బాబర్‌ను పెవిలియన్‌ చేర్చాడు. మూడో ఓవర్లో రిజ్వాన్‌ను వెనక్కిపంపాడు. వికెట్లు తీసే అలాంటి బౌలర్‌ను ఎదురు చూసేలా చేయకూడదు’’

సునీల్‌ గావస్కర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని