T20 World Cup 2022: ఇంగ్లాండ్‌దే.. పొట్టి కప్పు

అత్యుత్తమ జట్టునే విజయం వరించింది. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ను ఇంగ్లాండ్‌ సొంతం చేసుకుంది. ఇప్పటికే వన్డేల్లో ప్రపంచ ఛాంపియన్‌గా కొనసాగుతున్న ఇంగ్లిష్‌ జట్టు.. టీ20ల్లోనూ జగజ్జేతగా అవతరించింది. ఆదివారం ఫైనల్లో ఇంగ్లాండ్‌ 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. మొదట పాక్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులే చేయగలిగింది. అనంతరం ఇంగ్లాండ్‌ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

Updated : 14 Nov 2022 07:00 IST

కరన్‌ సూపర్‌ బౌలింగ్‌

స్టోక్స్‌ అద్భుత ఇన్నింగ్స్‌

ఫైనల్లో పాకిస్థాన్‌ పరాజయం

అత్యుత్తమ జట్టునే విజయం వరించింది. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ను ఇంగ్లాండ్‌ సొంతం చేసుకుంది. ఇప్పటికే వన్డేల్లో ప్రపంచ ఛాంపియన్‌గా కొనసాగుతున్న ఇంగ్లిష్‌ జట్టు.. టీ20ల్లోనూ జగజ్జేతగా అవతరించింది. ఆదివారం ఫైనల్లో ఇంగ్లాండ్‌ 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. మొదట పాక్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులే చేయగలిగింది. అనంతరం ఇంగ్లాండ్‌ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బ్యాటింగ్‌ వైఫల్యంతో పాక్‌కు ముందే విజయావకాశాలు సన్నగిల్లాయి. తర్వాత చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థికి కళ్లెం వేసినా.. లక్ష్యం చిన్నది కావడంతో కాపాడుకోలేకపోయింది.


296 : ఈ ప్రపంచకప్‌లో కోహ్లి పరుగులు. 6 మ్యాచ్‌ల్లో అతను 98.66 సగటు నమోదు చేశాడు. టోర్నీ టాప్‌స్కోరర్‌ కోహ్లీనే. శ్రీలంక స్పిన్నర్‌ హసరంగ అత్యధిక వికెట్లు (8 మ్యాచ్‌ల్లో 15) పడగొట్టాడు.


పాకిస్థాన్‌ ఆశలు గల్లంతు. బాబర్‌ బృందానికి భంగపాటు. మెల్‌బోర్న్‌లో     ఆ జట్టుకు నిరాశ తప్పలేదు. 1992 పునరావృతం కాలేదు. క్లైమాక్స్‌లో కథ మారింది. ఇంగ్లాండే ధనాధన్‌ ప్రపంచ ఛాంపియన్‌. అటు బంతితో ఇటు బ్యాటుతో ఆధిపత్యాన్ని చాటుకున్న బట్లర్‌ బృందం.. ఫైనల్లో పెద్దగా నాటకీయతకు తావివ్వకుండా పాక్‌ను మట్టికరిపించి ట్రోఫీని ముద్దాడింది.


సామ్‌ కరన్‌, స్టోక్స్‌ ఇంగ్లాండ్‌ హీరోలు. సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ కరన్‌ అద్భుత బౌలింగ్‌తో పాకిస్థాన్‌కు కళ్లెం వేస్తే.. 2019 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో లాగే ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచిన స్టోక్స్‌ జట్టును విజయతీరాలకు చేర్చాడు. క్రికెట్‌ పుట్టిళ్లయినా ఒక్క కప్పూ గెలవలేదని సానుభూతి పొందిన ఇంగ్లాండ్‌కు 12 ఏళ్లలో ఇది మూడో ప్రపంచకప్‌ కావడం విశేషం.


ఇంగ్లాండ్‌ ఇప్పుడు సంపూర్ణ పరిమిత ఓవర్ల క్రికెట్‌ విశ్వవిజేత. 2019లో వన్డే ట్రోఫీని గెలుచుకున్న ఆ జట్టు.. ఏకకాలంలో రెండు ఫార్మాట్లలో ట్రోఫీ కలిగి ఉన్న తొలి జట్టుగా ఘనత సాధించింది.

న్ని విభాగాల్లోనూ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఇంగ్లాండ్‌ జట్టు   రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను చేజిక్కించుకుంది. 1992 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లోలాగే ఆ జట్టును ఓడించి కప్పును గెలుచుకోవాలనుకున్న పాకిస్థాన్‌ కల చెదిరింది. ఆదివారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సామ్‌ కరన్‌ (3/12) అద్భుత బౌలింగ్‌ ఫలితంగా మొదట పాకిస్థాన్‌ 8 వికెట్లకు 137 పరుగులే చేయగలిగింది. షాన్‌ మసూద్‌ (38;   28 బంతుల్లో 2×4, 1×6) టాప్‌ స్కోరర్‌. ఆదిల్‌ రషీద్‌ (2/22), జోర్డాన్‌ (2/27) కూడా పాక్‌ కట్టడిలో కీలక పాత్ర పోషించారు. ఒత్తిడిని తట్టుకుంటూ బెన్‌ స్టోక్స్‌  (52 నాటౌట్‌; 49 బంతుల్లో 5×4, 1×6) అమూల్యమైన ఇన్నింగ్స్‌ ఆడడంతో లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సామ్‌ కరన్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ మ్యాచ్‌’తో పాటు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద టోర్నీ’ అవార్డును గెలుచుకున్నాడు.

స్టోక్స్‌ కడదాకా..: ఛేదనలో స్టోక్సే హీరో. లక్ష్యం చిన్నదే అయినా పాక్‌ అంత తేలిగ్గా మ్యాచ్‌ను వదల్లేదు. ఇంగ్లాండ్‌ ఆద్యంతం పైచేయిలోనే ఉన్నా.. శ్రమించక తప్పలేదు. పాక్‌ పేసర్లు ఇంగ్లాండ్‌ బ్యాటర్లను అంత స్వేచ్ఛగా ఆడనివ్వలేదు. షహీన్‌ షా అఫ్రిది, రవూఫ్‌, వసీమ్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. సెమీస్‌లో భారత్‌పై చెలరేగిన హేల్స్‌ (1)ను తొలి ఓవర్లోనే ఔట్‌ చేయడం ద్వారా అఫ్రిది ప్రత్యర్థి పతనాన్ని మొదలెట్టగా.. నాలుగో ఓవర్లో సాల్ట్‌ (10)ను రవూఫ్‌ వెనక్కి పంపాడు. అయితే నసీమ్‌ బౌలింగ్‌లో బట్లర్‌ (26; 17 బంతుల్లో 3×4, 1×6) బ్యాట్‌ ఝుళిపించడంతో ఇంగ్లాండ్‌ అయిదు ఓవర్లలో 43/2తో నిలిచింది. తర్వాతి ఓవర్లోనే అతణ్ని ఔట్‌ చేయడం ద్వారా పాక్‌ను రవూఫ్‌ పోటీలో ఉంచాడు. అఫ్రిది తన తొలి రెండు ఓవర్లలో 13 పరుగులే ఇవ్వగా.. రవూఫ్‌ పదే ఇచ్చాడు. పరుగులు చేయడం కష్టంగానే ఉన్నా స్టోక్స్‌ పట్టుదలతో నిలిచాడు. బ్రూక్‌ (20)తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. అయితే షాదాబ్‌, వసీమ్‌ వారికి స్వేచ్ఛనివ్వలేదు. పది ఓవర్లలో స్కోరు 77/3. పాక్‌ బౌలర్లు మరింత కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో తర్వాత పరుగుల వేగం ఇంకా తగ్గింది. ఇంగ్లాండ్‌పై ఒత్తిడి పెరిగింది. 11 నుంచి 15 ఓవర్ల మధ్య కేవలం 20 పరుగులే చేసిన ఇంగ్లాండ్‌.. బ్రూక్‌ వికెట్‌ను చేజార్చుకుంది. అప్పటికి స్టోక్స్‌ 35 బంతుల్లో 28 పరుగులే చేశాడు. చివరి 30 బంతుల్లో ఇంగ్లాండ్‌  41 పరుగులు చేయాల్సిన స్థితిలో మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. పాకిస్థాన్‌ కూడా అప్పటికి ఆశలతో ఉంది. కానీ 16వ ఓవర్‌ తొలి బంతి వేశాక అఫ్రిది గాయంతో నిష్క్రమించడం ఆ జట్టును గట్టి దెబ్బతీసింది. అవకాశాన్ని ఉపయోగించుకున్న స్టోక్స్‌.. ఆ ఓవర్‌ను పూర్తి చేసే బాధ్యతలు తీసుకున్న ఇఫ్తికార్‌ బౌలింగ్‌లో చివరి రెండు బంతుల్లో వరుసగా 4, 6 దంచడంతో ఇంగ్లాండ్‌పై ఒత్తిడి తగ్గింది. తర్వాతి ఓవర్లో (వసీం) మొయిన్‌ అలీ (19) మూడు ఫోర్లు కొట్టడంతో మ్యాచ్‌ ఇంగ్లాండ్‌ చేతుల్లోకి వచ్చింది. చివరి మూడు ఓవర్లలో ఇంగ్లాండ్‌ కేవలం 12 పరుగులు చేయాల్సిన పరిస్థితి. 19వ ఓవర్లో అలీ ఔటైనా.. స్టోక్స్‌ నాటకీయత లేకుండా పని పూర్తి చేశాడు.

పాక్‌కు కరన్‌ దెబ్బ: టోర్నీ ఆరంభం నుంచి పాకిస్థాన్‌ బ్యాటింగ్‌ పేలవమే. అలాగే ఇంగ్లాండ్‌ పేసర్‌ సామ్‌ కరన్‌ మొదటి నుంచీ అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. ఫైనల్లోనూ ఇదే ధోరణి కొనసాగింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ను కరన్‌తోపాటు స్పిన్నర్‌ రషీద్‌ గట్టి దెబ్బతీశాడు. పాక్‌ ఓపెనర్లు బాబర్‌ అజామ్‌ (32), రిజ్వాన్‌ (15) గత మ్యాచ్‌ల్లో లాగే చాలా జాగ్రత్తగా ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. అయిదో ఓవర్లో రిజ్వాన్‌ను బౌల్డ్‌ చేయడం ద్వారా కరన్‌ పాక్‌ పతనాన్ని ఆరంభించాడు. ఎనిమిదో ఓవర్లో బంతిని అందుకున్న రషీద్‌.. తొలి బంతికే హారిస్‌ను ఔట్‌ చేశాడు. రషీద్‌తో పాటు స్టోక్స్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పాక్‌ 10 ఓవర్లలో 68/2తో నిలిచింది. బాబర్‌, ఇఫ్తికార్‌ వికెట్లు కోల్పోయినా షాన్‌ మసూద్‌, షాదాబ్‌ (20) కాస్త దూకుడుగా ఆడడంతో పాక్‌ 16 ఓవర్లలో 119/4తో కాస్త మెరుగైన స్కోరుతోనే ఇన్నింగ్స్‌ ముగించేలా కనిపించింది. కానీ కరన్‌, జోర్డాన్‌ గొప్పగా బౌలింగ్‌ చేయడంతో చివరి నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి, కేవలం 18 పరుగులే చేసి తక్కువ స్కోరుతో సరిపెట్టుకుంది.


2

ఇంగ్లాండ్‌ గెలిచిన టీ20 ప్రపంచకప్‌లు. 2010లోనూ  ఆ జట్టు విజేతగా నిలిచింది. రెండుసార్లు పొట్టి కప్పు గెలిచిన జట్టుగా వెస్టిండీస్‌ (2012, 2016) సరసన చేరింది. ఒకేసారి వన్డే, టీ20ల్లో విశ్వవిజేతగా కొనసాగుతున్న తొలి జట్టు ఇంగ్లాండే. ఫైనల్లో ఓడడం పాకిస్థాన్‌కిది రెండోసారి. 2007 ఆరంభ ప్రపంచకప్‌లో భారత్‌ చేతిలో ఓడింది.


షహీన్‌ గాయపడకుంటే..

టోర్నీలో ఇంత దూరం రావడానికి పాకిస్థాన్‌కు కలిసొచ్చిన అదృష్టం.. తుది పోరులో మాత్రం ఆ జట్టు పక్షాన నిలవలేదు. స్టార్‌ పేసర్‌ షహీన్‌ షా అఫ్రిది గాయంతో తన బౌలింగ్‌ కోటా పూర్తి చేయలేకపోవడం జట్టుకు నష్టం చేసింది. 13వ ఓవర్లో షాదాబ్‌ బౌలింగ్‌లో హ్యారీ బ్రూక్‌ క్యాచ్‌ పట్టే క్రమంలో అఫ్రిది మోకాలికి గాయమై మైదానం వీడాడు. చికిత్స తీసుకున్న అతను బౌలింగ్‌కు సిద్ధమయ్యాడు. 16వ ఓవర్లో ఒక బంతి వేసి, నొప్పితో బయటకు వెళ్లిపోయాడు. దీంతో స్పిన్నర్‌ ఇఫ్తికార్‌ ఆ ఓవర్‌ కొనసాగించాల్సి వచ్చింది. ఇంగ్లాండ్‌ విజయానికి 26 బంతుల్లో 38 పరుగులు అవసరమైన దశలో.. ఆ ఓవర్‌ చివరి రెండు బంతులకు స్టోక్స్‌ 4, 6 కొట్టాడు. తర్వాతి ఓవర్లో వసీమ్‌ కూడా ధారాళంగా పరుగులిచ్చేశాడు. షహీన్‌ ఉంటే పాక్‌ గెలిచేదా అంటే చెప్పలేం. కానీ ఆ జట్టుకు కాస్త అవకాశాలుండగా.. అతను దూరం కావడం దెబ్బతీసింది.

పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌: రిజ్వాన్‌ (బి) కరన్‌ 15; బాబర్‌ అజామ్‌ (సి) అండ్‌ (బి) రషీద్‌ 32; హారిస్‌ (సి) స్టోక్స్‌ (బి) రషీద్‌ 8; షాన్‌ మసూద్‌ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) కరన్‌ 38; ఇఫ్తికార్‌ (సి) బట్లర్‌ (బి) స్టోక్స్‌ 0; షాదాబ్‌ ఖాన్‌ (సి) వోక్స్‌ (బి) జోర్డాన్‌ 20; నవాజ్‌ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) కరన్‌ 5; వసీమ్‌ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) జోర్డాన్‌ 4; షహీన్‌ షా అఫ్రిది నాటౌట్‌ 5; రవూఫ్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 137; వికెట్ల పతనం: 1-29, 2-45, 3-84, 4-85, 5-121, 6-123, 7-129, 8-131; బౌలింగ్‌: స్టోక్స్‌ 4-0-32-1; వోక్స్‌ 3-0-26-0; సామ్‌ కరన్‌ 4-0-12-3; రషీద్‌ 4-1-22-2; జోర్డాన్‌ 4-0-27-2; లివింగ్‌స్టోన్‌ 1-0-16-0

ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌: బట్లర్‌ (సి) రిజ్వాన్‌ (బి) రవూఫ్‌ 26; హేల్స్‌ (బి) షహీన్‌ షా అఫ్రిది 1; సాల్ట్‌ (సి) ఇఫ్తికార్‌ (బి) రవూఫ్‌ 10; స్టోక్స్‌ నాటౌట్‌ 52; బ్రూక్‌ (సి) షహీన్‌ షా అఫ్రిది (బి) షాదాబ్‌ 20; మొయిన్‌ అలీ (బి) వసీమ్‌ 19; లివింగ్‌స్టోన్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (19 ఓవర్లలో 5 వికెట్లకు) 138; వికెట్ల పతనం: 1-7, 2-32, 3-45, 4-84, 5-132; బౌలింగ్‌: షహీన్‌ షా అఫ్రిది 2.1-0-13-1; నసీమ్‌ షా 4-0-30-0; రవూఫ్‌ 4-0-23-2; షాదాబ్‌ ఖాన్‌ 4-0-20-1; వసీమ్‌ 4-0-38-1; ఇఫ్తికార్‌ 0.5-0-13-0

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు