నెదర్లాండ్స్‌, సెనెగల్‌.. రైట్‌ రైట్‌

ఉత్కంఠేమీ లేదు. సమీకరణాలతో పని లేదు. ఫిఫా ప్రపంచకప్‌లో గ్రూప్‌-ఎ నాకౌట్‌ బెర్తుల కథ చాలా మామూలుగానే తేలిపోయింది. టోర్నీ ఆరంభానికి ముందున్న అంచనా ప్రకారమే నెదర్లాండ్స్‌, సెనెగల్‌ ముందంజ వేశాయి.

Updated : 30 Nov 2022 04:14 IST

నెదర్లాండ్స్‌ 2, ఖతార్‌ 0
గ్రూప్‌-ఎలో తేలిన నాకౌట్‌ బెర్తులు

ఉత్కంఠేమీ లేదు. సమీకరణాలతో పని లేదు. ఫిఫా ప్రపంచకప్‌లో గ్రూప్‌-ఎ నాకౌట్‌ బెర్తుల కథ చాలా మామూలుగానే తేలిపోయింది. టోర్నీ ఆరంభానికి ముందున్న అంచనా ప్రకారమే నెదర్లాండ్స్‌, సెనెగల్‌ ముందంజ వేశాయి. ఆతిథ్య ఖతార్‌ ముందే నిష్క్రమించడంతో పోటీ మూడు జట్ల మధ్యే కాగా.. చివరి మ్యాచ్‌ల్లో ఈక్వెడార్‌, ఖతార్‌ జట్లేమీ అద్భుతాలు చేయకపోవడంతో మిగతా రెండు జట్లే ప్రిక్వార్టర్స్‌ చేరాయి. ఖతార్‌ను నెదర్లాండ్స్‌, ఈక్వెడార్‌ను సెనెగల్‌ ఓడించి గ్రూప్‌లో తొలి రెండు స్థానాలతో ముందంజ వేశాయి.

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో మూడుసార్లు రన్నరప్‌ నెదర్లాండ్స్‌ ఈసారి గ్రూప్‌ దశలో అంత గొప్ప ప్రదర్శన చేయకపోయినా.. సులువుగానే నాకౌట్‌ చేరింది. తన కంటే బలహీనమైన మూడు జట్లపై ఓటమి లేకుండా గ్రూప్‌ దశను ముగించిన నెదర్లాండ్స్‌ అగ్రస్థానంతో ముందంజ వేసింది. సెనెగల్‌ను ఓడించి, ఈక్వెడార్‌తో డ్రాతో సరిపెట్టుకున్న డచ్‌ జట్టు.. మంగళవారం తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఆతిథ్య ఖతార్‌ను 2-0తో ఓడించింది. డచ్‌ జట్టు స్థాయికి ఖతార్‌పై గోల్స్‌ మోత మోగిపోతుందని ఆశించినా.. ఆ జట్టు అంత దూకుడుగా ఆడలేదు. ఈ ప్రపంచకప్‌ స్టార్లలో ఒకడిగా అవతరించిన కోడీ గాక్పో.. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ గోల్‌ కొట్టడం విశేషం. 29వ నిమిషంలో అతడి గోల్‌తోనే నెదర్లాండ్స్‌ ఆధిక్యంలోకి వెళ్లింది. అప్పటికే కొన్ని గోల్‌ ప్రయత్నాలు చేసి విఫలమైన డచ్‌ జట్టును గాక్పో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. క్లాసెన్‌ నుంచి పాస్‌ అందుకున్న అతను.. కుడి కార్నర్‌లో తక్కువ ఎత్తులో కొట్టిన షాట్‌ను ఖతార్‌ గోల్‌ కీపర్‌ బార్షమ్‌ ఆపలేకపోయాడు. ఆ తర్వాత కూడా నెదర్లాండ్స్‌ ఆటగాళ్లు అడపాదడపా కొన్ని ప్రయత్నాలు చేసినా.. ప్రథమార్ధం ముగిసేలోపు మరో గోల్‌ నమోదు కాలేదు. ద్వితీయార్ధం మొదలైన కాసేపటికే డచ్‌ ఆధిక్యం రెట్టింపైంది. 49వ నిమిషంలో క్లాసెన్‌ క్రాస్‌ను అందుకుని డీపే కొట్టిన షాట్‌ను బార్షమ్‌ సమర్థంగా అడ్డుకున్నాడు. కానీ రీబౌండ్‌ అయి వచ్చిన బంతిని వెంటనే డి జాంగ్‌ గోల్‌లోకి పంపేశాడు. ఈ ఊపులో మరిన్ని గోల్స్‌ పడతాయని ఆశించిన డచ్‌ అభిమానులకు ఒకింత నిరాశ తప్పలేదు. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఈక్వెడార్‌, సెనెగల్‌ చేతుల్లో ఓడి నాకౌట్‌ రేసు నుంచి నిష్క్రమించిన ఖతార్‌కు చివరి మ్యాచ్‌లోనూ ఓటమి తప్పలేదు. ఆతిథ్య హోదాలో తొలిసారి ప్రపంచకప్‌ ఆడే అవకాశం దక్కించుకున్న ఆ జట్టుకు సెనెగల్‌తో మ్యాచ్‌లో ఒక గోల్‌ కొట్టడం ఒక్కటే ఊరట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని