సంక్షిప్త వార్తలు (5)

జాతీయ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ షూటర్‌ మేఘన సత్తాచాటింది. రెండు కాంస్యాలతో పాటు ఓ రజతం సొంతం చేసుకుంది.

Published : 02 Dec 2022 02:52 IST

మెరిసిన మేఘన

దిల్లీ: జాతీయ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ షూటర్‌ మేఘన సత్తాచాటింది. రెండు కాంస్యాలతో పాటు ఓ రజతం సొంతం చేసుకుంది. 25మీ. పిస్టల్‌ జూనియర్‌ మహిళల వ్యక్తిగత విభాగంలో ఆమె కంచు పతకం ఖాతాలో వేసుకుంది. సివిలియన్‌ వ్యక్తిగత విభాగంలోనూ ఆమె మూడో స్థానంలో నిలిచింది. ఇక మహిళల టీమ్‌లో మేఘన, ఇషా సింగ్‌, మాలబికాతో కూడిన రాష్ట్ర జట్టు రజతం దక్కించుకుంది.


క్వార్టర్స్‌లో ఉన్నతి

దిల్లీ: ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో ఉన్నతి హుడా క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించింది. అండర్‌-17 మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో ఆమె 21-11, 21-19తో నట్‌చావీ (థాయ్‌లాండ్‌)పై గెలిచింది. మరో ప్రిక్వార్టర్స్‌లో అన్మోల్‌ 17-21, 21-19, 13-21తో డానియా (మలేసియా) చేతిలో పరాజయంపాలైంది. అండర్‌-15 మహిళల డబుల్స్‌లో తన్విరెడ్డి-దుర్గా ఇషా 21-18, 22-20తో సునీసా-పిమ్‌చాంక్‌ (థాయ్‌లాండ్‌)పై నెగ్గి ప్రిక్వార్టర్స్‌ చేరారు. అండర్‌-17 పురుషుల డబుల్స్‌లో దివ్యమ్‌-మయాంక్‌, అర్ష్‌ మహ్మద్‌-సంస్కార్‌  జోడీలు నెగ్గి ప్రిక్వార్టర్స్‌ చేరాయి.


క్రికెట్‌ సలహా కమిటీలో జతిన్‌, అశోక్‌

దిల్లీ: మాజీ భారత ఆటగాళ్లు అశోక్‌ మల్హోత్రా, జతిన్‌ పరాంజపే ముగ్గురు సభ్యుల క్రికెట్‌ సలహా సంఘంలో చేరారు. వచ్చే నెలలో కొత్త సెలక్షన్‌ కమిటీ ప్యానల్‌ను ఎంపిక చేసేందుకు ఏర్పాటైన ఈ కమిటీలో సులక్షణ నాయక్‌ మరో సభ్యురాలు. ఇప్పటి వరకు సభ్యులుగా ఉన్న మదల్‌లాల్‌, ఆర్పీ సింగ్‌ స్థానాలను అశోక్‌, జతిన్‌ భర్తీ చేశారు. భారత్‌ తరఫున అశోక్‌ 7 టెస్టులు, 20 వన్డేల్లో ప్రాతినిథ్యం వహించగా.. పరాంజపే 4 వన్డేలు ఆడాడు. గత కమిటీలో ఉన్న సులక్షణ కొనసాగుతోంది.


భారత్‌-ఎకు భారీ ఆధిక్యం

కాక్స్‌ బజార్‌: బంగ్లాదేశ్‌-ఎతో తొలి అనధికార టెస్టులో భారత్‌-ఎ 353 పరుగుల భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. ఓవర్‌నైట్‌ స్కోరు 404/5తో గురువారం, మూడోరోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌ 465/5 వద్ద డిక్లేర్‌ చేసింది. తిలక్‌వర్మ (33) త్వరగా వెనుదిరిగినా ఉపేంద్ర యాదవ్‌ (71 నాటౌట్‌) జట్టు స్కోరును 450 పరుగులు దాటించాడు. భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన బంగ్లా దీటుగానే బదులిస్తోంది. ఆట చివరికి ఆ జట్టు 172/1తో నిలిచింది. జాకీర్‌ హుస్సేన్‌ (81), నజ్ముల్‌ హుస్సేన్‌ (56) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా 112 పరుగులకే ఆలౌటైంది.


ఐపీఎల్‌ వేలంలో 991 మంది

దిల్లీ: ఐపీఎల్‌ 2023 వేలం కోసం మొత్తం  991 మంది ఆటగాళ్లు పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో భారత ఆటగాళ్లు 714 మంది. డిసెంబరు 23న కొచిలో ఈ వేలం జరుగుతుంది. విదేశీ ఆటగాళ్ల సంఖ్య పరంగా ఆస్ట్రేలియా నుంచి అత్యధికంగా 57 మంది, స్కాట్లాండ్‌ నుంచి అత్యల్పంగా ఇద్దరు వేలం బరిలో దిగనున్నారు. దక్షిణాఫ్రికా (52), వెస్టిండీస్‌ (33), ఇంగ్లాండ్‌ (31), న్యూజిలాండ్‌ (27), శ్రీలంక (23), అఫ్గానిస్థాన్‌ (14), ఐర్లాండ్‌ (8), నెదర్లాండ్స్‌ (7), బంగ్లాదేశ్‌ (6), యూఏఈ (6), జింబాబ్వే (6), నమీబియా (5) ఆటగాళ్లు అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఈ ఆటగాళ్ల జాబితాలో 185 మంది మాత్రమే అంతర్జాతీయ క్రికెటర్లు. దేశవాళీ క్రికెటర్లలో 604 మంది భారత క్రికెటర్లు. 20 మంది సభ్య దేశాల క్రికెటర్లు. అంతర్జాతీయ అరంగేట్రం చేయకుండా ఇప్పటికే ఐపీఎల్‌లో ఆడిన భారత ఆటగాళ్లు 91 మంది, విదేశీయులు 604 మంది వేలంలో పాల్గొననున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని