మళ్లీ రేసింగ్‌ సందడి

రయ్‌ రయ్‌మంటూ అలరించి.. అర్ధంతరంగా నిలిచిన ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ (ఐఆర్‌ఎల్‌) హైదరాబాద్‌లో మళ్లీ సందడి చేయనుంది. ఐఆర్‌ఎల్‌ తుది దశ పోటీలకు ఆతిథ్యమిచ్చేందుకు హైదరాబాద్‌ స్ట్రీట్‌ సర్క్యూట్‌ సిద్ధమైంది.

Published : 09 Dec 2022 02:47 IST

చివరి దశకు రంగం సిద్ధం
రెండు, మూడు రౌండ్లలో హైదరాబాద్‌ జోరు

య్‌ రయ్‌మంటూ అలరించి.. అర్ధంతరంగా నిలిచిన ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ (ఐఆర్‌ఎల్‌) హైదరాబాద్‌లో మళ్లీ సందడి చేయనుంది. ఐఆర్‌ఎల్‌ తుది దశ పోటీలకు ఆతిథ్యమిచ్చేందుకు హైదరాబాద్‌ స్ట్రీట్‌ సర్క్యూట్‌ సిద్ధమైంది. శని, ఆదివారాల్లో హుస్సేన్‌ సాగర్‌ తీరం నెక్లెస్‌ రోడ్డులోని 2.7 కిలోమీటర్ల ట్రాక్‌పై రేసింగ్‌ కార్లు దూసుకెళ్లనున్నాయి. శనివారం 2 క్వాలిఫయింగ్‌ సెషన్‌లు, ఒక స్ప్రింట్‌ రేసు జరగనుంది. ఆదివారం ఒక స్ప్రింట్‌, మరో ఫీచర్‌ రేసును నిర్వహిస్తారు. గత నెల 19, 20 తేదీల్లో హైదరాబాద్‌లో తొలి రౌండ్‌ జరిగింది. రెండో రోజు పోటీల్లో చెన్నై టర్బో రైడర్స్‌, గోవా ఏసెస్‌ కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో హైదరాబాద్‌ స్ట్రీట్‌ సర్క్యూట్‌ను అర్ధంతరంగా నిలిపివేశారు. అనంతరం సమయాభావం కారణంగా తొలి రౌండ్‌ను పూర్తిగా రద్దుచేసినట్లు నిర్వాహకులు ‘ఈనాడు’కు తెలిపారు. అత్యున్నత భద్రత ప్రమాణాలతో నిర్మించిన ట్రాక్‌లో ఎలాంటి మార్పులు చేయట్లేదని స్పష్టంచేశారు. కఠినమైన భద్రత నిబంధనల్ని పాటిస్తూ తుది దశ పోటీల్ని పూర్తిచేస్తామని వెల్లడించారు. నవంబరు 25-27 వరకు రెండో రౌండ్‌, ఈనెల 2-4 వరకు మూడో రౌండ్‌ రేసులకు చెన్నై ఆతిథ్యమిచ్చింది. రెండో రౌండ్లో 174, మూడో రౌండ్లో 127.5 పాయింట్లు సాధించిన హైదరాబాద్‌ బ్లాక్‌ బర్డ్స్‌ మొత్తంగా 301.5 స్కోరుతో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. గాడ్‌స్పీడ్‌ కొచి (242.5) ద్వితీయ స్థానంలో కొనసాగుతోంది. గోవా ఏసెస్‌ (165), బెంగళూరు స్పీడ్‌స్టర్స్‌ (147.5), స్పీడ్‌ డెమోన్స్‌ దిల్లీ (131), చెన్నై టర్బో రైడర్స్‌ (105) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తొలి ఐఆర్‌ఎల్‌లో హైదరాబాద్‌ ఛాంపియన్‌గా నిలవడం లాంఛనమే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని