GGT vs RCBW: లూరా అర్ధశతకం.. ఆర్సీబీ టార్గెట్‌ ఫిక్స్‌

ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. ప్రత్యర్థి జట్టుకు 189 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

Updated : 18 Mar 2023 23:01 IST

ముంబయి: డబ్ల్యూపీఎల్‌లో భాగంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. ఓపెనర్‌ లూరా వోల్వార్డ్‌ (68; 42 బంతుల్లో 9×4,2×6) అర్ధశతకంతో చెలరేగగా.. సబ్బినేని మేఘన (31; 32 బంతుల్లో 4×4), గార్డెనర్‌ (41; 26 బంతుల్లో 6×4, 1×6) రాణించారు.  ఆర్సీబీ బౌలర్లలో శ్రేయంక పాటిల్‌ 2 వికెట్లు పడగొట్టగా.. సోఫీ డివైన్‌, ప్రీతి బోస్‌ చెరో వికెట్‌ తీశారు.

బ్యాటింగ్‌ ప్రారంభించిన గుజరాత్‌ ప్రారంభంలోనే వికెట్‌ కోల్పోయింది. డివైన్‌ వేసిన మూడో ఓవర్‌ నాలుగో బంతికి ఓపెనర్‌ డంక్లీ (16) బౌల్డయ్యింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మేఘనతో కలిసి మరో ఓపెనర్‌ వోల్వార్డ్‌ ఇన్నింగ్స్‌ నిర్మించింది. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 90 పరుగులు జోడించారు. జోరు మీదున్న ఈ జోడీని ప్రీతి బోస్‌ విడగొట్టింది. 12వ ఓవర్‌ చివరి బంతికి రిచా ఘోష్‌కు క్యాచ్‌ ఇచ్చి మేఘన వెనుదిరిగింది. అయితే, మరో ఎండ్‌లో ఉన్న వోల్వార్డ్‌ మాత్రం ధైర్యం కోల్పోలేదు. తర్వాతి బ్యాటర్‌ గార్డెనర్‌తో కలిసి వరుస బౌండరీలు బాదుతూ.. స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. అయితే, శ్రేయాంక పాటిల్‌ వేసిన 17వ ఓవర్‌ చివరి బంతికి ప్రీతికి క్యాచ్‌ ఇచ్చి వోల్వార్డ్‌ పెవిలియన్‌ బాట పట్టింది. అప్పటికీ జట్టు స్కోరు 142 పరుగులు. కొద్ది వ్యవధిలోనే 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గార్డెనర్‌ కూడా వెనుదిరగడంతో ఒక్కసారిగా స్కోరు వేగం మందగించింది. ఆ తర్వాత హేమలత (16*), డియోల్‌ (12*) పరుగులు చేయడంతో గుజరాత్‌ జెయింట్స్‌ 189 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని