Chess: ఒకే ఇంటి నుంచి ఇద్దరు గ్రాండ్‌ మాస్టర్లు.. ప్రజ్ఞానంద-వైశాలి అరుదైన ఘనత

ఇప్పటికే ప్రజ్ఞానంద గ్రాండ్‌ మాస్టర్‌ కాగా.. తాజాగా అతడి సోదరి వైశాలి (Vaishali) కూడా గ్రాండ్‌మాస్టర్‌గా మారి చరిత్ర సృష్టించింది.

Updated : 02 Dec 2023 14:17 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అంతర్జాతీయ చదరంగంలో భారత ప్లేయర్లు ప్రజ్ఞానంద, అతడి సోదరి వైశాలి అరుదైన ఘనత సాధించారు. ఒకే ఇంటి నుంచి ఇద్దరు గ్రాండ్‌మాస్టర్లుగా అవతరించి రికార్డు సృష్టించారు. అంతర్జాతీయ చెస్‌ ఫెడరేషన్‌ (ఫిడే) తాజాగా వెల్లడించిన ర్యాంకుల ప్రకారం వైశాలి (Vaishali) 2500+ రేటింగ్‌ పాయింట్లను సాధించి గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించింది. ఇప్పటికే ఆమె సోదరుడు, చెస్‌ సంచలనం ఆర్‌ ప్రజ్ఞానంద (Praggnanandhaa) గ్రాండ్‌మాస్టర్‌గా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఒకే ఇంటి నుంచి ఇద్దరు గ్రాండ్‌మాస్టర్లు రావడం విశేషం. చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్, కోనేరు హంపి, హారిక ద్రోణవల్లి, బారువా, పెండ్యాల హరికృష్ణ తదితరుల సరసన వైశాలి చేరింది. తెలుగు చెస్‌ ప్లేయర్లు హంపి, హారిక తర్వాత మూడో మహిళా గ్రాండ్‌మాస్టర్‌గా వైశాలి నిలిచింది. అయితే, తమిళనాడు నుంచి తొలి మహిళా గ్రాండ్‌ మాస్టర్‌ మాత్రం వైశాలినే. ఈ క్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఆమెకు అభినందనలు తెలిపారు. 

‘‘అద్భుత ఘనత సాధించిన వైశాలికి శుభాకాంక్షలు. భారత్‌ నుంచి మూడో మహిళా గ్రాండ్‌మాస్టర్ కావడం అభినందనీయం. తమిళనాడు నుంచి మొదటి మహిళా గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించావు. ఈ ఏడాదంతా అద్భుతంగా సాగింది. మీ సోదరుడు ప్రజ్ఞానంద కూడా మంచి ప్రదర్శన చేశాడు. మీరిద్దరూ క్యాండెట్స్‌ టోర్నీకి అర్హత సాధించి చరిత్ర సృష్టించారు. నువ్వు సాధించిన దానిపట్ల ఎంతో గర్వంగా ఉంది. నీ అద్భుతమైన ప్రయాణం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం. చెస్‌ను క్రీడగా ఎంచుకోవాలనే వారికి నువ్వే స్ఫూర్తి. మన రాష్ట్రంలో మహిళా సాధికారికతకు ఇదొక నిదర్శనం’’ అని స్టాలిన్‌ ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని