Rohit Sharma: అప్పుడే కాదు.. ప్రపంచకప్‌ లక్ష్యానికి ఇంకా సగం దూరంలోనే ఉన్నాం..: రోహిత్‌

పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నా.. ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని టీమ్‌ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) వ్యాఖ్యానించాడు. కివీస్‌పై విజయం అనంతరం కీలక వ్యాఖ్యలు చేశాడు.

Updated : 23 Oct 2023 09:25 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వరల్డ్‌ కప్‌లో (ODI World Cup 2023) న్యూజిలాండ్‌ను ఓడించడంలో విరాట్ కోహ్లీ-జడ్డూ, రోహిత్‌, మహమ్మద్‌ షమీ కీలక పాత్ర పోషించారు. ఒక దశలో కివీస్‌ బ్యాటర్ల దూకుడు చూస్తే 300కిపైగా పరుగులు చేస్తారనిపించిందని.. కానీ, ఆ తర్వాత షమీతోపాటు ఇతర బౌలర్లు వారిని అద్భుతంగా కట్టడి చేశారని భారత కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. అలాగే విరాట్ కోహ్లీ నుంచి ఇలాంటి ఇన్నింగ్స్‌లు గతంలోనూ ఎన్నో వచ్చాయని కొనియాడాడు. వరల్డ్ కప్‌ టోర్నీల్లో (2003 తర్వాత) న్యూజిలాండ్‌పై తొలిసారి టీమ్‌ఇండియా విజయం సాధించడం ఆనందంగా ఉందని తెలిపాడు.

‘‘టోర్నీలో ఒక్కో మ్యాచ్‌ గెలుచుకుంటూ ముందుకు సాగుతున్నాం. అయితే, ప్రపంచకప్‌ విజయంలో  ఇప్పటికీ ఇంకా సగం లక్ష్యమే పూర్తయింది. జట్టును సమతూకంగా ఉంచడం చాలా కీలకం. తర్వాత ఏంటనేది ఇప్పుడే ఆలోచించడం లేదు. వర్తమానంలో ఉండటమే ముఖ్యం. షమీ తనకొచ్చిన ఛాన్స్‌ను రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. ఇలాంటి క్లాస్ బౌలర్‌కు ధర్మశాల వంటి పిచ్‌ మరింత అనుకూలంగా ఉంటుందని నిరూపించాడు. ఒకదశలో కివీస్‌ 300+ స్కోరు చేస్తుందని భావించాం. కానీ, షమీతో సహా ఇతర బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేశారు. లక్ష్య ఛేదనలో నేనెప్పుడూ బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తా. అంతిమంగా విజయం సాధించడం ఆనందంగా ఉంది. విరాట్ కోహ్లీ గత కొన్నేళ్లుగా తన ఆటతీరుతో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. కివీస్‌పైనా జడ్డూతో కలిసి కీలక భాగస్వామ్యం నిర్మించాడు. 

IND vs NZ: మనం అజేయం

మా ఫీల్డింగ్‌లో కొన్ని తప్పిదాలు చోటు చేసుకున్నాయి. జడేజా చేతిలోకి వచ్చిన క్యాచ్‌ను వదిలేయడం నిరాశపరిచినా.. అతడు ప్రపంచస్థాయి అత్యుత్తమ ఫీల్డర్‌. కొన్నిసార్లు జరుగుతుంటాయి. అయితే, ఫీల్డింగ్‌ మ్యాచ్‌ ఫలితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశముంది. కాబట్టి, వాటన్నింటి నుంచి నేర్చుకుని ముందుకు సాగుతాం. వరల్డ్ కప్‌లో విభిన్న ప్రాంతాల్లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడనుండటాన్ని మేం కూడా ఆస్వాదిస్తున్నాం’’ అని రోహిత్ శర్మ వెల్లడించాడు. 

చివరి 10 ఓవర్లలో రాణించలేకపోయాం: టామ్‌ లేథమ్

‘‘ఇలాంటి పిచ్‌పై బాగానే ఆడామనిపించింది. కానీ, బ్యాటింగ్‌లో చివరి 10 ఓవర్లలో మరికొన్ని పరుగులు రాబడితే బాగుండేది. అక్కడ కాస్త వెనుబడ్డాం. అయితే, భారత బౌలర్లను ఈ సందర్భంగా అభినందించాల్సిందే. కీలక సమయంలో మాపై నిలకడగా ఒత్తిడి పెంచి వికెట్లు పడగొట్టారు. రచిన్‌, డారిల్ మిచెల్‌ అద్భుత ఆటతీరు ఆకట్టుకుంది. డారిల్ శతకం చేయడం బాగుంది. అయితే, ఓడిపోవడం నిరాశపరిచింది. తప్పకుండా తదుపరి మ్యాచ్‌లో పుంజుకుని విజయం సాధిస్తాం. ఇదే స్టేడియంలో మరో మ్యాచ్‌ ఆడబోతున్నాం. డే మ్యాచ్‌ కావడం మాకు కలిసొస్తుందని ఆశిస్తున్నా’’ అని న్యూజిలాండ్‌ కెప్టెన్‌ టామ్‌ లేథమ్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు