IPL 2023: ఐపీఎల్ 2023 లీగ్‌ స్టేజ్‌.. సగం ముగిశాయి.. అవే మురిశాయి..!

దాదాపు రెండు నెలలపాటు జరిగే ఐపీఎల్ 16వ సీజన్‌లో (IPL 2023) లీగ్‌ దశలోని సగం మ్యాచ్‌లు ముగిశాయి. ప్లేఆఫ్స్‌ రేసులో పెద్ద జట్లు అనుకున్నవి కూడా కాస్త వెనుకబడ్డాయి. ఇప్పటి వరకు పాయింట్ల పట్టికలో దూసుకొచ్చిన జట్లేవో ఓసారి చూద్దాం.. 

Updated : 26 Apr 2023 14:15 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్‌ లీగ్ (IPL 2023) 16వ సీజన్‌ రసవత్తరంగా సాగుతోంది. ఆరంభంలో కాస్త డల్‌గా అనిపించిన మ్యాచ్‌లు.. ఆ తర్వాత చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. మొత్తం 70 లీగ్‌ మ్యాచుల్లో ఇప్పటికి 35 మ్యాచ్‌లు ముగిశాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ (10 పాయింట్లు) ఉండగా.. గుజరాత్‌ టైటాన్స్ (10 పాయింట్లు), రాజస్థాన్‌ రాయల్స్ (8 పాయింట్లు), లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (8 పాయింట్లు) టాప్‌-4లో కొనసాగుతున్నాయి. మరి పది జట్ల విజయాలు, ఓటములు ఏంటో ఓసారి తెలుసుకుందాం..

  1. చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK): గుజరాత్‌పై ఓటమితో సీజన్‌ను ప్రారంభించిన చెన్నై టాప్‌ స్థానంలోకి రావడం విశేషం. ఆడిన ఏడు మ్యాచుల్లో కేవలం రెండు మాత్రమే ఓడింది. కెప్టెన్ ధోనీ నాయకత్వంలోని సీఎస్‌కే ఐదు మ్యాచుల్లో గెలిచి 10 పాయింట్లను దక్కించుకుంది. గతేడాది ఫైనలిస్టులు గుజరాత్‌, రాజస్థాన్‌ చేతిలోనే సీఎస్‌కే ఓడిపోయింది.
  2. గుజరాత్ టైటాన్స్‌ (GT): డిఫెండింగ్‌ ఛాపింయన్‌ ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడింది. ఐదు మ్యాచుల్లో విజయం సాధించిన జీటీ రెండింట్లో ఓడిపోయింది. దీంతో పది పాయిట్లను సాధించినా.. నెట్‌ రన్‌రేట్‌ కారణంగా గుజరాత్‌ రెండో స్థానానికి పరిమితమైంది. కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో గుజరాత్‌ టైటాన్స్‌ పరాజయంపాలైంది.
  3. రాజస్థాన్‌ రాయల్స్‌ (RR): సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఘన విజయం సాధించి రాజస్థాన్‌ రాయల్స్‌  ఈ సీజన్‌ను అద్భుతంగా ప్రారంభించింది. అయితే, వెంటనే పంజాబ్‌ కింగ్స్‌ చేతిలో ఓటమిపాలైంది. మళ్లీ హ్యాట్రిక్‌ విజయాలతో పుంజుకొన్న ఆర్‌ఆర్‌కు మళ్లీ వరుసగా రెండు పరాజయాలు నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం ఏడు మ్యాచుల్లో నాలుగు విజయాలతో 8 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది.
  4. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ (LSG): కెప్టెన్ కేఎల్ రాహుల్ అర్ధ శతకాలు చేసినా విమర్శలపాలవుతూ తన జట్టును నడిపిస్తున్నాడు. తక్కువ స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. తాజాగా గుజరాత్‌పై ఏడో మ్యాచ్‌ ఆడిన ఎల్‌ఎస్‌జీ కేవలం ఏడు పరుగుల తేడాతో ఓడింది. ఏడింట్లో నాలుగు విజయాలు, మూడు ఓటములతో లఖ్‌నవూ (8 పాయింట్లు) నాలుగో స్థానంలో నిలిచింది.
  5. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB): కేవలం ముగ్గురు బ్యాటర్ల ప్రదర్శనపైనే ఇప్పటి వరకు విజయాలను నమోదు చేసిన రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు (8) పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ముంబయి ఇండియన్స్‌ను ఓడించి జోరు మీదున్న ఆర్‌సీబీ.. కోల్‌కతా, లఖ్‌నవూ, సీఎస్‌కే చేతిలో ఓటమిపాలైంది. అయితే దిల్లీ, పంజాబ్, రాజస్థాన్‌పై గెలిచి మళ్లీ ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది.
  6. పంజాబ్‌ కింగ్స్ (PBKS): వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి సీజన్‌ను అద్భుతంగా ప్రారంభించిన పంజాబ్ కింగ్స్‌ మళ్లీ వెనుకబడిపోయిది. రెండు ఓటములతో కాస్త డీలా పడింది. అయితే ముంబయి, లఖ్‌నవూపై గెలిచి తన పాయింట్లను పెంచుకుంది. ఇప్పటి వరకు ఏడు మ్యాచుల్లో నాలుగు విజయాలు సాధించి 8 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. లఖ్‌నవూ, ఆర్‌సీబీ కంటే నెట్‌రన్‌రేట్ తక్కువగా ఉండటంతో పంజాబ్‌ ఆరో స్థానంలో ఉంది. 
  7. ముంబయి ఇండియన్స్‌ (MI): ఐదుసార్లు ఛాంపియన్‌ ముంబయి ఈసారి సీజన్‌ తొలి రెండు మ్యాచుల్లో ఓడింది. ఈసారి కూడా ఆ జట్టు పనైపోయిందనే వ్యాఖ్యలు వినిపించాయి. అనూహ్యంగా హ్యాట్రిక్‌ విజయాలు సాధించి రేసులోకి వచ్చిన ముంబయి.. మళ్లీ పంజాబ్‌, గుజరాత్‌ చేతిలో ఓడి వెనుకబడిపోయింది. ప్రస్తుతం ఏడు మ్యాచుల్లో కేవలం మూడు విజయాలను మాత్రమే నమోదు చేసి 6 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. ప్లేఆఫ్స్ అవకాశాలు ఉండాలంటే ప్రతి మ్యాచ్‌లోనూ గెలవాల్సిందే.
  8. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (KKR): తొలి మ్యాచ్‌లో అదృష్టం కలిసిరాక డక్‌వర్త్‌లూయిస్‌ పద్ధతిలో పంజాబ్‌ మీద ఓడింది. ఆ తర్వాత రెండు మ్యాచుల్లో విజయఢంకా మోగించింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌పై చివరి ఓవర్‌లో ఐదు సిక్స్‌లు కొట్టి మరీ కోల్‌కతాను రింకు సింగ్‌ గెలిపించాడు. అయితే, అప్పటి నుంచి ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ ఓడి పాయింట్ల పట్టికలో కిందికి దిగజారిపోయింది. ప్రస్తుతం నాలుగు పాయింట్లతో 8వ స్థానంలో కొనసాగుతోంది. 
  9. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (SRH): పేరులో ఉన్న రైజింగ్‌.. విజయాల్లో మాత్రం లేదు. కనీసం పోరాడకుండానే మ్యాచ్‌లను సమర్పించేసుకుంటూ సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలపాలవుతున్న ఏకైక జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌. ఆడిన ఏడు మ్యాచుల్లో రెండు విజయాలతో నాలుగు పాయింట్లను ఖాతాలో వేసుకుని తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. ఇలాగే కొనసాగితే అట్టడుగు స్థానం కూడా ఎస్ఆర్‌హెచ్‌దే అవుతుందని అభిమానులు నిరాశపడుతున్నారు. 
  10. దిల్లీ క్యాపిటల్స్‌ (DC): రిషభ్‌ పంత్ లేని లోటు దిల్లీ క్యాపిటల్స్‌కు తెలుస్తోంది. మిడిల్‌ ఆర్డర్‌లో ఎన్నోసార్లు జట్టును కాపాడిన అనుభవం రిషభ్ పంత్ సొంతం. వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిన దిల్లీ.. ఎట్టకేలకు విజయాల బాట పట్టింది. కోల్‌కతా, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓడించి నాలుగు పాయింట్లను సాధించింది. ప్రస్తుతం ఆఖరి స్థానంలో కొనసాగుతోంది.

(పాయింట్ల పట్టిక)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు