IPL : అది ఎంతో అతి.. అలా చేసుండాల్సింది కాదు : లఖ్‌నవూ ఆటగాడు

ఈ ఐపీఎల్‌(IPL 2023) సీజన్‌లో ఓ మ్యాచ్‌లో తన ప్రవర్తనతో విమర్శలపాలయ్యాడు లఖ్‌నవూ ఆటగాడు ఆవేశ్‌ఖాన్‌(Avesh Khan). తాజాగా ఆ ఘటన పట్ల విచారం వ్యక్తం చేశాడు.

Updated : 19 Jun 2023 17:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఇటీవల ముగిసిన ఐపీఎల్‌(IPL 2023)లో.. బెంగళూరు(Royal Challengers Bangalore)తో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ(Lucknow Super Giants) పేసర్‌ ఆవేశ్‌ ఖాన్‌(Avesh Khan) హెల్మెట్‌ను నేలకేసి విసిరి సంబరాలు చేసుకున్న విషయం తెలిసిందే. అతడి ప్రవర్తనపై ఆ తర్వాత విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్‌మీడియాలో ట్రోలింగ్‌కూ గురయ్యాడు. తాజాగా ఆ ఘటనపై ఆవేశ్‌ స్పందించాడు. తాను అలా చేసి ఉండాల్సింది కాదని .. విచారం వ్యక్తం చేశాడు.

ఏం జరిగిందంటే.. లీగ్‌ దశలో లఖ్‌నవూ, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్‌ చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగింది. ఆర్సీబీ నిర్దేశించిన 213 పరుగుల లక్ష్యాన్ని లఖ్‌నవూ ఛేదించి వికెట్‌ తేడాతో గెలుపొందింది. అయితే.. చివరి బంతికి ఒక పరుగు అవసరమైన వేళ.. హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో ఆవేశ్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి మిస్సయ్యాడు. దీంతో నాన్‌స్ట్రైకర్‌  ఎండ్‌ వైపు పరుగెత్తాడు. అదే సమయంలో కీపర్‌ దినేశ్‌ కార్తిక్‌ రనౌట్‌ చేయలేకపోయాడు. ఉత్కంఠ పరిస్థితుల్లో చివరి బంతికి విజయం సాధించడంతో.. తన హెల్మెట్‌ను తీసి నేలకేసి కొట్టి ఆవేశ్‌ సంబరాలు చేసుకున్నాడు. అంతకుముందు.. బెంగళూరు మైదానంలో ఆర్సీబీ అభిమానులను నిశ్శబ్దంగా ఉండాలంటూ లఖ్‌నవూ మెంటార్‌ గంభీర్‌ సంజ్ఞ చేయడంతో.. అప్పటికే ఇరు జట్ల మధ్య వేడి వాతావరణం నెలకొంది.

తాజాగా ఈ ఘటనపై ఆవేశ్‌ ఓ మీడియా ఇంటర్వ్యూలో స్పందించాడు. ‘అది ఎంతో అతిగా అనిపించింది. అలా చేసి ఉండాల్సింది కాదు. ఆ తర్వాత నేను చేసిన తప్పు తెలుసుకున్నాను. ఆ పరిస్థితుల్లో అలా జరిగిపోయిందంతే. ప్రస్తుతం నేను ఆ ఘటన పట్ల ఎంతో బాధపడుతున్నాను’ అంటూ వివరించాడు.

ఇక ఈ మ్యాచ్‌ అనంతరం.. ఇరు జట్ల మధ్య లఖ్‌నవూ వేదికగా జరిగిన మరో మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ, గౌతమ్‌ గంభీర్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని