IND vs SA: అతడికి ఓ లాలీపాప్‌ ఇచ్చారు.. చాహల్‌ను వన్డేలకు ఎంపిక చేయడంపై హర్భజన్‌

దక్షిణాఫ్రికాతో (IND vs SA) వన్డే, టెస్టు, టీ20 సిరీస్‌లకు జట్లను ఎంపిక చేయడంపై భారత మాజీ క్రికెటర్ హర్భజన్‌ సింగ్‌ స్పందించాడు. 

Published : 02 Dec 2023 02:07 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దక్షిణాఫ్రికా పర్యటనకు మూడు ఫార్మాట్లలో భారత్‌కు (IND vs SA) ముగ్గురు కెప్టెన్లను నియమిస్తూ బీసీసీఐ జట్లను ప్రకటించింది. అనూహ్యంగా టీ20 సిరీస్‌కు కాకుండా వన్డే సిరీస్‌కు యుజ్వేంద్ర చాహల్‌ ఎంపికయ్యాడు. ఇది అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. మున్ముందు టీ20 ప్రపంచకప్‌ వంటి మెగా టోర్నీ ఉన్న క్రమంలో చాహల్‌ను పొట్టి ఫార్మాట్‌కు కాకుండా.. వన్డేలకు ఎంపిక చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అలాగే టెస్టు సిరీస్‌ నుంచి పుజారా, అజింక్య రహానె, ఉమేశ్‌ యాదవ్‌ను మేనేజ్‌మెంట్ పక్కన పెట్టేసింది. ఈ క్రమంలో చాహల్‌ ఎంపికతోపాటు సీనియర్లను తప్పించడంపై భారత మాజీ క్రికెటర్ హర్భజన్‌ సింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

‘‘టీ20 ఫార్మాట్‌లో చాహల్‌కు అవకాశం దక్కలేదు. వన్డేలకు మాత్రం ఎంపిక చేశారు. ఇదెలా ఉందంటే ఓ లాలీపాప్‌ను అతడికి ఇచ్చి ఊరుకోబెట్టినట్లుగా ఉంది. నువ్వు ఎంత బాగా ఆడినా ఈ ఫార్మాట్‌కు తీసుకోలేం. కానీ, మరొక ఫార్మాట్‌లో అవకాశం ఇస్తాం తీసుకోమన్నట్లుంది. ఇదేంటో నాకైతే అర్థం కావడం లేదు. ఇక సీనియర్లు అజింక్య రహానె, పుజారాకు టెస్టు జట్టులోనే చోటు కల్పించలేదు. దక్షిణాఫ్రికా పర్యటన చాలా క్లిష్టమైంది. బ్యాటర్లను మరింత ఇబ్బంది పెడుతుంది. పుజారా, రహానెకు అవకాశం ఇవ్వకుండా యువకులను ఎక్కువగా ఎంపిక చేయడం ఒకింత మంచిదే. కానీ, వారు అక్కడి పరిస్థితులను ఎలా తట్టుకుని రాణించగలరనేది ఆసక్తికరం.  

జట్టు నుంచి తప్పించిన తర్వాత సీనియర్లు పునరాగమనం చేయడం చాలా కష్టమే. కుర్రాళ్ల నుంచి విపరీతమైన పోటీ ఉండటం కూడా ఓ కారణం. అంతేకాకుండా ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ ఫామ్‌లోకి రావాల్సి ఉంటుంది. భారత క్రికెట్‌కు వారెంతో సేవ చేశారు. వారిని తప్పించడంపై బోర్డు తప్పకుండా మాట్లాడాలి. ఎందుకు తీసుకోలేదో వివరించి చెప్పాలి’’ అని హర్భజన్‌ సింగ్‌ తెలిపాడు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ ముంగిట దక్షిణాఫ్రికాతో పొట్టి సిరీస్‌ కీలకం కానుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు