Harbhajan Singh: పాక్‌ మాజీ ఆటగాడి అనుచిత వ్యాఖ్యలు.. హర్భజన్‌ సింగ్‌ కౌంటర్‌

ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా పాక్‌ మాజీ ఆటగాడు కమ్రాన్‌ అక్మల్‌ భారత్‌ బౌలర్‌ అర్ష్‌దీప్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో భారత మాజీ స్టార్‌ హర్భజన్‌ సింగ్‌ అతడికి కౌంటర్‌ ఇచ్చాడు.  

Updated : 11 Jun 2024 06:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ (Arshdeep Singh)పై పాకిస్థాన్‌ మాజీ స్టార్‌ కమ్రాన్‌ అక్మల్‌ (Kamran Akmal) జాత్యంహకార వ్యాఖ్యలు చేశాడు. దీంతో అతడి తీరుపై పలువురు నెటిజన్లు సామాజిక మాధ్యమాల వేదికగా ఎండగడుతున్నారు. న్యూయార్క్‌ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్‌ (India vs Paistan) సంచలన విజయం నమోదు చేసిన సంగతి తెలిసిందే. స్వల్ప స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో భారత్‌ తొలుత 119 పరుగులకే ఆలౌట్‌ అయింది. అనంతరం బౌలింగ్‌లో పాక్‌ను 113/7 పరుగులకే కట్టడి చేసి 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ సందర్భంగా పాక్‌లో ప్రసారమయ్యే ఓ న్యూస్‌ ఛానల్‌లో పాల్గొన్న కమ్రాన్‌ అక్మల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 

పాక్‌ విజయం సాధించాలంటే చివరి ఓవర్‌లో 18 పరుగులు చేయాలి. అర్ష్‌దీప్‌ సింగ్‌ బౌలింగ్‌కు దిగాడు. ఈ సందర్భంగా అర్ష్‌దీప్‌ మతాన్ని ఉద్దేశిస్తూ అక్మల్‌ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో అతడి వ్యాఖ్యలకు పక్కనే ఉన్న మరో అతిథి నవ్వాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై భారత మాజీ స్టార్‌ బౌలర్‌ హర్భజన్‌ సింగ్‌ (Harbhajan Singh) తీవ్రంగా స్పందించాడు. ‘‘నువ్వు సిక్కుల గురించి నోరుపారేసుకునేముందు వారి చరిత్ర తెలుసుకోవాలి. ఆక్రమణదారులు మీ తల్లులు, సోదరీమణులను అపహరించినప్పుడు ఇదే సమయంలో సిక్కులు వారిని రక్షించారు. నిన్ను చూస్తే అవమానంగా ఉంది. కొంచెం సిక్కుల పట్ల విశ్వాసంతో ఉండు’’ అని ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్టు చేశాడు. 

ఇక ప్రపంచకప్‌ విషయానికి వేస్తే భారత్‌ ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి గ్రూప్‌ ఏలో అగ్రస్థానంలో ఉంది. పాక్‌ ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమిపాలైంది. తొలి మ్యాచ్‌లో క్రికెట్‌ పసికూన అమెరికా చేతిలో ఓడిన పాక్‌.. తర్వాతి మ్యాచ్‌లో భారత్‌ చేతిలో భంగపాటుకు గురైంది. దీంతో పాక్‌ సూపర్‌ 8 అవకాశాలు సంక్లిష్టమయ్యాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని