IPL 2024: రోహిత్ - హార్దిక్‌ కెప్టెన్సీ మార్పు.. ఆ విషయం కాలమే చెబుతుంది: హర్భజన్‌

ముంబయి ఇండియన్స్ ప్రాక్టీస్‌ను మొదలుపెట్టింది. ఐపీఎల్‌ 17వ సీజన్‌లో (IPL) విజేతగా నిలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగనుంది.

Published : 21 Mar 2024 11:04 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) తొలిసారి రోహిత్‌ శర్మతో కలిసి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న వీడియోలు వైరల్‌గా మారాయి. జట్టులోని సభ్యులంతా కలిసికట్టుగా ఉన్నారని తెలియజేసినట్లయింది. అయితే, టోర్నీ జరిగే కొద్దీ రోహిత్ (Rohit Sharma) - హార్దిక్ ఎలా సెట్‌ అవుతారనేది ఆసక్తికరంగానే ఉంది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ హర్భజన్‌ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఏవైనా తేడాలు ఉంటే వాటిని పక్కన పెట్టేసి ఫ్రాంచైజీ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేయాలని సూచించాడు. 

‘‘జట్టులో స్టార్ క్రికెటర్లు ఉన్నప్పుడు.. మరీ ముఖ్యంగా ఇలా కెప్టెన్సీ మార్పు తర్వాత కుదురుకోవడం ఎవరికైనా తేలికేం కాదు. ముంబయి ఇండియన్స్‌ ఫ్రాంచైజీ తరఫున ఆడుతున్న రోహిత్, హార్దిక్‌ పాండ్య.. ఇద్దరిలో ఎవరు ఇబ్బంది లేకుండా ఆడతారు? ఎవరు అసౌకర్యంగా భావిస్తారు? అనేది కాలమే చెబుతుంది. అయితే వీరిద్దరూ ఇప్పటి వరకు జరిగిన వివాదాన్ని పక్కన పెట్టేసి మరీ ఫ్రాంచైజీ భవిష్యత్తు కోసం రాణిస్తారనే నమ్మకం నాకుంది’’ అని హర్భజన్‌ తెలిపాడు. ఐపీఎల్‌ 17వ సీజన్‌లో (IPL) ముంబయి ఇండియన్స్‌ తన తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తోనే (MI vs GT) తలపడనుంది. మార్చి 23న ఈ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది.

ఆరో టైటిల్‌పై కన్నేసిన ముంబయి: అశ్విన్

ఐపీఎల్‌ చరిత్రలో అత్యధికసార్లు విజేతగా నిలిచిన మొదటి జట్టు ముంబయి ఇండియన్స్. మొత్తం ఐదుసార్లు ఛాంపియన్‌ అయిన ముంబయిని గతేడాది సీఎస్కే సమం చేసింది. దీంతో ఆరోసారి టైటిల్‌ నెగ్గాలనే లక్ష్యంతో ఈసారి ముంబయి బరిలోకి దిగుతుందని భారత సీనియర్‌ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ వ్యాఖ్యానించాడు. ‘‘హార్దిక్‌ పాండ్య నాయకత్వంలో ముంబయి జట్టు ఆరో టైటిల్‌పై కన్నేసింది. చాలా మంది కెప్టెన్సీ గురించి కామెంట్లు చేస్తున్నారు. నేను మాత్రం ఆ విషయంపై మాట్లాడను. భారీ మొత్తం వెచ్చించి పాండ్యను కొనుగోలు చేయడం చూస్తే టైటిల్‌ కోసం ముంబయి ఎంతటి కసితో ఉందో అర్థమవుతోంది. ఒకవేళ పాండ్య బదులు రషీద్ ఖాన్‌ను తీసుకుంటే ఎవరూ పెద్దగా చర్చించారు’’ అని విశ్లేషించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని