IPL 2024: ముంబయి ఫ్రాంచైజీకి రావడంపై పాండ్య పోస్టు... గిల్‌కు గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్సీ

ముంబయి ఇండియన్స్‌కు హార్దిక్‌ పాండ్య వెళ్లపోవడం అధికారికంగా ఖరారైంది. దీంతో గుజరాత్‌ టైటాన్స్‌కు కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌ను నియమించారు.

Updated : 06 Dec 2023 14:06 IST

ముంబయి: టీమ్ఇండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్య (Hardik Pandya) ముంబయి ఇండియన్స్‌కు వచ్చేయడం అధికారికంగా ఖరారైంది. ఐపీఎల్‌ 2024 సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌కు కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌ను ఆ ఫ్రాంచైజీ ప్రకటించింది. గత రెండు సీజన్లలో కెప్టెన్‌గా గుజరాత్‌ టైటాన్స్‌ను ఫైనల్స్‌ చేర్చడమే కాక, 2022లో విజేతగా కూడా నిలిపిన అతను.. వచ్చే సీజన్‌ నుంచి తిరిగి ముంబయికి ఆడబోతున్నాడు. ఐపీఎల్‌లో (IPL) గుజరాత్‌ టైటాన్స్‌ (GT) కెప్టెన్‌గా జట్టుకు టైటిల్‌ అందించిన హార్దిక్‌ను ట్రేడింగ్‌లో ముంబయి దక్కించుకుంది. ఈ సందర్భంగా హార్దిక్‌ పాండ్య స్పందించాడు. సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని సోషల్‌ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశాడు. ‘‘ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. ముంబయి, వాంఖడే, పల్టాన్.. ఇలా ప్రతిదీ ప్రత్యేకమే. వెనక్కి తిరిగి వచ్చినందుకు ఆనందంగా ఉంది’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టాడు.

థ్రిల్‌గా ఫీలవుతున్నాం: నీతా అంబానీ

‘‘హార్దిక్‌ పాండ్య తిరిగి ముంబయి ఇండియన్స్‌ జట్టుకు రావడం థ్రిల్‌గా ఫీలవుతున్నాం. ఎంఐ ఫ్యామిలీలోకి అతడిని హృదయపూర్వకంగా  ఆహ్వానిస్తున్నాం. యువకుడిగా ఉన్న పాండ్యను ముంబయి ఇండియన్స్‌ గుర్తించి ప్రోత్సహించింది. ఇప్పుడు స్టార్‌గా ఎదిగాడు. ముంబయి ఇండియన్స్‌ తరఫున అతడికి మంచి భవిష్యత్తు ఉంటుంది’’ అని నీతా అంబానీ ప్రత్యేక సందేశం పోస్టు చేశారు.

అతడు ఉంటే జట్టు సమతూకం: ఆకాశ్ అంబానీ

ముంబయి ఇండియన్స్‌ ఫ్రాంచైజీ ఓనర్‌ ఆకాశ్ అంబానీ కూడా హార్దిక్‌ రాకపై స్పందించారు. ‘‘హార్దిక్‌ పాండ్యను మళ్లీ ముంబయి జట్టులో చూడనుండటం ఆనందంగా ఉంది. అతడు సొంత ఇంటికి వచ్చినట్లే. పాండ్య జట్టులో ఉంటే ఎప్పుడూ సమతూకం వస్తుంది. పాండ్య ముంబయితో కలిసి ఆడిన తొలి భాగమంతా విజయవంతమైంది. ఇప్పుడు అదే కొనసాగుతుందని ఆశిస్తున్నాం’’ అని ఆకాశ్ అంబానీ తెలిపారు. 

వీరందరితో మరింత పటిష్ఠంగా మారుతున్నాం: ముంబయి ఇండియన్స్‌

‘‘ హార్దిక్‌ పాండ్య తన సొంత ఇంటికి తిరిగొచ్చాడు. వచ్చే ఏడాది సీజన్‌లో ముంబయి జట్టుతో కలబోతున్నాడు. రోహిత్ శర్మ, బుమ్రా, సూర్యకుమార్‌ యాదవ్, ఇషాన్‌ కిషన్‌తో జత కలుస్తాడు. దీంతో మరింత బలంగా మారబోతున్నాం. ముంబయి విజయాల్లో హార్దిక్‌ పాండ్య కీలక పాత్ర పోషించాడు’’ అని ముంబయి ఇండియన్స్‌ పోస్టు చేసింది.

గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్

హార్దిక్‌ పాండ్య ముంబయి జట్టుకు వెళ్లిపోవడంతో గుజరాత్‌ టైటాన్స్‌కు కొత్త సారథిగా శుభ్‌మన్‌ గిల్‌ను నియమిస్తూ ఆ ఫ్రాంచైజీ కీలక ప్రకటన వెలువరించింది. గుజరాత్‌ తొలిసారి టైటిల్‌ను నెగ్గడంలో ఓపెనర్‌గా శుభ్‌మన్‌ గిల్ కూడా కీలక పాత్ర పోషించాడు. ‘‘శుభ్‌మన్ గిల్ గత రెండేళ్లుగా మెరుగవుతూ వస్తున్నాడు. క్రికెట్‌ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడంలో కీలకంగా మారాడు. బ్యాటర్‌గానే కాకుండా నాయకత్వ లక్షణాలూ అతడిలో ఉన్నాయి. గుజరాత్‌ టైటాన్స్‌ను విజేతగా నిలవడంలో అవెంతో ఉపయోగపడ్డాయి. యువ కెప్టెన్‌ నాయకత్వంలో గుజరాత్‌ కొత్త ప్రయాణం మొదలు కానుంది’’ అని గుజరాత్‌ టైటాన్స్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్ విక్రమ్‌ సోలంకీ ట్వీట్‌ చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని