Hardik Pandya : వారెవ్వా హార్దిక్‌.. ఏమా మార్పు..!

భారత జట్టులో పేస్‌ బౌలింగ్‌తోపాటు బ్యాటింగ్‌ చేయగలిగే ఆటగాళ్లు చాలా తక్కువ. స్పిన్‌ బౌలింగ్‌ వేయగలిగేవారు. అయితే టీమ్‌ఇండియాకు తొలి వన్డే ప్రపంచకప్‌ను..

Published : 08 Jul 2022 17:04 IST

సూపర్‌ రికార్డు సాధించిన టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత జట్టులో పేస్‌ బౌలింగ్‌తోపాటు బ్యాటింగ్‌ చేయగలిగే ఆటగాళ్లు చాలా తక్కువ. టీమ్‌ఇండియాకు తొలి వన్డే ప్రపంచకప్‌ను అందించిన మాజీ సారథి కపిల్‌దేవ్ జట్టులో ఆల్‌రౌండర్‌ పాత్రనే పోషించాడు. అటు తర్వాత చాన్నాళ్లకు హార్దిక్‌ పాండ్య రూపంలో మరొకరు దొరికారని అభిమానులు సంబరపడిపోయారు.  

అభిమానుల ఆకాంక్షకు తగ్గట్టుగానే ఆరంభంలో టీమ్‌ఇండియా తరఫున, టీ20 లీగ్‌లో కీలక పాత్ర పోషించాడు. అయితే రెండేళ్ల కిందట ఎప్పుడైతే వెన్నముకకు గాయమైందో.. అప్పటి నుంచి క్రమంగా పాండ్య ఫామ్‌తోపాటు కెరీర్‌ గ్రాఫ్ పడిపోయింది. జట్టుకు భారంగా మారాడని విమర్శలు.. ఇంకో కీలకమైన ఆటగాడిని ఎంపిక చేసినా బాగుండేదని వ్యాఖ్యలు.. అప్పటికీ బ్యాటింగ్‌, బౌలింగ్‌లో విఫలమైన గతేడాది టీ20 ప్రపంచకప్‌లో కీలకమైన మ్యాచుల్లో రాణించలేకపోయాడు. బౌలింగ్‌లోనూ ప్రభావం చూపలేకపోయాడు. దీంతో శ్రీలంక, విండీస్‌ జట్లతో సిరీస్‌లకు ఎంపిక కాలేకపోయాడు. 

ఘనంగా పునరాగమనం.. 

గోడకేసి కొట్టిన బంతిలా హార్దిక్‌ పాండ్య కూడా వేగంగా ఫిట్‌నెస్‌ సాధించి గత టీ20 లీగ్‌లో ఘనంగా పునరాగమనం చేశాడు. ఇటు బ్యాటింగ్‌తోపాటు తనలోని నాయకుడి లక్షణాలను వెలుగులోకి తీసుకొచ్చి గుజరాత్‌ను టైటిల్‌ విన్నర్‌గా నిలిపాడు. బౌలింగ్‌లో ఎక్కువగా ఓవర్లు వేయకపోయినా.. అవసరమైనప్పుడు మాత్రం బంతిని అందుకొని వికెట్లు పడగొట్టి తనేంటో నిరూపించుకున్నాడు. ఐర్లాండ్‌పై కెప్టెన్‌గానూ, ఆటగాడిగా రాణించాడు. తాజాగా ఇంగ్లాండ్‌తో రోహిత్ నాయకత్వంలోని టీమ్‌ఇండియా మూడు టీ20ల సిరీస్‌ను ఆడుతోంది. అందులో భాగంగా తొలి టీ20 మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన హార్దిక్‌ పాండ్య అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకొన్నాడు. 

ఇదీ రికార్డు.. 

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20  మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య హాఫ్ సెంచరీ (51), బౌలింగ్‌లో 4/33 ప్రదర్శనతో రాణించాడు. ఈ క్రమంలో హార్దిక్‌ పాండ్య ఓ ఘనతను సాధించాడు. ఓ టీ20 మ్యాచ్‌లో అర్ధశతకంతోపాటు నాలుగు వికెట్లను పడగొట్టిన నాలుగో బౌలర్‌గా రికార్డుకెక్కాడు. ఇక ఈ ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌ హార్దిక్‌ పాండ్య కావడం విశేషం. గతంలో టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ కూడా ఇలాంటి ఫీట్‌కు చేరువగా వచ్చి మిస్‌ చేసుకొన్నాడు. శ్రీలంకతో 2009లో టీ20 సిరీస్‌ సందర్భంగా యువీ హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే మూడు వికెట్లను మాత్రమే తీశాడు. 

హార్దిక్‌ కంటే ముందు ఎవరు..? 

ఐసీసీ గుర్తింపు వచ్చిన దేశాల నుంచి ఒకే టీ20 మ్యాచ్‌లో అర్ధశతకంతోపాటు నాలుగు వికెట్లు తీసింది ఇప్పటి వరకు పాండ్యతో కలుపుకొని నలుగురు మాత్రమే. తొలుత విండీస్‌ మాజీ ఆటగాడు డ్వేన్ బ్రావో (2009) భారత్‌పైనే (66* పరుగులు, 4/38) సాధించడం గమనార్హం. జింబాబ్వే మీద 2011లో  పాక్‌ మాజీ ప్లేయర్‌ మహమ్మద్‌ హఫీజ్‌ (71 పరుగులు, 4/10), 2011లో ఆసీస్ మాజీ ఆటగాడు షేన్‌ వాట్సన్ (59 పరుగులు, 4/15) ఇంగ్లాండ్‌పై సాధించారు. అఫ్గానిస్థాన్‌ ఆటగాడు సమిముల్లా షిన్వారి (61 పరుగులు, 4/14) కెనడా మీద 2012లో సాధించినా పరిగణనలోకి రాదు. ఎందుకంటే అప్పటికి అఫ్గానిస్థాన్‌కు ఐసీసీ గుర్తింపు లేదు. 

ఇంత మార్పు ఎలా సాధ్యం.. ?

మ్యాచ్‌ అనంతరం హార్దిక్‌ మాట్లాడుతూ.. ‘‘ఫిట్‌నెస్‌పై చాలా సమయం వెచ్చించా. నా శరీరాన్ని సిద్ధంగా ఉంచుకునేందుకు కష్టపడ్డా. ఎలాగైనా సరే రిథమ్‌లోకి రావాలని బలంగా అనుకున్నా. కొంతకాలంపాటు ఆటకు దూరం కావడం కూడా మంచిది అయింది. బ్రేక్‌ తీసుకొని బరిలోకి దిగడం వల్ల బాగా ఆడగలుగుతున్నా. ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. ఎప్పుడైనా బాధ్యతలను తీసుకొనేందుకు సిద్ధంగా ఉంటా. భారత టీ20 లీగ్‌లో కెప్టెన్సీ చేయడం నా బాధ్యతను మరింత పెంచింది’’ అని పేర్కొన్నాడు. వెన్నెముక గాయం కారణంగా ఇబ్బంది పడిన తర్వాత అతడి ఆటను చూస్తే హార్దిక్‌ పాండ్య వ్యాఖ్యలు అక్షర సత్యం. జట్టు ప్రయోజనాల కోసం అవసరమైతే వ్యక్తిగత లక్ష్యాలను పక్కన పెట్టి మరీ ఆడతాడు. వచ్చే టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ తరఫున కీలక ఆటగాడిగా మారతాడనేదాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఆల్‌రౌండర్లు ఎంతమంది ఉంటే ఆ జట్టుకు అంత బలం.. కాబట్టే టీమ్‌ఇండియాకు హార్దిక్‌తోపాటు అశ్విన్‌, జడేజా, దీపక్‌ హుడా వంటి ఆల్‌రౌండర్లు కీలకంగా మారే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని