Hardik Pandya-Mumbai Indians: హార్దిక్‌ పాసవుతాడా?ముంబయి కెప్టెన్‌గా కఠిన పరీక్ష

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians)కు రోహిత్‌ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్య (Hardik Pandya)ను కెప్టెన్‌గా నియమించారు.

Updated : 16 Dec 2023 15:46 IST

ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians).. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టు. అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్టుగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో కలిసి ఉమ్మడిగా నంబర్‌వన్‌గా కొనసాగుతోంది. అయిదు టైటిళ్లు గెలిచిన ఆ జట్టుకు ఉండే ఫాలోయింగే వేరేగా ఉంటుంది. ఆటలో, ఆదరణలో ఆ జట్టుకు తిరుగులేదు. అలాంటి జట్టుకు కెప్టెన్‌ అంటే గొప్ప అవకాశమనే చెప్పాలి. ఆ లెవలే వేరు. ఇప్పుడు హార్దిక్‌ పాండ్య(Hardik Pandya)కు ఆ అవకాశం వచ్చింది. 2024  ఐపీఎల్‌ సీజన్‌ కోసం హార్దిక్‌ను ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌గా నియమించారు. అయితే ఆ హోదాతో వచ్చే సవాళ్లు, ఆ గౌరవంతో వచ్చే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ముంబయి సారథ్యం అనేది హార్దిక్‌కు పెద్ద పరీక్ష. మరి ఈ పరీక్షలో అతను పాసవుతాడా? 

గుజరాత్‌ వేరు..

2015లో ముంబయి ఇండియన్స్‌తోనే హార్దిక్‌ ఐపీఎల్‌ కెరీర్‌ మొదలైంది. భారీ షాట్లతో హార్డ్‌ హిట్టర్‌గా, మంచి పేస్‌ బౌలింగ్‌తో వికెట్లు కూలుస్తూ ఆల్‌రౌండర్‌గా హార్దిక్‌ ఎదిగాడు. జాతీయ జట్టులోకి వచ్చాడు. 2021 వరకు ముంబయితోనే హార్దిక్‌ ఆడాడు. కానీ వెన్నెముకకు శస్త్రచికిత్స కారణంగా లీగ్‌లో అనుకున్నంతగా రాణించలేకపోయాడు. దీంతో 2022 సీజన్‌కు ముందు హార్దిక్‌ను ముంబయి వదిలేసింది. కానీ అతని సామర్థ్యాలపై నమ్మకముంచిన కొత్త జట్టు గుజరాత్‌ టైటాన్స్‌.. హార్దిక్‌ను తీసుకోవడమే కాకుండా కెప్టెన్‌నూ చేసింది. ఆ జట్టు తొలి సీజన్‌ (2022)లోనే హార్దిక్‌ కెప్టెన్‌గా, ఆల్‌రౌండర్‌గా అదరగొట్టాడు. యువ ఆటగాళ్లతో నిండిన జట్టును నడిపించడాన్ని సవాలుగా తీసుకున్నాడు. మంచి నాయకత్వ నైపుణ్యాలతో మెప్పించాడు. యువ ఆటగాళ్లతో కలిసిపోయి జట్టును నడిపించాడు. కెప్టెన్‌గా తొలి సీజన్‌లోనే గుజరాత్‌ను విజేతగా నిలపడంతో హార్దిక్‌ పేరు మార్మోగింది. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో టీమ్‌ఇండియా సారథ్య బాధ్యతలు దక్కాయి. ఈ ఏడాది కూడా అదే జోరు కొనసాగించిన హార్దిక్‌.. గుజరాత్‌ను రన్నరప్‌గా నిలిపాడు. దీంతో హార్దిక్‌ను ముంబయి తిరిగి దక్కించుకుంది. వద్దనుకున్న జట్టే తిరిగి అతని కోసం వచ్చేలా హార్దిక్‌ చేశాడంటే అతని ప్రతిభ ఏమిటో తెలుస్తోంది. 

ముంబయి వేరు..

గుజరాత్‌ అంటే కొత్త జట్టు. పైగా యువ ఆటగాళ్లు. కాబట్టి ఎలాంటి ఒత్తిడి అన్నది లేకుండా స్వేచ్ఛగా హార్దిక్‌ జట్టును నడిపించాడు. కానీ ముంబయి ఇండియన్స్‌ జట్టులో అలాంటి వాతావరణం ఉండకపోవచ్చు. ఎందుకంటే జట్టులో రోహిత్‌ శర్మ (Rohit Sharma), బుమ్రా, సూర్యకుమార్‌ యాదవ్‌ లాంటి స్టార్లు ఉన్నారు. వీళ్లందరూ హార్దిక్‌ కంటే సీనియర్లే. వీళ్లను సమన్వయం చేసుకుంటూ జట్టును ముందుకు తీసుకెళ్లడం హార్దిక్‌కు కత్తిమీద సాములాంటిదే. మరోవైపు గత కొన్ని సీజన్లుగా ముంబయి ప్రదర్శన ఆశాజనకంగా లేదు. 2021, 2022లో ప్లేఆఫ్స్‌ కూడా చేరలేదు. ఈ ఏడాది రెండో క్వాలిఫయర్‌లో గుజరాత్‌ చేతిలోనే ఓడింది. కాబట్టి ముందుగా జట్టు ప్రదర్శన మెరుగుపడేలా, మరో టైటిల్‌ సాధించేలా చేసే అతిపెద్ద బాధ్యత హార్దిక్‌పై ఉంది. అంతే కాకుండా సారథ్యంలో రోహిత్‌ను మరిపించాల్సి కూడా ఉంటుంది. 2013 మధ్యలో నుంచి 2023 వరకు 11 సీజన్లపాటు ముంబయిని నడిపించిన రోహిత్‌ ఏకంగా అయిదు టైటిళ్లు అందించాడు. ముంబయి గెలిచిన ట్రోఫీలన్నీ రోహిత్‌ కెప్టెన్సీలో వచ్చినవే. కెప్టెన్‌గా రోహిత్‌ లేని ముంబయిని చూడటం కష్టమే. ముఖ్యంగా రోహిత్, ముంబయి ఇండియన్స్‌ అభిమానులు ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్‌గా రోహిత్‌ ప్లేస్‌లో హార్దిక్‌ను నియమించారనే తెలియగానే గంటలోపే ముంబయి ఇండియన్స్‌ ఎక్స్‌ ఖాతాను 4 లక్షల మంది అన్‌ఫాలో చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఇదే జరుగుతోంది. దీన్ని బట్టి ముంబయి కెప్టెన్‌గా రోహిత్‌ వేసిన ముద్ర ఎలాంటిదో స్పష్టమవుతోంది. అందుకే రోహిత్‌ వారసత్వాన్ని నిలబెట్టడం హార్దిక్‌పై ముందున్న అతిపెద్ద సవాల్‌. మరోవైపు టీమ్‌ఇండియా టీ20 కెప్టెన్‌గా హార్దిక్‌ నిలబడాలంటే కూడా.. ముంబయికి కెప్టెన్‌గా అతని ప్రదర్శన కచ్చితంగా ప్రభావం చూపుతుంది. మరి ఈ సవాళ్లను దాటి.. ఈ కఠిన పరీక్షలో హార్దిక్‌ ఎలా నెగ్గుకువస్తాడో చూడాలి.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని