Rohit - Hardik: కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్‌ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్‌ పఠాన్

 ముంబయి ఇండియన్స్‌ గురించి భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్‌ పఠాన్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్‌ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్‌గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. 

Updated : 23 Apr 2024 14:12 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ 17 సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌ పేలవ ప్రదర్శన చేస్తోంది. సోమవారం ముంబయిపై రాజస్థాన్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. హార్దిక్ సేన ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడి మూడింట మాత్రమే నెగ్గింది. ఈ నేపథ్యంలో ముంబయి ఇండియన్స్‌ గురించి భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్‌ పఠాన్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్‌ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్‌గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. ఇటీవల పంజాబ్‌, ముంబయి మ్యాచ్‌లో చివరి ఓవర్‌కు ముందు జరిగిన సంఘటనను ప్రస్తావిస్తూ పఠాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ముంబయి బౌలర్ ఆకాశ్‌ మధ్వాల్ రోహిత్ దగ్గరకు వెళ్లి బౌలింగ్‌ వ్యూహాలు, ఫీల్డింగ్ సెటప్ గురించి చర్చించగా.. పక్కన ఉన్న కెప్టెన్ హార్దిక్ పాండ్య చూస్తూ ఉండిపోయాడు.

‘‘ఆకాశ్‌ మధ్వాల్‌, హార్దిక్ పాండ్య ఉన్నారు. మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో వేయాల్సి ఉండటంతో ఒత్తిడిలో ఉన్న ఆకాశ్..  రోహిత్ శర్మ దగ్గరికి వెళ్లాడు. ఫీల్డింగ్‌ సెటప్ గురించి రోహిత్‌తో మాత్రమే మాట్లాడుతున్నాడు. ‘అతను నా కెప్టెన్.. మరో వ్యక్తి కాదు’ అనే నమ్మకం మనలో ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. ఈ విషయంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. హార్దిక్ పాండ్య దీన్ని చేయగలడని నేను భావిస్తున్నాను’’ అని రాజస్థాన్‌, ముంబయి మ్యాచ్‌లో ఇర్ఫాన్ పఠాన్‌ కామెంటెటరీ చేస్తూ అన్నాడు. 


నెక్ట్స్‌ టీ20 కెప్టెన్ సంజు శాంసన్‌: హర్భజన్ 

సంజు శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్‌ రాయల్స్‌ ఐపీఎల్ 17 సీజన్‌లో అదరగొడుతోంది. యశస్వి జైస్వాల్ శతకం బాదడంతో సోమవారం ముంబయిని 9 వికెట్ల తేడాతో ఓడించి ఏడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. శాంసన్ కెప్టెన్‌గా, ఆటగాడిగా ఆకట్టుకున్నాడు. ముంబయితో మ్యాచ్‌ అనంతరం భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సంజుపై ప్రశంసలు కురిపించాడు. ‘‘క్లాస్ పర్మినెంట్‌ అనేదానికి యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్‌ నిదర్శనం. ఫామ్ అనేది తాత్కాలికం. వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ గురించి ఎటువంటి చర్చ జరగకూడదు. టీ20 ప్రపంచ కప్ భారత జట్టులో సంజు శాంసన్ ఉండాలి. రోహిత్ శర్మ తర్వాత శాంసన్‌ టీమ్‌ఇండియాకు తదుపరి టీ20 కెప్టెన్‌గా ఎదుగుతాడనడంలో మీకు ఏమైనా  అనుమానాలున్నాయా?’’ అని భజ్జీ ఎక్స్‌ (x)లో పోస్టు పెట్టాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని