Avinash Sable: స్టీపుల్‌ఛేజ్‌.. భారతీయులూ గెలవగలరని నిరూపించాడతడు..!

‘‘లాంగ్‌ డిస్టెన్స్‌ రేసుల్లో ఆఫ్రికన్లు, కెన్యన్లు, ఇథోపియన్లే కాదు.. భారతీయులు కూడా పతకాలు సాధించగలరని నిరూపించి చూపించాను’’ అంటున్నాడు 27ఏళ్ల అవినాశ్ ముకుంద్‌ సాబలే. గత శనివారం జరిగిన పురుషుల 3000

Updated : 08 Aug 2022 16:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘‘లాంగ్‌ డిస్టెన్స్‌ రేసుల్లో ఆఫ్రికన్లు, కెన్యన్లు, ఇథోపియన్లే కాదు.. భారతీయులు కూడా పతకాలు సాధించగలరని నిరూపించి చూపించాను’’ అంటున్నాడు 27ఏళ్ల అవినాశ్ ముకుంద్‌ సాబలే. గత శనివారం జరిగిన పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ ఛేజ్‌లో అవినాష్‌ రజత పతకం సాధించాడు. కామన్వెల్త్‌ క్రీడల్లో లాంగ్‌ డిస్టెన్స్‌లో పతకం నెగ్గిన తొలి భారత పురుష అథ్లెట్‌గా సరికొత్త చరిత్ర లిఖించాడు. ఇంతకీ ఏంటీ స్టీపుల్‌ ఛేజ్‌ ప్రత్యేకత.. కెన్యన్లను వెనక్కి నెట్టి సాబలే ఎలా విజయం సాధించాడో చూద్దాం..

స్టీపుల్‌చేజ్‌ రేసు ఇలా..

అథ్లెటిక్స్‌లో ఓ విభాగమైన స్టీపుల్‌ఛేజ్‌ అడ్డంకులతో కూడుకున్న సుదీర్ఘ పరుగుపందెం. ఇందులో ఎక్కువగా నిర్వహించేది 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌ ఈవెంటే. ఇందులో ట్రాక్‌పై పలు చోట్ల అడ్డంకులను ఏర్పాటు చేస్తారు. అవి దాటుకుంటూ అందరికంటే ముందు రేసును పూర్తిచేసిన వారు విజేతగా నిలుస్తారు. 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌ ట్రాక్‌పై 28 బారియర్లు, ఏడు వాటర్‌ జంప్స్‌ ఉంటాయి. ఒక్కో బారియర్‌ 914 మిల్లీమీటర్ల ఎత్తులో ఉంటుంది. ఒక్కో ల్యాప్‌కు 400 మీటర్ల చొప్పున మొత్తం ఏడున్నర ల్యాప్‌లు ఉంటాయి. ప్రతీ ల్యాప్‌కు ఒక వాటర్‌ జంప్‌ ఉంటుంది. ఈ లాంగ్‌డిస్టెన్స్‌ రేసులో ఎక్కువగా ఆఫ్రికా దేశస్థులే పతకాలు సాధిస్తున్నారు. 2018లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లోనూ కెన్యాకు చెందిన కిప్రుటో కేవలం 8 నిమిషాల 10.08 సెకన్లలోనే ఈ రేసును పూర్తిచేసి స్వర్ణం నెగ్గాడు. రెండో స్థానంలోనూ కెన్యా అథ్లెట్‌ అబ్రహం కిబివోట్‌ రజతం గెలుచుకున్నాడు.

సాబలే.. 0.05 సెకన్ల తేడాతో స్వర్ణం చేజారి..

శనివారం జరిగిన 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో అవినాశ్ సాబలేపై ఏ మాత్రం అంచనాల్లేవ్‌. ఇటీవల జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లోనూ అతడు నిరాశపర్చాడు. కానీ, గతవారం జరిగిన రేసులో సాబలే చెలరేగిపోయాడు. రేసు మొదలైన వెంటనే సాబలే అందరికంటే ముందే పరిగెత్తాడు. దాదాపు 2 నిమిషాల పాటు ఆధిపత్యం కొనసాగించి మొదటి అడ్డంకిని దాటేశాడు. అయితే ఆ తర్వాత కెన్యన్‌ అథ్లెట్లు ముగ్గురు ఒక్కొక్కరిగా సాబలేను దాటుకుంటూ వెళ్లిపోయారు. దీంతో అవినాశ్ నాలుగో స్థానంతో వెనుకబడ్డాడు. 2400 మీటర్ల వరకు కెన్యాకు చెందిన ముగ్గురు తొలి మూడు స్థానాల్లో పరిగెత్తారు. ఇక, అవినాశ్‌కు పతకం అసాధ్యమే అనుకున్నారంతా.

కానీ, అప్పుడే సాబలే అద్భుతం చేశాడు. వెనుకంజలో ఉన్నప్పటికీ పతకమే లక్ష్యంగా దూసుకెళ్లాడు. ఆరో ల్యాప్‌ దగ్గర నెమ్మదిగా తన వేగాన్ని పుంజుకున్నాడు. మూడో స్థానానికి.. ఆ వెంటనే రెండో స్థానంలోకి వచ్చాడు. చివర్లో ఒక దశలో అవినాశ్‌ తొలి స్థానంలోకి వచ్చినట్లే వచ్చి వెనక్కి వెళ్లాడు. చివరి హర్డిల్‌ సమయంలో ఒకింత కంగారు పడటంతో పాటు.. మొదటి స్థానంలో ఉన్న ప్రత్యర్థి అబ్రహం కిబివోట్‌ సడెన్‌గా తన దిశను మార్చుకోవడంతో గందరగోళానికి గురయ్యాడు. దీంతో రెండో స్థానంతో రేసును ముగించి రజత పతకం సాధించాడు. 8 నిమిషాల 11.20 సెకన్ల టైమింగ్‌తో తన జాతీయ రికార్డు (8.12.48 )ను మెరుపుపర్చుకుని పతకం నెగ్గాడు. అయితే 0.05 సెకన్ల తేడాతో అతడు పసిడి కోల్పోయాడు. అబ్రహం 8.11.15 నిమిషాల్లో స్వర్ణం గెలుచుకున్నాడు.

కామన్వెల్త్‌ క్రీడల్లో కెన్యా దేశస్థులు కాకుండా మరో దేశానికి చెందిన అథ్లెట్‌ ఈ లాంగ్‌ డిస్టెన్స్‌ రేసులో పతకం సాధించడం 1994 తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. 2014లో గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్‌లో  కెన్యన్లు పతకం సాధించిన సమయంలో అవినాశ్ కనీసం ఈ రేసులో అడుగైనా పెట్టలేదు. 2015 నుంచి ఈ పోటీల్లో పాల్గొనడం మొదలుపెట్టిన సాబలే.. తక్కువ సమయంలోనే దేశానికి పతకం అందించి సరికొత్త ఘనత సాధించాడు.

6కి.మీలు పరిగెత్తి స్కూల్‌కెళ్లి..

27 ఏళ్ల అవినాశ్ సాబలే స్వస్థలం మహారాష్ట్రలోని బీద్‌ జిల్లా. వీరిది పేద కుటుంబం. పొట్టకూటి కోసం సాబలే తల్లిదండ్రులు ఇటుకల బట్టీలో కూలీలుగా పనిచేసేవారు. చదువుకోవాలని ఉన్నప్పటికీ.. బస్సెక్కి వెళ్లేందుకు డబ్బుల్లేక రోజూ 6 కిలోమీటర్లు స్కూల్‌కు పరిగెత్తుకుంటూ వెళ్లేవాడు. కాలేజీకి కూడా 8 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వెళ్లేవాడు. అతడి టాలెంట్‌ను గుర్తించిన ఓ టీచర్‌.. రన్నింగ్‌ పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించారు. ఆ తర్వాత 18ఏళ్ల వయసులో భారత సైన్యంలో చేరిన అతడు.. టీనేజ్‌లోనే సియాచిన్‌లో విధులు నిర్వర్తించాడు. ఆర్మీలో ఉండగానే అనేక రన్నింగ్‌ ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొని విజేతగా నిలిచాడు. ఆ తర్వాత స్టీపుల్‌ఛేజ్‌లో శిక్షణ తీసుకుని ఇప్పుడు దేశానికి తొలి పతకం తీసుకొచ్చాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని