SA vs IND: ఇండియా అంటే చాలు... చెలరేగిపోతారు

టీమ్‌ ఇండియాతో మ్యాచ్‌ అంటే కొంతమంది బ్యాటర్లు ఎన్నాళ్లుగానో కోల్పోయిన ఫామ్‌ను తిరిగి అందిపుచ్చుకుంటారు అంటుంటారు. ఫామ్‌లో ఉన్నవాళ్లయితే శతకాల మోత మోగిస్తుంటారు. 

Published : 29 Dec 2023 16:26 IST

కొంతమంది క్రికెటర్లకు కొన్ని జట్లపై ఆడడం అంటే మహా ఇష్టం. ఒకప్పుడు సచిన్‌ తెందుల్కర్, వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఆస్ట్రేలియాపై ఆడటాన్ని ఆస్వాదించేవాళ్లు. సహచరులంతా విఫలమైనా ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్‌లు ఆడారు. దక్షిణాఫ్రికా బ్యాటర్‌ డీన్‌ ఎల్గర్‌ (Dean Elgar) కూడా ఇదే కోవకు చెందుతాడు. భారత్‌ (Team India) అంటే చాలు అతడు భలే ఆడేస్తాడు. గత దక్షిణాఫ్రికా పర్యటనలో టీమ్‌ఇండియా జోరును అడ్డుకున్న అతడు.. ఇప్పుడు కూడా సుదీర్ఘ ఇన్నింగ్స్‌తో అదరగొట్టి దక్షిణాఫ్రికా (South Africa Cricket) విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సిరీస్‌ (India vs South Africa) తర్వాత రిటైర్‌ అయ్యే ఆలోచనలో ఉన్న ఎల్గర్‌.. తన చివరి సిరీస్‌ను చిరస్మణీయం చేసుకున్నాడు. 

అప్పుడలా.. ఇప్పుడిలా

భారత్‌పై ఆడటమంటే ఎల్గర్‌ ఎంతగా ఇష్టపడతాడంటే అతడి టాప్‌-5 టెస్టు ఇన్నింగ్స్‌లను తీసుకుంటే వాటిలో మూడు టీమ్‌ఇండియాపైనే ఉన్నాయి. 2022లో కెప్టెన్‌ కూడా అయిన అతడు ముందుండి నడిపించాడు. తొలి మ్యాచ్‌లో భారత్‌ చేతిలో ఓడినా ఆ సిరీస్‌ను దక్షిణాఫ్రికా సమం చేయగలిగిందంటే అందుకు కారణం ఎల్గర్‌ అద్భుత బ్యాటింగే. రెండో టెస్టులో గెలవాలంటే 240 పరుగులు చేయాల్సి ఉండగా.. భారత బౌలర్ల జోరు మీదున్నా, ఎల్గర్‌ మాత్రం అలవోకగా ఆడేశాడు. చక్కటి ఫుట్‌వర్క్, డిఫెన్స్‌తో నాణ్యమైన భారత పేస్‌ బౌలర్లను అతడు దీటుగా ఎదుర్కొన్నాడు. 96 పరుగులతో అజేయంగా నిలిచి భారత్‌ విజయాన్ని అడ్డుకున్నాడు. ఏడాది తర్వాత మళ్లీ ఎల్గర్‌ భారత్‌కు అడ్డుగా నిలిచాడు. ప్రత్యర్థిని వీలైనంత తక్కువ స్కోరుకు కట్టడి చేద్దామనుకున్న టీమ్‌ఇండియా ఆశలపై నీళ్లు చల్లుతూ భారీ శతకంతో అదరగొట్టాడు. సొంతగడ్డపైనే కాదు భారత్‌లోనూ భారత్‌పై ఎల్గర్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. 2019లో విశాఖపట్నంలో జరిగిన టెస్టులో అతడు 160 పరుగులు చేశాడు. స్పిన్‌కు దాసోహమంటున్న పిచ్‌పై అశ్విన్, జడేజాలను ఎదుర్కొంటూ ఆడిన ఈ ఇన్నింగ్స్‌ ఎల్గర్‌ సత్తాకు నిదర్శనం.

వాళ్లు కూడా..

ఎల్గర్‌ మాత్రమే కాదు భారత్‌ అంటే చెలరేగే ఆటగాళ్లు చరిత్రలో చాలామందే ఉన్నారు. అప్పటివరకు ఫామ్‌ లేక తంటాలు పడిన వాళ్లు కూడా టీమ్‌ఇండియాతో సిరీస్‌ అనగానే పూనకాలు వచ్చినట్లు ఆడిన సందర్భాలు ఉన్నాయి. శివ్‌ నారాయణ్‌ చందర్‌పాల్‌ (వెస్టిండీస్‌), రికీ పాంటింగ్‌ (ఆస్ట్రేలియా), ఆండీ ఫ్లవర్‌ (జింబాబ్వే), జాక్వెస్‌ కలిస్‌ (దక్షిణాఫ్రికా), సనత్‌ జయసూర్య (శ్రీలంక) అలాంటి వారే. వీరిలో కొందరు ఒకే ఫార్మాట్లో రాణిస్తే.. ఇంకొందరు అటు టెస్టు, ఇటు వన్డేల్లోనూ మెరిశారు. భారత్‌పై జయసూర్య 89 వన్డేల్లో 2899 పరుగులు సాధించాడు. ఇందులో 7 సెంచరీలు, 14 అర్ధసెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో ఒక ట్రిపుల్‌ సెంచరీ (340) కూడా కొట్టేశాడు. 

ఇక వెస్టిండీస్‌ బ్యాటర్‌ చందర్‌పాల్‌ 63 సగటుతో 25 టెస్టుల్లో 2171 పరుగులు సాధించాడు. భారత్‌తో మ్యాచ్‌ అనగానే చందర్‌పాల్‌ వేరే మోడ్‌లోకి వెళ్లిపోయేవాడు. ఎన్నో మ్యాచ్‌ల్లో ఒంటిచేత్తో జట్టు కుప్పకూలకుండా రక్షించిన సందర్భాలు ఉన్నాయి. భారత్‌ విజయాలను అడ్డుకున్న సందర్భాలూ లేకపోలేదు. జింబాబ్వే మాజీ స్టార్‌ ఆండీ ఫ్లవర్‌ ఏడిపించినట్టు ఎవరూ ఏడిపించలేదు. భారత్‌ అనగానే ఫ్లవర్‌ పాతుకుపోయేవాడు. అతడు 9 టెస్టుల్లో 1138 పరుగులు చేశాడు. ఒక సిరీస్‌లో డబుల్‌ సెంచరీతో అదరగొట్టాడు. ఇక రికీ పాంటింగ్, జాక్వెస్‌ కలిస్, కుమార సంగక్కర భారత్‌పై ఆడటాన్ని ఎంతో ఆస్వాదించేవాళ్లు తాజాగా ఎల్గర్‌ ఆడినట్లుగానే కీలక సమయాల్లో అదరగొట్టేసి మ్యాచ్‌లను మలుపు తిప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని