ODI Match : స్కోరు 300 దాటినా.. సిక్సర్‌ ముచ్చట లేదు..!

ఇటీవల కాలంలో క్రికెట్‌లో దూకుడు ఎక్కువైంది. టీ20లు వచ్చాక మరీ ఎక్కువైంది. దాని ప్రభావం అటు వన్డేలు, టెస్టులపైనా పడింది. గతంలో వన్డేలు అంటే...

Published : 21 Jul 2022 13:12 IST

తాజాగా ఇంగ్లాండ్‌పై ఫీట్‌ సాధించిన దక్షిణాఫ్రికా

ఇంటర్నెట్ డెస్క్‌: ఇటీవల క్రికెట్‌లో దూకుడు ఎక్కువైంది. టీ20లు వచ్చాక ఇది స్పష్టంగా కనిపిస్తోంది. దాని ప్రభావం అటు వన్డేలు, టెస్టులపైనా పడింది. గతంలో వన్డేలు అంటే తొలి పది ఓవర్లు వేగంగా.. ఆ తర్వాత నిలకడగా.. మళ్లీ చివర్లో దూకుడు ప్రదర్శించేవారు. కానీ, పొట్టి ఫార్మాట్ వచ్చాక మాత్రం ఆసాంతం బాదుడే బాదుడు. ఇది వన్డేల్లోనూ కనిపిస్తోంది. కానీ, 50 ఓవర్ల ఆట చరిత్రలో నాలుగుసార్లు మాత్రం ఒక్క సిక్సర్‌ కూడా లేకుండానే జట్టు భారీ స్కోరు సాధించడం విశేషం. ఇంతకీ ఆ సందర్భాలేంటో తెలుసుకుందాం...  

తొలిసారి ఘనత ఇంగ్లాండ్‌దే

క్రికెట్‌కు పుట్టినిల్లుగా భావించే ఇంగ్లాండ్‌ వన్డేల్లో ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఒక్క సిక్సర్‌ లేకుండా ఇన్నింగ్స్‌ను ముగించింది. 2011లో ఆస్ట్రేలియా పర్యటనకు ఇంగ్లాండ్ వెళ్లింది. ఆరోవన్డే మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసింది. జొనాథన్ ట్రాట్ (137), ఆండ్రూ స్ట్రాస్‌ (63) రాణించారు. అయితే, ఈ ఇన్నింగ్స్‌లో 28 ఫోర్లు కొట్టిన ఇంగ్లాండ్ బ్యాటర్లు ఒక్కటంటే ఒక్క సిక్సర్‌ను కూడా బాదకపోవడం విశేషం. అనంతరం లక్ష్యాన్ని ఆసీస్‌ ఎనిమిది వికెట్లను కోల్పోయి 49.2 ఓవర్లలో ఛేదించింది. ఇంగ్లాండ్‌ ఒక్క సిక్సర్‌ను కూడా సాధించలేని మైదానంలో ఆసీస్‌ బ్యాటర్లు ఐదు సిక్స్‌లను కొట్టారు. 

తొమ్మిదేళ్లకు లంక కూడా..

ఇంగ్లాండ్‌ సృష్టించిన రికార్డును తొమ్మిదేళ్ల తర్వాత లంక సాధించడం గమనార్హం. అయితే లంక స్కోరు దాదాపు 350 పరుగులకు చేరువ కావడం ఇక్కడ గమనించదగ్గిన విషయం. విండీస్‌తో 2020లో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఓపెనర్‌ ఆవిష్క ఫెర్నాండో (127), కుశాల్ మెండిస్ (119) శతకాలు సాధించారు. దీంతో లంక స్కోరు 345/8గా నిలిచింది. అయినప్పటికీ ఒక్క సిక్స్‌ కొట్టకపోవడం చెప్పుకోదగిన విషయం. లక్ష్య ఛేదనలో విండీస్‌ 184 పరుగులకే కుప్పకూలింది. వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌లోనూ ఫాబియన్‌ అలెన్ (17) మాత్రమే ఏకైక సిక్సర్ బాదాడు. షైహోప్‌ (51) మాత్రమే హాఫ్ సెంచరీ చేశాడు. 

తాజాగా ఇంగ్లాండ్‌పై సౌతాఫ్రికా

ఇంగ్లాండ్‌ టెస్టు జట్టు సారథి బెన్‌ స్టోక్స్‌ కెరీర్‌లో తన చివరి వన్డే మ్యాచ్ దక్షిణాఫ్రికాతో ఆడేశాడు. స్టోక్స్ ఘోరంగా విఫలం కావడంతో ఇంగ్లాండ్‌ ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌ కూడా వన్డే క్రికెట్‌ చరిత్రలో నిలిచిపోనుంది. ఎందుకంటే దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్సర్‌ కూడా లేదు. తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా 333/5 స్కోరు సాధించింది. వాన్‌డర్ డస్సెన్ (134) శతకంతోపాటు మార్‌క్రమ్‌ (77), మలన్ (57) హాఫ్ సెంచరీలు సాధించారు. అయితే, ఎవరూ కూడా సిక్సర్‌ బాదలేదు. బెన్‌స్టోక్స్‌కు విజయంతో ఘన వీడ్కోలు చెబుదామనుకున్న ఇంగ్లాండ్‌ 62 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. జో రూట్ (86), జానీ బెయిర్‌స్టో (63) అర్ధశతకాలు సాధించినా జట్టును గెలిపించలేకపోయారు. ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌(271)లో మూడు సిక్స్‌లు మాత్రమే నమోదయ్యాయి. 

మహిళా క్రికెట్‌ టీమ్‌దే రికార్డు

జట్టు స్కోరు 400 దాటి.. అందులో ఒక్క సిక్స్‌ కూడా లేదంటే మీరు నమ్ముతారా..?అయితే ఇలాంటి అద్భుతం మహిళల క్రికెట్‌లో చోటు చేసుకొంది. 1997 వన్డే ప్రపంచకప్‌ పోటీల్లో భాగంగా ఆసీస్‌, డెన్మార్క్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ మహిళా టీమ్‌ 50 ఓవర్లలో కేవలం మూడు వికెట్లను కోల్పోయి 412 పరుగులను సాధించింది. ఆ జట్టు కెప్టెన్ బెలిండా క్లార్క్ (229*) ఏకంగా డబుల్‌ సెంచరీ బాదేసింది. లిసా (60), కారెన్ రోల్టన్ (64) అర్ధశతకాలతో చెలరేగారు. అయితే, వీరెవరూ ఒక్క సిక్స్‌ కూడా కొట్టలేదు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన డెన్మార్క్‌ 49 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్‌ బౌలర్ల దెబ్బకు సిక్సర్‌ లేకపోగా.. కేవలం మూడే ఫోర్లను డెన్మార్క్‌ బ్యాటర్లు కొట్టగలిగారు. అలా ఒక్క సిక్స్‌ లేకుండానే ముగిసిన మ్యాచ్‌గా రికార్డు సృష్టించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని