IPL-PowerPlay : పవర్‌ప్లేలో పవర్‌ ఎవరిది..? దంచికొట్టిన జట్లు ఇవే..

ఏ జట్టు అయినా భారీ స్కోరు చేయాలంటే పవర్‌ ప్లే(Power Play) ఎంతో కీలకం. ఫీల్డింగ్‌ నిబంధనలు ఉపయోగించుకుని బ్యాటర్లు జట్టుకు శుభారంభాన్ని ఇస్తుంటారు.

Updated : 30 Apr 2023 14:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ :  ఐపీఎల్‌(IPL)లో పరుగుల సునామీ కొనసాగుతోంది. బ్యాటర్లు వీరవిహారం చేస్తుండటంతో ఈ సీజన్‌లో 200+ స్కోర్లు అలవోకగా నమోదవుతున్నాయి. ఇక ఈ ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా రికార్డును శుక్రవారం లఖ్‌నవూ(257) జట్టు తృటిలో చేజార్చుకుంది. అయితే.. ఈ భారీ స్కోర్లకు బాటలు వేస్తోంది పవర్‌ప్లే(PowerPlay)నే. తొలి ఆరు ఓవర్లలో బ్యాటర్లు ఫీల్డింగ్‌ నిబంధనలు ఉపయోగించుకొని దూకుడుగా ఆడుతున్నారు. ఏ జట్టైతే పవర్‌ప్లేను చక్కగా ఉపయోగించుకుంటుందో.. వారు ప్రత్యర్థుల ముందు పెద్ద స్కోర్లను ఉంచుతున్నారు. ఐపీఎల్‌ చరిత్రలో పవర్‌ప్లేలో భారీగా పరుగులు రాబట్టిన జట్ల గురించి తెలుసుకుందామా..

  1. 105 పరుగులు.. పొట్టి ఫార్మాట్‌లో ఓ జట్టు చేసిన మొత్తం స్కోరు కాదండీ ఇది. కేవలం పవర్‌ప్లేలోనే దంచి కొట్టిన స్కోరు ఇది. ఆరు ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా ఇంత భారీ స్కోరును కోల్‌కతా (kolkata knight riders) జట్టు బెంగళూరు (RCB)పై 2017వ సీజన్‌లో నమోదు చేసింది. ఇదే ఐపీఎల్‌ చరిత్రలో అత్యుత్తమ పవర్‌ప్లే స్కోరు. కోల్‌కతా ఓపెనర్లు సునీల్‌ నరైన్‌, క్రిస్‌ లీన్‌ బెంగళూరు బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. ఇందులో 16 బంతుల్లో నరైన్‌ 54 పరుగులు చేయగా.. లీన్‌ 20 బంతుల్లో 49 పరుగులు చేశాడు.
  2. ఇక చెన్నై సూపర్‌ కింగ్స్‌(chennai super kings) 2014లో పంజాబ్‌ కింగ్స్‌పై తొలి ఆరు ఓవర్లలో వంద పరుగులు నమోదు చేసింది.
  3. అదే సీఎస్కే(CSK) జట్టు మరోసారి 2015వ సీజన్‌లో ముంబయిపై పవర్‌ప్లేలో దంచి కొట్టింది. 90 పరుగులు పిండుకుంది.
  4. 2011లో అప్పటి కొచ్చి టస్కర్స్‌ జట్టు రాజస్థాన్‌పై పవర్‌ప్లేలో 2 వికెట్ల నష్టానికి  87 పరుగులు చేసింది.
  5. ఇక శుక్రవారం మ్యాచ్‌లో లఖ్‌నవూకు దారుణంగా పరుగులిచ్చిన పంజాబ్‌ కింగ్స్‌(punjab kings) గతంలో పవర్‌ప్లేను చక్కగా ఉపయోగించుకుంది. 2014లో సన్‌రైజర్స్‌పై తొలి ఆరు ఓవర్లలో 86 పరుగులు చేసి ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది.
  6. ఇక ఈ సీజన్‌(IPL 2023)లోనే హైదరాబాద్‌(sunrisers hyderabad)పై ఆడిన తొలి మ్యాచ్‌లోనే రాజస్థాన్‌(Rajasthan Royals)  బ్యాటర్లు విరుచుకుపడ్డారు. పవర్‌ప్లేలో వికెట్‌ నష్టానికి 85 పరుగులు చేశారు. 2013వ సీజన్‌లో ఇప్పటి వరకూ ఇదే అత్యధిక పవర్‌ ప్లే స్కోరు కాగా.. ఐపీఎల్‌ చరిత్రలో ఆరో అత్యధిక స్కోరు ఇది.

ఇక ఐపీఎల్‌లో అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టు ఏదో తెలుసా.. మన సన్‌రైజర్సే(SRH). గత ఐపీఎల్‌ సీజన్‌లోనే ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

  • 2022లో రాజస్థాన్‌ నిర్దేశించిన 211 పరుగుల ఛేదనకు దిగిన హైదరాబాద్‌..  తొలి ఆరు ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి కేవలం 14 పరుగులు మాత్రమే చేసింది.
  • ఈ జాబితాలో ఆ తర్వాతి స్థానంలో రాజస్థాన్‌ జట్టు ఉంది. 2009లో బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పవర్‌ ప్లేలో 2 వికెట్ల నష్టానికి 14 పరుగులు చేసింది.
  • మూడో స్థానంలో చెన్నై (15/2) ఉంది. 2011లో కోల్‌కతాపై ఆ జట్టు పవర్‌ప్లేలో అత్యల్ప స్కోరు నమోదు చేసింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు