Hockey India: ఇలాగే సాగితే.. హాకీలో మళ్లీ

హాకీ ఇండియా అద్భుతమైన ప్రదర్శనతో చెలరేగిపోతోంది. తాజాగా ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీలో అదరగొట్టి విజేతగా నిలిచింది. ఇలా నాలుగోసారి ఛాంపియన్‌గా మారిన హాకీ ఇండియా జట్టు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరాలని ఆశిద్దాం..

Published : 14 Aug 2023 14:13 IST

మన హాకీ (Hockey) మళ్లీ ఆశలు రేకెత్తిస్తోంది. భవిష్యత్‌ ‘స్వర్ణ’ మయం అవుతుందనే నమ్మకాన్ని కలిగిస్తోంది. ఇటీవల భారత హాకీ జట్ల నిలకడైన ప్రదర్శనే అందుకు కారణం. అంతర్జాతీయ వేదికపై మహిళలు, పురుషుల జట్లు అదరగొడుతున్నాయి. ముఖ్యంగా పురుషుల జట్టు సంచలన ప్రదర్శనతో సాగుతోంది. ఇటీవల ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ టైటిల్‌ను నాలుగోసారి ముద్దాడింది. ఈ టోర్నీలో విజేతగా నిలవడం కంటే కూడా.. టైటిల్‌ దిశగా మన జట్టు ప్రదర్శన మరింత సంతృప్తినిచ్చేదే. ఆతిథ్య భారత్‌ సహా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ దక్షిణ కొరియా, జపాన్, పాకిస్థాన్, మలేసియా, చైనా పోటీపడ్డ టోర్నీలో మన జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 4-0తో చిత్తు చేయడంతో పాటు లీగ్‌ దశను అజేయంగా ముగించింది. ఫైనల్లో ఓ దశలో 1-3తో వెనుకబడ్డప్పటికీ.. బలంగా పుంజుకుని, అద్భుతమైన పోరాట పటిమతో 4-3తో మలేసియాను మట్టికరిపించి.. అత్యధికంగా నాలుగు టైటిళ్లతో ఆసియాలో భారత్‌కు తిరుగులేదని మన ఆటగాళ్లు చాటారు. 

మళ్లీ ఆ రోజులు చూస్తామా?

భారత హాకీ అంటే.. ఒకప్పటి స్వర్ణయుగం గుర్తుకువస్తుంది. ఒకటి కాదు రెండు కాదు ఒలింపిక్స్‌లో ఏకంగా 8 స్వర్ణాలు. ప్రపంచ హాకీని భారత్‌ ఏలిన కాలమది. 8 స్వర్ణాలతో పాటు ఓ రజతం, రెండు కాంస్యాలు అప్పుడు దక్కాయి. కానీ 1980 ఒలింపిక్స్‌లో స్వర్ణం తర్వాత మన హాకీ పతనం దిశగా సాగింది. ఆటలో ప్రమాణాలు పడిపోయి.. ప్రదర్శన దిగజారి.. ఒకానొక దశలో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేని స్థాయికి చేరింది. హాకీ పాలనలో రాజకీయాలు, ఆటగాళ్లకు ప్రోత్సాహం కొరవడడం దెబ్బతీసింది. మళ్లీ హాకీ కోలుకోవడం కష్టమేననిపించింది. కానీ టోక్యో ఒలింపిక్స్‌ (2021)లో కాంస్యంతో ఆశలు చిగురించాయి. ఈ పోటీల్లో అద్భుత ప్రదర్శనతో భారత పురుషుల జట్టు కంచు పతకం గెలిచి.. 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. అమ్మాయిల జట్టు కూడా స్ఫూర్తిదాయక ప్రదర్శనతో నాలుగో స్థానంలో నిలిచింది. అక్కడి నుంచి హాకీలో ప్రదర్శన క్రమంగా మెరుగవుతోంది. మధ్యలో ఒకటి రెండు టోర్నీల్లో ప్రదర్శన మినహాయిస్తే మన జట్టు నిలకడగా రాణిస్తోంది. ఇదే జోరు కొనసాగిస్తే మళ్లీ పాత రోజులను చూసే అవకాశముంది. 

సరైన దారిలోనే.. 

ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీలో విజేతగా నిలవడంతో భారత్‌ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి చేరుకుంది. సొంతగడ్డపై 2023 ప్రపంచకప్‌లో నిరాశపర్చినప్పటికీ.. పడిన తర్వాత బలంగా లేవడం అలవాటు చేసుకున్న జట్టు మళ్లీ లయ అందుకుంది. కోచ్‌ క్రెయిగ్‌ ఫుల్టన్‌ జట్టుకు దూకుడు నేర్పారు. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ ప్రపంచంలోనే అత్యుత్తమ డ్రాగ్‌ఫ్లికర్‌లో ఒకరు. ఆకాశ్‌దీప్‌ సింగ్, మన్‌ప్రీత్‌ సింగ్, మన్‌దీప్‌ సింగ్, గుర్జంత్‌ సింగ్, జర్మన్‌ప్రీత్‌ సింగ్‌.. ఇలా ప్రతిభావంతులైన ఆటగాళ్లతో నిండి ఉన్న జట్టు మానసికంగానూ దృఢంగా ఉంది. అవకాశం కోసం వేచి చూడకుండా.. గోల్స్‌ అవకాశాలు సృష్టించుకుంటోంది. దేశంలో హాకీలో ప్రతిభకు కొదవలేదు. కానీ వీళ్లను సరైన దారిలో నడిపిస్తూ.. మార్గనిర్దేశనం చేసేవాళ్లు కావాలి. ఇప్పుడు హాకీ ఇండియా అధ్యక్షుడిగా మాజీ ఆటగాడు దిలీప్‌ టిర్కీ అదే పని చేస్తున్నారు. అండర్‌-17 జట్లను ఏర్పాటు చేసి యువతను ప్రోత్సహిస్తామని ఆయన ప్రకటించారు. మళ్లీ హాకీ ఇండియా లీగ్‌ను ప్రారంభిస్తామన్నారు. ఇక ఆట పరంగా చూసుకుంటే ముందుగా వచ్చే నెలలో చైనాలో ఆరంభమయ్యే ఆసియా క్రీడలు భారత్‌కు సవాలు విసరనున్నాయి. ఇందులో స్వర్ణం నెగ్గి వచ్చే ఏడాది జరిగే పారిస్‌ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించడమే ఇప్పుడు జట్టు లక్ష్యం. ఆ తర్వాత ఒలింపిక్స్‌లోనూ పతకం రంగు మారిస్తే అంతకుమించి ఆనందం ఇంకేముంటుంది! 

- ఈనాడు క్రీడా విభాగం  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని