Hockey: వందన 300 నాటౌట్‌.. కష్టాలను దాటుకొని స్టార్‌గా ఎదిగి

క్రికెట్‌ అయినా ఏ ఆట అయినా 300 మ్యాచ్‌లు ఆడటమంటే మామూలు విషయం కాదు! అదే అంతర్జాతీయ మ్యాచ్‌లు అంటే మరింత గొప్ప విషయం. అలాంటిది హాకీలో 300 మ్యాచ్‌లు ఆడడం.. అందులోనూ మహిళల హాకీలో కావడం నిజంగా చిత్రమే. ఈ ఘనతను సాధించిన అమ్మాయి భారత ప్లేయర్‌ కావడమే ఇక్కడ విశేషం. ఆమే వందన కటారియా (Vandana Katariya).

Published : 13 Nov 2023 18:31 IST

క్రికెట్‌ అయినా ఏ ఆట అయినా 300 మ్యాచ్‌లు ఆడటమంటే మామూలు విషయం కాదు! అదే అంతర్జాతీయ మ్యాచ్‌లు అంటే మరింత గొప్ప విషయం. అలాంటిది హాకీలో 300 మ్యాచ్‌లు ఆడడం.. అందులోనూ మహిళల హాకీలో కావడం నిజంగా చిత్రమే. ఈ ఘనతను సాధించిన అమ్మాయి భారత ప్లేయర్‌ కావడమే ఇక్కడ విశేషం. ఆమే వందన కటారియా (Vandana Katariya). ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీలో జపాన్‌తో మ్యాచ్‌ ఆడడం ద్వారా వందన భారత్‌ తరఫున అత్యధిక మ్యాచ్‌ల రికార్డు సృష్టించింది. 

అలా వచ్చి స్టార్‌గా మారి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని రోహన్‌బాద్‌కు చెందిన వందన హాకీ స్టిక్‌ పట్టే సమయానికి ప్రస్తుత జట్టులో చాలామంది పుట్టనే లేదు. ఆమె ఒక స్టార్‌గా ఎదిగే సమయానికి జట్టులో కొందరు హాకీ ఆటలోకే రాలేదు. భారత్‌లో మహిళల హాకీ పరాజయాల బాటలో ఉన్నప్పుడు జట్టులోకొచ్చి స్థిరంగా రాణిస్తూ యువ క్రీడాకారిణులకు స్ఫూర్తిగా నిలిచింది వందన. 2011లో భారత సీనియర్‌ జట్టులోకి వచ్చిన వందన.. స్థిరంగా రాణిస్తూ స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

పేద కుటుంబంలో పుట్టిన వందన చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడింది. అయితే హాకీ ఆమెను ఆకర్షించింది. తండ్రి నహర్‌ సింగ్‌ ఆమెకు ఎంతో మద్దతుగా నిలిచాడు. రెజ్లర్‌ అయిన అతడు కుమార్తెను క్రీడాకారిణిని చేయాలనుకున్నాడు. డబ్బులు లేకపోయినా అప్పులు తెచ్చి మరీ హాకీ క్రీడాకారిణిగా ఎదిగేందుకు కృషి చేశాడు. కానీ ఆమెకు సరైన క్రీడా పరికరాలు అందుబాటులో ఉండేవి కావు. కోచ్‌ ప్రదీప్‌ చినోయిటీ అండగా నిలవడంతో హాకీలో వందన ఎదిగింది. జాతీయ జట్టులో చోటు దక్కించుకుంది.

2005లో జూనియర్‌ భారత జట్టుకు ఎంపికైన వందన.. ఆరంభంలోనే తన ముద్ర వేసింది. స్థిరంగా రాణించడంతో 2011లో సీనియర్‌ జట్టులోకి వచ్చింది. సీనియర్‌ జట్టులో కొనసాగుతూనే 2013లో జర్మనీలో జరిగిన జూనియర్‌ ప్రపంచకప్‌లో ఆడిన వందన.. భారత్‌ చరిత్రాత్మక కాంస్యం గెలవడంలో కీలకపాత్ర పోషించింది. ఈ టోర్నీలో అయిదు గోల్స్‌తో భారత్‌ తరఫున టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. వేగం, నైపుణ్యం, సామర్థ్యం కలబోసి అదరగొట్టిన వందన ప్రధాన క్రీడాకారిణిగా ఎదిగింది. 2016లో సీనియర్‌ విభాగంలో ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి కప్‌ సాధించిపెట్టింది.

వందన అంటే భరోసా

జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే స్ట్రెకర్‌గా పేరు తెచ్చుకున్న వందన.. ఎన్నో మ్యాచ్‌ల్లో భారత్‌ను గెలిపించింది. ఏ కెప్టెన్‌ అయినా అవసరమైన సమయంలో తనవైపు చూసే భరోసాను కల్పించింది. సుదీర్ఘ కెరీర్‌లో వరుస ఓటములతో భారత్‌ కుంగిపోయిన దశను చూసింది.. ఒక్కో ర్యాంకూ మెరుగుపడుతూ ముందుకెళుతున్న దశనూ చూస్తోంది. అయితే టోక్యో ఒలింపిక్స్‌కు ముందు ఆమె జీవితంలో పెద్ద షాక్‌ తగిలింది. తన కెరీర్‌కు అన్నీ తానై నిలిచిన తండ్రి సహర్‌ సింగ్‌ కన్నుమూశాడు. కానీ దేశానికి ఆడాలన్న తండ్రి  ఆశను తీర్చడానికి ఒలింపిక్స్‌ బరిలో నిలిచిన వందన భారత్‌ జట్టు చరిత్రాత్మక ప్రదర్శనలో కీలకపాత్ర పోషించింది. భారత్‌ నాలుగో స్థానంలో నిలవడం వందనను ఎంతో సంతోషంలో నిలిపింది. తాజాగా ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీలో జపాన్‌పై కెరీర్‌లో 300వ మ్యాచ్‌ ఆడి అరుదైన మైలురాయి దాటింది. ఇప్పటిదాకా 153 అంతర్జాతీయ గోల్స్‌ చేసిన వందనకు వచ్చే ఒలింపిక్స్‌లో భారత్‌ పతకం గెలవాలన్నది కల.

- ఈనాడు క్రీడా విభాగం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు