Adam Zampa: ఇక్కడే పడ్డాడు... ఇక్కడే లేచాడు.. అదీ జంపా మ్యాజిక్‌

Adam Zampa Shines Again: అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో పేసర్ల హవా నడుస్తోంది. అయితే మధ్యలో ఒక పేరు డిఫరెంట్‌గా కనిపిస్తోంది. అతనే ఆడమ్‌ జంపా. అయితే ఆ స్థానం అతనికి అంత ఈజీగా రాలేదు. 

Updated : 07 Nov 2023 13:32 IST

ప్రపంచకప్‌లో అతడాడిన తొలి మూడు మ్యాచ్‌లు కలిపి తీసిన వికెట్లు రెండే! పైగా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. మిగిలిన స్పిన్నర్లు అదరగొడుతుంటే అతడు మాత్రం దారుణంగా తేలిపోయాడు. లైన్‌ అండ్‌ లెంగ్త్‌ దొరక్క, అనుకున్న చోట బంతిని వేయలేక బాగా ఇబ్బంది పడ్డాడు. కానీ అనూహ్యంగా అతడి బౌలింగ్‌లో మార్పు వచ్చింది. బంతిపై పట్టు చిక్కింది. వికెట్ల వేట మొదలైంది. ఇంకేముంది ఆ తర్వాతి 5 మ్యాచ్‌ల్లో ఏకంగా 17 వికెట్లు అతడి సొంతమయ్యాయి. అంతేకాదు ప్రపంచకప్‌లో పిచ్‌ పరిస్థితులు మారి పేస్‌ బౌలర్లు అదరగొడుతుంటే ఈ స్పిన్నర్‌ వారితో పోటీపడుతూ అగ్రస్థానంలో నిలిచాడు. అతడే ఆస్ట్రేలియా లెగ్గీ ఆడమ్‌ జంపా.

బౌలింగ్‌ మార్చుకుని

తొలి మూడు మ్యాచ్‌ల్లో ఘోరంగా విఫలమయ్యాక జంపాకు కష్టమే అనుకున్నారు. ఎందుకంటే స్పిన్‌కు అనుకూలించే భారత పిచ్‌లపై మిగిలిన జట్ల స్పిన్నర్లు చక్కగా రాణిస్తుంటే అతడు తేలిపోయాడు. దీనికితోడు ఆసీస్‌ జట్టులో ఉన్న ఏకైక ఫ్రంట్‌లైన్‌ స్పిన్నర్‌ జంపా ఒక్కడే. లబుషేన్, మ్యాక్స్‌వెల్‌ పార్ట్‌టైమర్లు. ఇలాంటి పరిస్థితుల్లో జంపా విఫలం కావడం కంగారూలను బాధించింది. అయితే జంపా వేగంగా తప్పులు దిద్దుకున్నాడు. రనప్‌లో మార్పు చేసుకుని బంతిని మరింత వైవిధ్యంగా వేయడానికి ప్రయత్నించాడు. తాను ఎప్పుడూ వేసే తీరులో కాకుండా నేరుగా, వేగంగా, కాస్త తక్కువ ఎత్తులో బంతులు విసిరే ప్రయత్నం చేశాడు. 

ఈ మార్పే జంపాకు కలిసొచ్చింది. ఏదో మీడియం పేసర్‌ మాదిరిగా రనప్‌తో కుదురైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో జంపా విసురుతున్న డెలివరీలను ఎదుర్కోవడం బ్యాటర్లకు తలకు మించిన భారమవుతోంది. గూగ్లీలతో పాటు ఎక్కువగా స్పిన్‌ చేయకుండా నేరుగా వేసే బంతులతో అతడు వికెట్లు సాధిస్తున్నాడు. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో అయితే అతడు వేసిన 10 ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా రాలేదంటే జంపా బౌలింగ్‌ ఎంత కట్టుదిట్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

నాలుగు వికెట్లు మూడుసార్లు

ఈ టోర్నీలో నాలుగు వికెట్లు మూడుసార్లు తీసిన ఏకైక బౌలర్‌ జంపానే. శ్రీలంక, పాకిస్థాన్, నెదర్లాండ్స్‌పై వరుసగా నాలుగు వికెట్ల ప్రదర్శనలు చేసి సత్తా చాటిన జంపా.. ఆ తర్వాత న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌పై మూడు వికెట్లు చొప్పున తీసి అబ్బురపరిచాడు. మొత్తం మీద 7 మ్యాచ్‌ల్లో 19 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడీ లెగ్‌స్పిన్నర్‌. టోర్నీ గడుస్తున్న కొద్దీ పేసర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తున్న నేపథ్యంలో జంపా ప్రదర్శన ఆసక్తిని రేపుతోంది. ఆస్ట్రేలియా సెమీఫైనల్‌ ఆశలు మరింత మెరుగవ్వాలంటే జంపా తన ఫామ్‌ను కొనసాగించడం కీలకం. నిజానికి మంచు ప్రభావం ఎక్కువగా ఉండే రాత్రి వేళల్లో బంతిపై పట్టు సాధించి నియంత్రణతో బౌలింగ్‌ చేయడం లెగ్‌స్నిన్నర్లకు కష్టం. 

బంతి ఏమాత్రం చేజారినా తేలేది స్టాండ్స్‌లోనే. అయితే ఈ విషయంలో జంపా గొప్ప నియంత్రణతో బౌలింగ్‌ చేస్తున్నాడు. బౌలింగ్‌లోనే కాదు బ్యాటింగ్‌లోనూ ఈ కుర్రాడు ఓ చేయి వేస్తున్నాడు. ఇంగ్లాండ్‌తో పోరులో 19 బంతుల్లో 29 పరుగులు చేసిన ఈ లెగ్గీ.. ఆసీస్‌ మంచి స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌లోనూ అదరగొట్టాడు. విల్లీని ఔట్‌ చేసే క్రమంలో 25 మీటర్ల దూరం పరుగెత్తి పట్టిన క్యాచ్‌ హైలైట్‌. శ్రీలంకతో మ్యాచ్‌లో అయితే వెన్నునొప్పి వేధిస్తున్నా గొప్పగా బౌలింగ్‌ చేసి 4 వికెట్లు పడగొట్టి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా నాకౌట్‌ చేరాలంటే జంపా ఇదే జోరు కొనసాగించడం కీలకం.

- ఈనాడు క్రీడా విభాగం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు