MS Dhoni : ధోనీ లెజెండ్‌గా ఎలా మారాడంటే..? ఆసక్తికర ఘటనను పంచుకున్న మాజీ క్రికెటర్‌

41 ఎళ్ల వయసులో కూడా తనదైన వ్యూహాలతో విజయాలు సాధిస్తూ ధోనీ(MS Dhoni) ముందుకు సాగుతున్నాడు. ఎంతో మంది యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.

Updated : 20 Jun 2023 16:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఎంఎస్‌ ధోనీ(MS Dhoni).. క్రికెట్‌లో ఈ పేరే ఓ సంచలనం. టీమ్‌ఇండియా(Team Inidia)కు రెండోసారి వన్డే ప్రపంచకప్‌ అందించినా.. ఐపీఎల్‌(IPL)లో తన జట్టును ఐదోసారి విజేతగా నిలబెట్టినా.. ఆ క్రెడిటంతా మహేంద్రుడికే దక్కుతుంది. ఇలా తనదైన వ్యూహాలతో ముందుకు సాగుతూ.. ఎంతో మంది యువ ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తాడు ఈ దిగ్గజం. అతడి గొప్పతనం గురించి తెలిపే ఎన్నో ఘటనలు ఉన్నాయి. వాటిలో ఓ ఆసక్తికరమైన విషయాన్ని మాజీ ఆటగాడు ఆకాశ్‌ చోప్రా(Aakash Chopra) పంచుకున్నాడు. తన ఆలోచనా విధానంతో ధోనీ ఓ లెజెండ్‌గా ఎలా మారాడో వివరించాడు.

‘‘2004లో టీమ్‌ఇండియా జింబాబ్వే, కెన్యా పర్యటనలో ఉంది. ఆ సమయంలో ధోనీ కంటే దినేశ్‌ కార్తిక్‌కు జట్టులో ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. మహీ రిజర్వ్‌ కీపర్‌గా ఉండగా.. డీకే తుది జట్టులో ఉన్నాడు. ఓ సమయంలో నెట్స్‌లో డీకేకు ధోనీ బౌలింగ్‌ చేయడం చూశా. వెంటనే ధోనీ వద్దకు వెళ్లి ‘ఎందుకు అతడికి బౌలింగ్‌ చేస్తున్నావు..? అతడు నీకు పోటీ కదా. అతడు బాగా ఆడితే.. నీకు అవకాశాలు రావు కదా. నువ్వు బ్యాటింగ్‌ లేదా కీపింగ్‌ ప్రాక్టీస్‌ చేయాలి. ఎందుకు బౌలింగ్‌ చేస్తున్నావు?’ అని ప్రశ్నించాను. వెంటనే దానికి ధోనీ..‘నన్ను ఆపొద్దు. నేను బౌలింగ్‌ చేయాలి. నువ్వు బ్యాటింగ్‌ చేస్తానంటే.. నీకూ బౌలింగ్‌ చేస్తా’ అని బదులిచ్చాడు’’ అని చోప్రా ట్విటర్‌ వీడియోలో ఆనాటి ఘటనను గుర్తు చేసుకున్నాడు.

‘ఆ తర్వాత ధోనీ ఆలోచనా విధానం.. ఇన్ని సంవత్సరాలుగా అతడిని ఓ విజయవంతమైన క్రికెటర్‌గా ఎలా మార్చిందో నాకర్థమైంది. అతడు ప్రపంచంలోనే గొప్ప క్రికెటర్‌గా ఎలా మారాడో తెలిసింది’ అని చోప్రా అన్నాడు. ‘‘అప్పుడు ధోనీ చెప్పిన సమాధానంలోని అర్థం నాకు తెలిసింది. కావాలనుకున్నదాన్ని అతడు ఎలా సాధించగలిగాడో నాకర్థమైంది. ధోనీ.. దినేశ్‌ కార్తిక్‌ను కానీ.. మరే ఇతర ఆటగాడిని కానీ పోటీగా అనుకోలేదు. అతడితోనే అతడు పోటీపడ్డాడు. అందుకే అంటుంటారు.. నీకు నువ్వే పోటీ.. ఎప్పుడూ బెస్ట్‌ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండాలి అని’’ అంటూ ఆనాటి ఘటనను వివరించాడు. 

‘ధోనీ.. తన గేమ్‌లో మాస్టర్‌.  తన గొప్పతనాన్ని తిరిగి ఆవిష్కరించుకుంటూనే ఉంటాడు. అతడికి ఎవరైనా పోటీ ఉన్నారంటే.. అది  అతడు మాత్రమే’ అంటూ మహేంద్రుడి గురించి ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు.

ఇక ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో తిరిగి చెన్నై జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు ధోనీ. ఐదోసారి ధోనీ సేన విజేతగా గెలిచి.. అత్యధిక సార్లు టైటిళ్లు గెలిచిన ముంబయి రికార్డును సమం చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని