Ravindra Jadeja: అమ్మో.. అతణ్ని ఆడలేం.. డాట్ బాల్స్, వికెట్లతో రెచ్చిపోతున్న జడేజా

వన్డే ప్రపంచకప్‌లో జడ్డూ ఊపు మామూలుగా లేదు. డాట్ బాల్స్‌తో ప్రతర్థి జట్టు ఆటగాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తూ నిలకడగా వికెట్లు తీస్తున్నాడు. మరోవైపు లోయర్ మిడిలార్డర్లో హార్దిక్ లేని లోటు తెలియకుండా కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Published : 06 Nov 2023 13:06 IST

వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023)లో భారత బౌలర్లు ఎంత గొప్ప ప్రదర్శన చేస్తున్నారో తెలిసిందే. బ్యాటింగ్‌లో భారత్ ఎప్పుడూ బలమైన జట్టే కానీ.. బౌలింగ్‌లో మన జట్టుది కొంచెం వెనుకంజే. కానీ ఈ ప్రపంచకప్‌లో మాత్రం మన బౌలర్లు మామూలుగా రెచ్చిపోవట్లేదు. దూకుడుగా ఆడుతూ అలవోకగా 350 ప్లస్ స్కోర్లు చేస్తున్న దక్షిణాఫ్రికా సైతం భారత్ ముందు నిలవలేకపోయింది. కేవలం 83 పరుగులకే కుప్పకూలి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. స్పిన్నర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అయిదు వికెట్ల ప్రదర్శనతో ఆ జట్టు పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌ అనే కాదు.. టోర్నీలో జడ్డూ ఊపు మామూలుగా లేదు. డాట్ బాల్స్‌తో ఉక్కిరిబిక్కిరి చేస్తూ నిలకడగా వికెట్లు తీస్తూ ప్రత్యర్థులకు చెక్ పెడుతున్నాడతను.

8 మ్యాచ్‌లు.. 14 వికెట్లు.. 17.35 సగటు.. 3.76 ఎకానమీ.. ఈ గణాంకాలు చూస్తేనే జడేజా ఈ ప్రపంచకప్‌లో ఎంత గొప్ప ప్రదర్శన చేస్తున్నాడో అర్థమవుతుంది. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో అతడిది ఏడో స్థానం. అగ్రస్థానంలో ఉన్న ఆడమ్ జంపాకు అతడికి అంతరం నాలుగు వికెట్లే. అయితే తనకంటే ముందున్న ఆరుగురు బౌలర్లలో అయిదుగురి కంటే ఉత్తమ ఎకానమీ నమోదు చేశాడు జడ్డూ. టోర్నీలో ఒక్క బుమ్రా (3.65) మాత్రమే జడ్డూ కన్నా పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఈ ప్రపంచకప్‌లో 4 లోపు ఎకానమీతో సాగుతున్న బౌలర్లు ఈ ఇద్దరు మాత్రమే. బ్యాటర్ల ఆధిపత్యం సాగే పరిమిత ఓవర్ల క్రికెట్లో ఎనిమిది మ్యాచ్‌లు ఆడి 3.76 ఎకానమీ నమోదు చేయడం అంటే చిన్న విషయం కాదు.

డాట్‌బల్స్‌తో బిగిస్తున్నాడు

భారత్‌తో ఆడే ప్రతి జట్టూ మధ్య ఓవర్లలో స్పిన్నర్ల ధాటికి ఉక్కిరి బిక్కిరి అయిపోతోంది. ముఖ్యంగా జడేజాను ఎదుర్కొని పరుగులు చేయడం ప్రత్యర్థి బ్యాటర్లకు శక్తికి మించిన పనే అవుతోంది. అతడి బౌలింగ్‌లో డిఫెన్స్ ఆడటానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. స్పిన్నర్ అయినప్పటికీ జడేజా బంతుల్లో వేగం ఎక్కువ. షాట్ ఆడాలని చూసి కొంచెం గతి తప్పినా ఎల్బీ అయిపోతారు. అందుకే జాగ్రత్తగా ఆడుకుని ఓవర్ ముగించడానికి చూస్తున్నారు. దీంతో జడేజా ఓవర్లలో డాట్ బాల్స్ బాగా ఎక్కువగా ఉంటున్నాయి. 8 మ్యాచ్‌ల్లో జడేజా మొత్తంగా 387 బంతులు వేస్తే.. అందులో పరుగే రాని బంతులు 242 కావడం విశేషం. అంటే అతడి బంతుల్లో దాదాపుగా మూడింట రెండొంతులు డాట్ బాల్సే అన్నమాట. దీన్ని బట్టే అతడి బౌలింగ్ ఆడటానికి ప్రత్యర్థి బ్యాటర్లు ఎంత కష్టపడుతున్నారో.. అతను ఎంతగా ఒత్తిడి పెంచుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌లోనే 10 ఓవర్లలో 28 పరుగులే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. ఆ మ్యాచ్‌లో అతను 38 డాట్ బాల్స్ వేయడం విశేషం. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల పైనా పొదుపుగా బౌలింగ్ చేసి రెండేసి వికెట్లు పడగొట్టిన జడ్డూ.. తాజాగా దక్షిణాఫ్రికాను ఈడెన్‌ గార్డెన్స్‌లో ఒక ఆట ఆడుకున్నాడు. అయిదు వికెట్లతో ఆ జట్టు నడ్డి విరిచాడు.

బ్యాటింగ్‌లోనూ..

ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్యను టీమ్‌ఇండియాకు ఎంతో కీలకమైన ఆటగాడిగా విశ్లేషకులు అంచనా వేశారు. టోర్నీ ఆరంభ దశలో హార్దిక్ అందుకు తగ్గట్లే చక్కగా రాణించాడు. బ్యాటింగ్‌లో అతడికి పెద్దగా అవకాశాలు రాలేదు కానీ.. బౌలింగ్‌లో నిలకడగా రాణించాడు. అయితే బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో గాయపడి అర్ధంతరంగా అతను జట్టుకు దూరం కాగా.. ఆ లోటు కనబడనివ్వకుండా చూడటంలో జడేజాది కీలక పాత్ర. బౌలింగ్‌లో నిలకడగా రాణిస్తూనే.. లోయర్ మిడిలార్డర్లో బ్యాటింగ్‌లోనూ సత్తా చాటుతున్నాడు. స్లాగ్ ఓవర్లలో హార్దిక్ పాత్రను అతను విజయవంతంగా భర్తీ చేస్తున్నాడు. న్యూజిలాండ్‌తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో 39 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత లంకపై 35 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లోనూ 15 బంతుల్లోనే 29 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖర్లో షాట్లు ఆడలేక కోహ్లి కూడా ఇబ్బంది పడుతుంటే.. తనే స్ట్రైక్ తీసుకుని మెరుపు షాట్లు ఆడాడు. ఫినిషర్ పాత్రలో జడేజా రాణిస్తుండటంతో మిడిలార్డర్‌లో హార్దిక్ లేని లోటు కనిపించడం లేదు.

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని