CSK - MS Dhoni: ధోనీ నిర్ణయంతో మా కళ్లల్లో నీళ్లు తిరిగాయి: సీఎస్కే కోచ్‌

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - చెన్నై సూపర్ కింగ్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్‌ 17వ సీజన్‌ ప్రారంభం కానుంది.

Updated : 22 Mar 2024 15:52 IST

ఇంటర్నెట్ డెస్క్‌: తొలి సీజన్‌ నుంచి జట్టును నడిపించిన నాయకుడు ఒక్కసారిగా వైదొలిగితే ఎలాంటి బాధ ఉంటుందో.. చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టు సభ్యులకు, అభిమానులకు తెలుసు. ‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఐదు సార్లు జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. ఇప్పుడు రుతురాజ్‌ గైక్వాడ్‌ను (Ruturaj Gaikwad) సారథిగా నియమిస్తూ ఆ జట్టు కీలక ప్రకటన చేసింది. ఇలాంటి నిర్ణయం తీసుకునే సమయంలో డ్రెస్సింగ్‌ రూమ్‌ అంతా నిశ్శబ్దంతో నిండిపోయిందని సీఎస్కే (CSK) ప్రధాన కోచ్ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ వ్యాఖ్యానించాడు.

‘‘ధోనీ తన నిర్ణయం వెల్లడించినప్పుడు డ్రెస్సింగ్‌ రూమ్‌ భావోద్వేగాలతో నిండిపోయింది.  ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. రెండేళ్ల కిందట కెప్టెన్సీ మార్పు చేశాం. అప్పుడు మేం సిద్ధంగా లేకపోవడంతో మళ్లీ ధోనీనే బాధ్యతలు చేపట్టాడు. ఇప్పుడు రుతురాజ్‌కు కెప్టెన్సీ అప్పగించాం. అందరూ అతడికి శుభాకాంక్షలు చెప్పారు. అతడు అద్భుతమైన ఆటగాడు. జట్టును సరైన దిశలో నడిపించే సత్తా అతడికి ఉంది’’ అని ఫ్లెమింగ్‌ తెలిపాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లోనూ ధోనీ వైదొలిగి రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాడు. కానీ, జట్టు వరుసగా ఓటములను చవిచూడటంతో మధ్యలోనే ధోనీ తిరిగి సారథ్య బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. గతేడాది పూర్తిస్థాయిలో కెప్టెన్‌గా ఉండి సీఎస్కేను ఛాంపియన్‌గా నిలిపిన సంగతి తెలిసిందే. 

అప్పుడే రుతురాజ్‌కు ఈజీ: జాఫర్

‘‘రుతురాజ్‌ ఎలాంటి ఇబ్బంది లేకుండా సారథ్యం నిర్వర్తించాలంటే.. ధోనీ టోర్నీలో ఆడకూడదు. ఎంఎస్‌డీ జట్టులో ఉంటే అతడిపై కచ్చితంగా ఒత్తిడి పడుతుంది. మైదానంలో ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ధోనీని దృష్టిలో పెట్టుకుని ఆలోచించాల్సి ఉంటుంది. మహీ మైదానంలో లేకపోతే రుతురాజ్‌కు నిర్ణయాలు తీసుకోవడం తేలికవుతుంది’’ అని భారత మాజీ క్రికెటర్ వసీమ్‌ జాఫర్ వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు