Rohit Sharma: రోహిత్‌ కెప్టెన్సీని అలా ఎలా వదులుకుంది MI?

ఐపీఎల్‌లో (IPL) సంచలన నిర్ణయంతో ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians) సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటోంది. రోహిత్ శర్మను (Rohit Sharma) కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్‌ పాండ్యకు అప్పగించింది.

Published : 16 Dec 2023 18:49 IST

టీ20 ఫార్మాట్‌కు కావాల్సింది దూకుడైన ఆట. ఆ కోణంలో చూస్తే రోహిత్‌శర్మ బాదుడుకు సాటి ఏముంది? బౌలర్లపై కనికరం లేకుండా విరుచుకుపడే రోహిత్‌కు క్రికెట్‌ ప్రపంచం ‘హిట్‌మ్యాన్‌’ అని పేరు పెట్టేసింది. ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రోహిత్‌శర్మ (Rohit Sharma) రికార్డును ఇప్పట్లో ఎవరూ దాటలేరు. వ్యక్తిగత రికార్డులను ఖాతరు చేయడు. 99 పరుగుల దగ్గర కూడా లాఫ్టెడ్ షాట్స్ (గాల్లోకి లేపి మరీ) ఆడే తెగింపు తనది. డజన్ల సెంచరీలు, హాఫ్‌ సెంచరీలు మిస్ అయినా జట్టుకు వేగంగా పరుగులు అందించి.. తర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి తగ్గించడమే అతడి ధ్యేయం. తన సమర్థ నాయకత్వంతో ఐపీఎల్‌లో (IPL) ముంబయి ఇండియన్స్‌ను (Mumbai Indians) ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపాడు. ముంబై ఇండియన్స్ (MI) అత్యధిక బ్రాండ్‌ ఇమేజ్ ఉన్న జట్టుగా నిలిపాడు. 

రోహిత్‌ బ్రాండ్ ఇమేజ్

ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ ఒక ఐపీఎల్ టీమ్‌కు కెప్టెన్‌గా ఉన్నాడంటే కచ్చితంగా అది ఆ జట్టు బ్రాండ్ ఇమేజ్‌ ఎంతో పెంచుతుంది. మూడున్నరేళ్ల క్రితం రిటైర్‌ అయిన ధోని (MS DHoni) ఇంకా ఐపీఎల్‌లో చెన్నై కెప్టెన్‌గా (CSK) కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన చాలామంది ప్లేయర్లు ఐపీఎల్ ఆడారు, ఆడుతున్నారు. ఇంకా ప్రపంచ క్రికెట్‌లో ఆడుతున్న రోహిత్‌ను (Rohit Sharma) ముంబై కెప్టెన్సీ నుంచి తప్పించి ఓ సాధారణ ఆటగాడిగా పరిగణించటం క్రికెట్ అభిమానులకు షాకింగ్ నిర్ణయం. మరో రెండు సీజన్లు రోహిత్‌ను కెప్టెన్‌గా ఆడిస్తే బాగుండేదని చాలా మంది భావన. ఈలోపు జట్టులో సీనియర్లు బుమ్రా, సూర్యకుమార్‌ను వారసులుగా తీర్చిదిద్దే అవకాశం కూడా ముంబయి జట్టుకు ఉంది. అవేం పరిశీలించకుండా హార్దిక్‌ పాండ్యాను గుజరాత్ జట్టు నుంచి తీసుకు వచ్చేసి.. ముంబయి జట్టులో చేర్చడం సరైంది కాదనే మెజార్టీ అభిప్రాయం. ఇప్పటిదాకా జట్టులో ఆటగాళ్లకు అండగా ఉండి, ముంబయి ఇండియన్స్‌లో కుటుంబ వాతావరణాన్ని తీసుకొని వచ్చిన వ్యక్తిని ఇలా తప్పించడం జట్టు సభ్యులకు కూడా రుచించలేదనే వార్తలూ వస్తున్నాయి. 

ముంబయి ఆటగాళ్ల మౌనం వెనుక?

హార్దిక్ పాండ్యాకు (Hardik Pandya) కెప్టెన్సీ బాధ్యతలపై జట్టులోని సభ్యులు పెద్దగా స్పందించలేదు. సూర్యకుమార్ మాత్రం రోహిత్‌ను తప్పించడంపై ‘హృదయం ముక్కలైంది’ అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు. కానీ, ఏ సందర్భాన్ని అనేది వెల్లడించకుండా పోస్టు చేయడంతో అభిమానులు పలురకాలుగా భావిస్తున్నారు. తాజా వన్డే ఇంటర్నేషనల్ వరల్డ్‌కప్‌లో ఆటగాడిగా, కెప్టెన్‌గా రోహిత్ దేశాన్ని ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians) తాజా నిర్ణయం కారణంగా ఆ జట్టు సోషల్‌ మీడియా ఖాతాల నుంచే కాకుండా.. ఫ్రాంచైజీకి లక్షలమంది అభిమానులు గుడ్‌బై చెబుతున్నారు. ఒకప్పుడు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ మధ్య వ్యక్తిగత విభేదాలు ఉన్నాయనే ప్రచారం అందరికీ తెలిసిందే.టీమ్‌ ఇండియా కెప్టెన్‌గా కోహ్లీ వైదొలగగానే బలవంతంగా రోహిత్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు గంగూలీ ఈ విషయాన్ని ఇటీవలే వెల్లడించాడు. రోహిత్‌ గురించి విరాట్ కోహ్లీ ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యలు ‘హిట్‌మ్యాన్‌’ ఫ్యాన్స్‌ సోషల్ మీడియాలో గుర్తు చేస్తున్నారు. 

ఇంతకీ కోహ్లీ ఏమన్నాడంటే...

‘‘టీ20 వరల్డ్‌కప్‌ జట్టులోకి రోహిత్‌శర్మ (Rohit Sharma) అనే యంగ్ ప్లేయర్‌ వస్తున్నాడు, అతను అంత గొప్ప, ఇంత గొప్ప అన్నట్టుగా అందరూ మాట్లాడుకుంటున్నారు. అరే! మనం కూడా యంగ్ ప్లేయరే కదా? ఎందుకు నా గురించి మాట్లాడుకోవట్లేదు అనుకున్నాను. కానీ టీ20 మ్యాచ్‌లో రోహిత్ బాదుడు చూస్తే మాటలు రాలేదు నాకు. ఆ తర్వాత ఇంకెప్పుడు రోహిత్‌శర్మ గురించి మరోలా ఆలోచించలేదు’’ ఈ మాటలు చెప్పింది స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli). ప్రత్యక్షంగా దగ్గరుండి అతడి ఆటను చూసిన సహచరుడి నుంచే ఇలాంటి వ్యాఖ్యలు రావడం రోహిత్‌ సత్తాకు నిదర్శనం. టీ20 జట్టులోకి రోహిత్ అరంగేట్రం సమయంలో జ్ఞాపకాలను కోహ్లీ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. అందులో అతిశయోక్తి లేదని తాజా వరల్డ్ కప్‌లోనూ నిరూపితమైంది. ఇలాంటి రోహిత్ శర్మను సడెన్‌గా కెప్టెన్సీ నుంచి తప్పించడం మాత్రం సరైంది కాదనేది అభిమానులతోపాటు మాజీల అభిప్రాయం.

- ఈటీవీ క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని