IPL 2024 Playoffs: ఐపీఎల్ ప్లేఆఫ్స్‌.. ఏ జట్టు ఎలా వచ్చిందంటే?

ఐపీఎల్ 17వ సీజన్‌లో లీగ్‌ స్టేజ్‌ను దాటి ప్లేఆఫ్స్‌ పోరు మొదలుకానుంది. అనూహ్య ఫలితాలతో నాకౌట్‌కు చేరి ఆశ్చర్చపరిచిన జట్లూ ఉన్నాయి.

Updated : 20 May 2024 15:44 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌కు వేళైంది. దాదాపు రెండునెలల సుదీర్ఘ ప్రయాణం తర్వాత నాలుగు జట్లు నాకౌట్‌ దశకు చేరుకున్నాయి. రెండు జట్లు అలవోకగా వచ్చినా.. మరో రెండు సంచలన ప్రదర్శనతో ఫైనల్‌ 4కి చేరాయి. ఎవరి ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం!


కోల్‌కతా ‘రైడర్స్‌’

టోర్నీ ప్రారంభానికి ముందు వరకు కోల్‌కతా టాప్‌ - 4లో స్థానం సంపాదిస్తుందని ఎవరికీ అంచనాల్లేవు. మెంటార్‌గా గౌతమ్‌ గంభీర్‌ బాధ్యతలు చేపట్టడంతో ‘కేకేఆర్‌ విశ్వరూపం ప్రదర్శిస్తుంది’ అనే చిన్న నమ్మకం తప్ప. సునీల్ నరైన్ బీస్ట్‌ బ్యాటింగ్‌.. ఫిల్‌ సాల్ట్‌ దూకుడు మంత్రం.. ఆండ్రి రస్సెల్ విధ్వంసం కలగలిపి కోల్‌కతా టాప్‌ ప్లేస్‌కి వచ్చేసింది. బౌలింగ్‌లో కుర్రాళ్లు హర్షిత్ రాణా, వైభవ్‌ అరోరా, వరుణ్‌ చక్రవర్తి అదరగొట్టారు. లీగ్‌ స్టేజ్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు 9 విజయాలు నమోదు చేసి 20 పాయింట్లు సాధించింది అంటే..  ఏ స్థాయి ఆధిపత్యం ప్రదర్శించారో అర్థం చేసుకోవచ్చు. రెండు మ్యాచులు వర్షం కారణంగా రద్దయ్యాయి.  లేదంటే టోర్నీ చరిత్రలో అత్యధిక రికార్డు పాయింట్లు (22) దాటిపోయేదే!


‘రైజింగ్‌’ హైదరాబాద్‌

గత మూడు సీజన్లలో లీగ్‌ స్టేజ్‌కే పరిమితమైన జట్టు.. ప్లేఆఫ్స్‌కు చేరుతుందని నమ్ముతారా? కానీ, ఆ అద్భుతాన్ని సాధించింది హైదరాబాద్‌. సంచలన ప్రదర్శనతో హేమాహేమీ జట్లను ఢీకొట్టి ఏకంగా రెండో స్థానం సాధించింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ శుభారంభం.. నితీశ్‌రెడ్డి ఆల్‌రౌండ్‌ ఇన్నింగ్స్‌, క్లాసెన్‌ మాస్‌ హిట్టింగ్‌, అబ్దుల్ ఫినిషింగ్‌తో సన్‌రైజర్స్‌ 14 మ్యాచుల్లో 8 విజయాలు సాధించింది. ఒక మ్యాచ్‌ రద్దుతో 17 పాయింట్లను ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్‌లోనే అత్యధిక స్కోరు (287) సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. ‘ప్యాట్‌ కమిన్స్‌కు రూ.20 కోట్లా?’ అని తొలుత తప్పుపట్టిన వాళ్లే.. ‘మా కమిన్స్‌’ అంటూ ఇప్పుడు తెగ పొగిడేస్తున్నారు. పేసర్లు భువనేశ్వర్‌, నటరాజన్‌ తో కలసి కమిన్స్‌ ప్రత్యర్థులను చాలా ఇబ్బందిపెట్టాడు. 


ఆరంభమంతా రాజస్థాన్‌దే..

తొలి 9 మ్యాచుల్లో ఎనిమిది విజయాలు.. ఇలాంటి టీమ్‌ అగ్రస్థానంతోనే లీగ్‌ స్టేజ్‌ను ముగిస్తుందని అనుకుంటాం. కానీ రాజస్థాన్‌ ఆ ఛాన్స్‌ను చేజేతులా వదిలేసుకుంది. వరుసగా మూడు, నాలుగు విజయాలు సాధించి ఢీలా పడిపోతుందనే పేరున్న ఆ జట్టు.. ఈసారి తొలి 9లో 8 విజయాలు సాధించేసరికి ప్లేఆఫ్స్‌ అవకాశమే కాదు.. అగ్ర స్థానమూ పక్కా అనుకున్నారు. కట్‌ చేస్తే.. ఆఖరి ఐదు మ్యాచుల్లో నాలుగింట్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్‌ రద్దైంది కాబట్టి సరిపోయింది. లేదంటే ఐదో ఓటమిని మూటగట్టుకునేదే. లీగ్‌ తొలి అర్ధభాగంలో చూపించిన ఆధిపత్యం.. తర్వాత తగ్గడానికి కారణం అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడమే. జైస్వాల్‌ నిలకడలేమి, పరాగ్‌ వేగంగా ఔటవ్వడం, యుజ్వేంద్ర చాహల్‌, ట్రెంట్ బౌల్ట్, అశ్విన్‌ లాంటి స్టార్‌ బౌలర్లు విఫలమవ్వడం దీనికి కారణం. 


రాయల్‌గా బెంగళూరు.. 

చివరి లీగ్‌ మ్యాచ్‌ వరకూ బెంగళూరు ప్లేఆఫ్స్‌కు చేరుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ కీలకమైన చెన్నై మ్యాచ్‌లో ఒత్తిడిని తట్టుకుంటూ జట్టు ఇచ్చిన ప్రదర్శన వారిని ప్లేఆఫ్స్‌కి తీసుకొచ్చింది. నిజానికి సీజన్‌ తొలి అర్ధ భాగంలో బెంగళూరు ప్రదర్శన అంతంతమాత్రమే. కోహ్లీ, ఫాఫ్‌, డీకే తప్ప మిగిలిన బ్యాటర్లు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నట్లుగా ఇలా వచ్చి అలా వెళ్లిపోయేవారు. బౌలర్ల సంగతి అయితే సరేసరి. కానీ లీగ్‌ సెకండాఫ్‌లో విల్ జాక్స్‌, రజత్‌ పాటిదార్‌  రాణించడం టీమ్‌ గతినే మార్చేసింది. వరుసగా ఆరు విజయాలతో ఫైనల్‌ 4కి వచ్చేశారు. ఇక బౌలింగ్‌ విభాగం కూడా మెరుగ్గా మారింది. తొలి అర్ధభాగంలో ఇలానే ఆడిఉంటే.. టాప్‌ 1 లేదా 2లో ఉండేవాళ్లు అని విశ్లేషకులు చెబుతున్నారు. 


ఎవరితో ఎప్పుడు?

  • మే 21: అహ్మదాబాద్‌ వేదికగా కోల్‌కతా X హైదరాబాద్‌ (క్వాలిఫయర్‌ -1)
  • మే 22: అహ్మదాబాద్‌ వేదికగా బెంగళూరు X రాజస్థాన్‌ (ఎలిమినేటర్)
  • మే 24: తొలి క్వాలిఫయర్‌లో ఓడిన జట్టు X ఎలిమినేటర్‌ విజేత
  • మే 26: క్వాలిఫయర్‌ - 1 విజేత  X క్వాలిఫయర్‌ - 2 విజేత మధ్య ఫైనల్‌ 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని