Vinesh Phogat: వివాదాలు దాటుకొని చరిత్ర సృష్టించిన వినేశ్‌ ఫొగాట్‌

పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చు. ఈ మాటలు మనం ఎన్నోసార్లు విన్నా.. అది ఆచరణలో పెట్టడం అంత తేలికకాదు. దాన్ని ఆచరణలో పెట్టాలే కానీ అద్భుతాలు సాధించొచ్చు...

Updated : 15 Aug 2022 14:39 IST

పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చు. ఈ మాటలు మనం ఎన్నోసార్లు విన్నా.. అది ఆచరణలో పెట్టడం అంత తేలికకాదు. దాన్ని ఆచరణలో పెట్టాలే కానీ అద్భుతాలు సాధించొచ్చు. అదే చేసింది భారత రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌. గతేడాది ఒలింపిక్స్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగి అనూహ్య పరిస్థితుల నడుమ ఓటమిపాలైంది. అయితే.. అంత తేలిగ్గా జీవితానికి తల వంచలేదు. పట్టుదలతో ముందుకు సాగింది. ఏడాది తిరగకుండానే కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించింది.

కామన్వెల్త్‌లో హ్యాట్రిక్‌ స్వర్ణాలు..

మనసు అత్యంత శక్తిమంతమైంది. ఓటమి అంచున ఉన్నవారిని గెలిపించగలదు. విజయం ముంగిట ఉన్నా ఓడించగలదు. ఏ ప్లేయర్‌ అయినా బరిలోకి దిగే ముందు ఎలా ఉన్నా.. ఆ సమయానికి ఎంత ప్రశాంతంగా ఉన్నామనే దానిపైనే విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈ మాటలు అక్షరసత్యం అని నిరూపించింది వినేశ్‌ ఫొగాట్‌. శనివారం నిర్వహించిన మహిళల 53 కేజీల ఫ్రీస్టైల్‌ ఈవెంట్‌లో నలుగురు మాత్రమే పోటీపడటంతో నోర్డిక్‌ విధానంలో ఈ మ్యాచ్‌లను కొనసాగించారు. దీంతో ఎక్కువ మ్యాచ్‌లు గెలిచినవాళ్లే విజేతగా నిలుస్తారు. అలా వినేశ్‌ ఈ పోటీల్లో వరుసగా మెర్సీ (నైజీరియా), సమంత (కెనడా)ను ఓడించి.. చివరి మ్యాచ్‌లో కేశాని (శ్రీలంక)పై గెలిచింది. ఆరంభం నుంచి ఎంతో ప్రశాంతంగా కనిపించిన వినేశ్‌ ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. దీంతో తుదిపోరులో 4-0 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లి ప్రత్యర్థిని కిందపడేసి, పైకి లేవకుండా అదిమిపట్టింది. దీంతో మొత్తం 13 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. వినేశ్‌ 2014, 2018 క్రీడల్లోనూ ఛాంపియన్‌గా నిలిచి స్వర్ణాలు సాధించింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా నిలిచింది.

ఒలింపిక్స్‌ అప్పుడు ఏం జరిగింది..

వినేశ్‌ గతేడాది ఒలింపిక్స్‌లో భారీ అంచనాల నడుమ బరిలోకిదిగింది. అయితే, పతకం తేకుండానే ఇంటిముఖం పట్టింది. ఆ సమయంలో ఆమె కుంగుబాటుకు గురైంది. 2017లో వినేశ్‌ తలకు బలమైన గాయమవడంతో కొన్ని సందర్భాల్లో తీవ్రమైన గందరగోళానికి గురయ్యేది. ఈ సమస్య ఉన్న వారు తీవ్రమైన ఒత్తిడికి లోనవడం, వాంతి వస్తున్నట్లు అనిపించడం, చూపు ఒక్కసారిగా తగ్గిపోవడం. వెలుతురు, చప్పుడుకు ఇబ్బంది పడటం వంటివి ఎదుర్కొంటారు. వీటిల్లోని కొన్ని సమస్యలను సైతం ఆమె ఒలింపిక్స్‌కు ముందు అనుభవించింది. కానీ, వాటిని పెద్దగా పట్టించుకోలేదు. గతేడాది ఒలింపిక్స్‌కు ముందు మెరుగైన శిక్షణ తీసుకుంది. కానీ, కీలకమైన బౌట్‌కు ముందు రోజు ఆహారం తీసుకోలేదు.. కేవలం పోషకాలు ఉన్న డ్రింక్‌ను మాత్రమే తాగింది. ఒలింపిక్స్‌లో పోటీపడే రోజు నిద్రలేస్తూనే కొంత ఇబ్బంది పడింది. అక్కడ తన ఫిజియోను సంప్రదించి తర్వాత వార్మప్‌ కూడా చేసింది. అయినా ఫలితం కనిపించలేదు. అలానే బరిలోకి దిగింది. తొలిబౌట్‌ తర్వాత మరింత కంగారు పడింది. అలానే రెండో బౌట్‌ను మొదలుపెట్టి ఓటమిపాలైంది.

అంతకుముందే రెండు సార్లు కొవిడ్‌ బారినపడి..

వినేశ్‌ రెండు సార్లు కొవిడ్‌ బారిన పడింది. 2020లో ఆమెకు తొలిసారి కొవిడ్‌ సోకింది. కోలుకొన్న తర్వాత ప్రొటీన్లు ఉన్న ఆహారం తీసుకోవడంలో ఆమెకు సమస్యలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే కజకస్థాన్‌లో ఆసియా ఛాంపియన్‌షిప్‌ పోటీల నుంచి వచ్చాక ఆమె మరోసారి కొవిడ్‌ బారిన పడింది. కొన్నాళ్లకు కుటుంబం మొత్తానికీ కొవిడ్‌ సోకింది. తర్వాత హంగేరియాలో శిక్షణ పొందింది. అక్కడి నుంచే నేరుగా టోక్యోకు చేరుకుంది. కొవిడ్ భయంతోనే ఆమె టోక్యోకు వెళ్లాక కూడా టీమ్‌ఇండియా బృందానికి దూరంగా ఉంది. ఆ భయాల నడుమే ఆమె ఒలింపిక్స్‌లో పోటీపడింది.

వివాదాల నుంచి బయటపడి..

వినేశ్‌ ఓటమి తర్వాత భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ తీవ్రంగా మండిపడ్డారు. హంగేరియన్‌ శిక్షకుడు వాలెర్‌ తమను మోసం చేశాడని ఆరోపించారు. వినేశ్‌కు శిక్షణ పేరుతో అతని భార్య మారియాన సస్టైన్‌కు శిక్షణ ఇచ్చాడని పేర్కొన్నారు. వినేశ్‌ అంకుల్‌, రెజ్లర్‌ అయిన మహావీర్‌ కూడా తప్పంతా కోచ్‌దేనని పేర్కొన్నారు. వచ్చే నాలుగేళ్లలో తానే స్వయంగా వినేశ్‌కు శిక్షణ ఇస్తానని పేర్కొన్నారు. వాస్తవానికి వాలెర్‌ భార్య మారియాన కూడా ఒలింపిక్స్‌లో పాల్గొని ఓటమిపాలైంది. ఇదిలా ఉండగా.. తర్వాత టోక్యో క్రీడల్లో భారత జట్టు మేనేజ్‌మెంట్‌ ఆదేశాలను పాటించలేదన్న కారణంతో వినేశ్‌ను సస్పెండ్‌ చేశారు. ఈ క్రమంలోనే వినేశ్‌ మరోసారి ఒత్తిడికి గరై.. ఇకపై తాను మ్యాట్‌పై కనపడతానో లేదోననే వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆమె కెరీర్‌ ఇక ముగిసినట్లే అని అంతా అనుకున్నారు. తర్వాత తన ప్రవర్తన పట్ల ఆమె డబ్ల్యూఎఫ్‌ఐకు క్షమాపణలు చెప్పింది. ఈ నేపథ్యంలోనే వినేశ్‌ మళ్లీ తన శిక్షణ కొనసాగించింది. దీంతో కామన్వెల్త్‌ క్రీడల్లో వరుసగా మూడో స్వర్ణం సాధించి.. పట్టుదలతో ముందుకు సాగితే విజయాలు వాటంతట అవే వస్తాయని నిరూపించింది.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని