Virat Kohli: ఆ రెండు బౌండరీలు కొట్టడంతో వారు వెనకడుగు వేశారు: విరాట్ కోహ్లీ

కీలక సమయంలో విరాట్ కోహ్లీ (Virat Kohli) దూకుడు పెంచాడు. హైదరాబాద్‌పై సెంచరీతో చెలరేగాడు. గుజరాత్‌తోనూ రాణించి బెంగళూరును గెలిపించాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Published : 21 May 2023 10:47 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మరీ ఇంత తక్కువ స్ట్రైక్‌రేట్‌తో ఎవరైనా పరుగులు చేస్తారా..? టీ20ల్లో ఇది నాణ్యమైన ఆటే కాదు.. ఇదీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో (SRH) మ్యాచ్‌కు ముందు ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆటను చూసిన వారి అభిప్రాయం. మూడు రోజుల కిందట హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు స్టార్‌ బ్యాటర్ విరాట్ సెంచరీ బాది చెలరేగిపోయాడు. దీంతో ప్లేఆఫ్స్‌ అవకాశాలను ఆర్‌సీబీ సజీవంగా ఉంచుకుంది. నేడు గుజరాత్‌తో జరిగే మ్యాచ్‌లోనూ విజయం సాధిస్తే ప్లేఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్‌పై చేసిన శతకం విరాట్ ఐపీఎల్‌ కెరీర్‌లో ఆరోదికావడం విశేషం. మూడంకెల స్కోరు చేస్తానని తాను అనుకోలేదని, ఎస్‌ఆర్‌హెచ్ పేసర్ భువనేశ్వర్‌ కుమార్ బౌలింగ్‌లో కొట్టిన రెండు ఫోర్లతో ఆ జట్టు వెనుకంజ వేసిందని విరాట్ తెలిపాడు. కెప్టెన్ డుప్లెసిస్‌తో కోహ్లీ సంభాషణ వీడియోను ఐపీఎల్ నిర్వాహకులు ట్వీటర్‌లో పోస్టు చేశారు. 

‘‘నా బ్యాటింగ్‌కు సంబంధించి దీప్‌దాస్‌ గుప్తాతో మాట్లాడాను. నేను నెట్స్‌లో మంచి షాట్లను కొట్టగలుగుతున్నప్పటికీ.. మ్యాచ్‌లో సరిగా ఆడలేకపోతున్నట్లు అతడి దృష్టికి తెచ్చా. అయితే, హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మాత్రం పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. గత తొమ్మిది మ్యాచుల్లో దూకుడుగా ఆడలేకపోయా. కీలక సమయంలో ఆటతీరును మెరుగుపర్చుకోవాలని భావించా. అయితే సెంచరీ సాధిస్తానని మాత్రం అనుకోలేదు. భువనేశ్వర్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు కొట్టడంతో హైదరాబాద్‌ బౌలర్లు కాస్త వెనుకడుగు వేసినట్లు అనిపించింది. దీంతో దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నా. డుప్లెసిస్‌, మ్యాక్స్‌వెల్‌ గేమ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు. వీరిద్దరికి సహకరిద్దామనుకొన్నా. నాణ్యమైన క్రికెటింగ్‌ షాట్లను ఆడటంతోనే ఆధిక్యం సాధించవచ్చు. నా అటతీరు ఇలా ఉంటుందని ఆ రెండు బౌండరీలతో హైదరాబాద్‌ బౌలర్లకు సంకేతాలు పంపించా. చివరికి సెంచరీ నమోదు చేయగలిగా’’ అని విరాట్ కోహ్లీ తెలిపాడు. 

గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లో బెంగళూరు విజయం సాధిస్తే ప్లేఆఫ్స్‌ బెర్తును ఖాయం చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం 13 మ్యాచుల్లో 14 పాయింట్లతో బెంగళూరు నాలుగోస్థానంలో కొనసాగుతోంది.  కానీ, ఒక వేళ ఈ మ్యాచ్‌లో ఓడిపోతే.. ముంబయి, రాజస్థాన్‌ నుంచి ప్రమాదం పొంచి ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని