Asia Cup 2023: ఆసియా కప్.. టీమ్‌ఇండియా కూర్పు ఎలా ఉండనుందో..?

విండీస్‌ పర్యటన తర్వాత ఆసియా కప్‌.. అటు పిమ్మటే వన్డే ప్రపంచకప్.. ఇదీ భారత్‌ (Team India) బిజీ షెడ్యూల్‌. జులై 12 నుంచి ఆగస్టు 13 వరకు విండీస్‌ పర్యటన కాగా.. ఆగస్ట్‌ 31న ఆసియా కప్ మొదలుకానుంది. 

Published : 01 Jul 2023 01:51 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మరో రెండు వారాల్లో వెస్టిండీస్‌తో (WI vs IND) రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లతో కూడిన భారత పర్యటన ప్రారంభం కానుంది. జులై 12 నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు విండీస్‌ పర్యటనలోనే టీమ్‌ఇండియా (Team India) గడిపేస్తుంది. ఆ తర్వాత ఆగస్టు 31 నుంచి పాకిస్థాన్, శ్రీలంక వేదికలుగా ‘హైబ్రిడ్ మోడల్‌’లో ఆసియా కప్‌ 2023 (Asia Cup 2023) టోర్నమెంట్ జరగనుంది. అయితే, ఇప్పటికీ భారత జట్టును బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ప్రకటించలేదు. విండీస్‌తో వన్డే సిరీస్‌ ముగిశాక లేదా కీలక ఆటగాళ్లు బుమ్రా, కేఎల్ రాహుల్‌ ఫిట్‌నెస్‌ నిరూపించుకున్న తర్వాత జట్టును వెల్లడించే అవకాశం ఉంది. ఇందులో ఆడిన జట్టులో పెద్దగా మార్పుల్లేకుండానే వన్డే ప్రపంచ కప్‌లో ఆడేందుకు ఎక్కువ ఛాన్స్‌ ఉంది. ఈ క్రమంలో ఆసియా కప్‌ కోసం భారత తుది జట్టు ఎలా ఉంటుందో ఓసారి పరిశీలిద్దాం.. 

ఓపెనర్లుగా వారిద్దరే!

ఇటీవల కాలంలో టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో అదరగొట్టేస్తున్న భారత ఆటగాళ్లలో శుభ్‌మన్‌ గిల్ ఒకడు. గత ఐపీఎల్‌లో గిల్‌దే టాప్‌ స్కోర్. దీంతో కెప్టెన్‌ రోహిత్ శర్మతో ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం గిల్‌కే ఇవ్వడం ఖాయం.  ఇక ఓపెనర్‌గా రిజర్వ్‌లో ఉన్న ఆటగాడిగా రుతురాజ్‌ గైక్వాడ్‌కు ఛాన్స్‌ ఉంటుంది. మరో ఆటగాడు యశస్వి కూడా ఇదే రేసులో ఉన్నాడు. 

మిడిలార్డర్‌లో వీరే కీలకం.. 

భారత్‌ మిడిలార్డర్‌లో ఆటగాళ్లకు కొదవేం లేదు. ఒకరిద్దరు నిలబడినా భారీ స్కోరు చేయగల సత్తా ఉంది. విరాట్ కోహ్లీ వన్‌డౌన్‌లో వస్తాడు. ఫిట్‌నెస్‌ సాధించి తుది జట్టులో ఉంటే కేఎల్ రాహుల్‌ నాలుగో స్థానంలో ఆడగలడు. కీపింగ్‌ కూడా చేయడం అదనపు అర్హత. సూర్యకుమార్‌ యాదవ్‌, సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌ ఎంపికలో మాత్రం కాస్త గందరగోళం ఉండే అవకాశం ఉంది. వన్డేల్లో డబుల్‌ సెంచరీ సాధించిన బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ స్వతహాగా వికెట్ కీపర్‌. అలాగే సంజూ శాంసన్‌ వైపు కూడా మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదు. పేస్‌ ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ఉండనే ఉన్నాడు. 

విరాట్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్‌, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా/అక్షర్ పటేల్

స్పెషలిస్ట్ స్పిన్నర్లు.. 

రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్ వీరిద్దరూ జట్టులో ఉంటే ఇతర స్పిన్నర్లతో అవసరం ఉండదు. బ్యాటింగ్‌ కూడా చేయగల సత్తా వారికుంది. అయితే, స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌  కనీసం ఒక్కరైనా ఉండాలి. చాహల్ / కుల్‌దీప్‌ యాదవ్‌  వీరిద్దరూ స్పెషలిస్ట్‌ స్పిన్నర్లు. వారిలో ఒకరిని మాత్రమే తీసుకొనేందుకు అవకాశం ఉంది. ఇద్దరినీ తీసుకోవాలనుకుంటే జడ్డూను లేదా అక్షర్‌ను పక్కనపెట్టాల్సిందే. 

పేస్ దళం ఇదేనా..? 

ఆసియా కప్‌లో భారత్‌ మ్యాచ్‌లు శ్రీలంక వేదికగానే జరుగుతాయి. కాబట్టి లంక పిచ్‌లపై ఇద్దరు స్పెషలిస్ట్ పేసర్లు ఉన్నా సరిపోతుంది. హార్దిక్‌ రూపంలో పేస్‌ ఆల్‌రౌండర్‌ ఉండనే ఉన్నాడు. ఒకవేళ బుమ్రా ఫిట్‌నెస్‌ సాధించి వస్తే అతడికి చోటు ఖాయం. మరో స్థానం కోసం షమీ - సిరాజ్ మధ్య తీవ్ర పోటీ ఉంటుంది. అర్ష్‌దీప్‌సింగ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ ఉన్నప్పటికీ వారిద్దరికి అవకాశం రావడం కష్టమే. అయితే విండీస్‌తో టీ20 సిరీస్‌లో మాత్రం తుది జట్టులో ఉండొచ్చు. 

ఆసియా కప్‌ కోసం తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్),  శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్‌ యాదవ్, సంజూ శాంసన్‌ (వికెట్ కీపర్), హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, చాహల్‌, బుమ్రా, షమీ/సిరాజ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని