Jasprit Bumrah: ధోనీనే స్ఫూర్తి.. బుమ్రా కూడా అతడి లాగే..!

జస్ప్రిత్‌ బుమ్రా ఒక ఫాస్ట్‌ బౌలర్‌గా జట్టులోకి వచ్చి.. అనతికాలంలోనే మంచి పేరు సాధించి.. ప్రపంచంలోనే మేటి డెత్‌ ఓవర్ల స్పెషలిస్టుగా ఎదిగాడు...

Updated : 01 Jul 2022 10:25 IST

జస్ప్రిత్‌ బుమ్రా ఫాస్ట్‌ బౌలర్‌గా జట్టులోకి వచ్చి.. అనతికాలంలోనే మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్రపంచంలోనే మేటి డెత్‌ ఓవర్ల స్పెషలిస్టుగా ఎదిగాడు. అయితే, కొంత కాలంగా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక తీవ్ర ఇబ్బందులు పడిన అతడు ఇప్పుడు భారత టెస్టు క్రికెట్‌ పగ్గాలు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో బుమ్రా గురించి ప్రత్యేక కథనం..

ధోనీనే స్ఫూర్తి..

బుమ్రా ఇంతకుముందెప్పుడూ, ఏ స్థాయిలో కెప్టెన్‌గా పనిచేయలేదు. ఇప్పుడు నేరుగా టీమ్‌ఇండియాకే నాయకత్వం వహించబోతున్నాడు.  టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ 2007లో భారత టీ20 జట్టుకు కెప్టెన్సీ చేపట్టకముందు ఆ బాధ్యతలు నిర్వర్తించలేదు. ఈ విషయాన్ని ధోనీనే స్వయంగా బుమ్రాకు చెప్పాడట. ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో మహీ గొప్ప సారథిగా ఎదిగాడు. ప్రపంచ క్రికెట్‌లో మరే సారథికీ సాధ్యంకాని మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించి ఎవరూ తనకు సాటిలేరని నిరూపించుకున్నాడు. ఇప్పుడు బుమ్రా కూడా అదే బాటలో పయనించాలని చూస్తున్నాడు. కొత్త బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమేనని. అందుకు తన మాజీ సారథే స్ఫూర్తిగా నిలిచాడని బుమ్రా చెప్పాడు.

కపిల్‌ దేవ్‌ తర్వాత..

ఇక భారత దిగ్గజ సారథి కపిల్‌ దేవ్‌ తర్వాత టీమ్‌ఇండియా కెప్టెన్‌గా ఒక ప్రధాన ఫాస్ట్‌ బౌలర్‌ బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. 1987లో చివరిసారి కపిల్‌ భారత జట్టు టెస్టు పగ్గాలు చేపట్టాడు. తర్వాత దిలిప్‌ వెంగ్‌సర్కార్‌, రవిశాస్త్రి, కృష్ణమాచారి శ్రీకాంత్‌, మహ్మద్‌ అజహరుద్దీన్‌, సచిన్‌ తెందూల్కర్‌, సౌరభ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రవిడ్‌, వీరేందర్‌ సెహ్వాగ్‌, అనిల్‌ కుంబ్లే, మహేంద్రసింగ్‌ ధోనీ, విరాట్‌ కోహ్లీ, అజింక్య రహానె, కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మలు ఆ బాధ్యతలు నిర్వర్తించారు. ఇందులో గంగూలీ మీడియం పేస్ వేయగలిగినా అతడు ప్రధాన పేసర్‌ కాదు. దీంతో కపిల్‌ తర్వాత ఆ బాధ్యతలు చేపడుతోన్న తొలి ఫాస్ట్‌ బౌలర్‌గా బుమ్రా రికార్డులకు ఎక్కనున్నాడు.

పంత్‌, రాహుల్‌లా కాకుండా..

టెస్టు క్రికెట్‌లో విరాట్‌ కోహ్లీ టీమ్‌ఇండియాను అత్యున్నత శిఖరాలకు చేర్చిన తర్వాత గతేడాది దక్షిణాఫ్రికా పర్యటనలో సిరీస్‌ కోల్పోయింది. ఈ నేపథ్యంలో అతడు ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. అనంతరం రోహిత్‌ శర్మ అన్ని ఫార్మాట్ల సారథిగా ఎంపికైనా వివిధ కారణాల చేత కొన్ని మ్యాచ్‌లకు ఆడలేకపోతున్నాడు. గాయాల సమస్య ఒకటైతే.. ఇప్పుడు కరోనాబారిన పడటం మరొకటి. దీంతో రోహిత్‌ అందుబాటులో లేని సమయాల్లో తాత్కాలిక కెప్టెన్లుగా వ్యవహరించిన కేఎల్‌ రాహుల్‌, రిషభ్ పంత్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. గతేడాది దక్షిణాఫ్రికా పర్యటనలోనే రాహుల్‌ ఒక టెస్టు, మూడు వన్డేలకు కెప్టెన్సీ చేసి ఒక్క మ్యాచ్‌ కూడా గెలిపించలేకపోయాడు. అతడి ప్రదర్శన కూడా ఏమాత్రం బాలేదు. మరోవైపు అదే జట్టుతో ఇటీవల స్వదేశంలో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో పంత్‌ కెప్టెన్సీ చేశాడు. కానీ, తొలి రెండు మ్యాచ్‌ల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేక తడబడ్డాడు. తర్వాత రెండు మ్యాచ్‌లు గెలిచాడు. అయితే ఇతర ఆటగాళ్లు అద్భుతంగా రాణించినా.. పంత్‌ బ్యాట్స్‌మన్‌గా తేలిపోయాడు. దీంతో బుమ్రా.. వాళ్లలా కాకుండా జట్టును ముందుండి నడిపించాలి.

అవసరమైతే కోహ్లీ నుంచి..

సహజంగానే బుమ్రా బౌలింగ్‌ యూనిట్‌కు పెద్ద అండగా నిలుస్తాడు. ఇప్పుడు జట్టు మొత్తాన్ని నడిపించడం కొత్త సవాలే. రోహిత్‌, రాహుల్‌ లాంటి టాప్‌ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ లేకపోవడం.. కోహ్లీ అంతగా ఫామ్‌లో లేకపోవడం.. పుజారా కౌంటీ క్రికెట్‌లో రాణించినా కీలక పోరులో ఏమేరకు రాణిస్తాడో తెలియని పరిస్థితి నెలకొనడం.. పంత్‌ బ్యాటింగ్‌ కూడా కాస్త ఆందోళన కలిగిస్తున్న పరిస్థితుల్లో.. ఇప్పుడు ఆశలన్నీ బౌలింగ్‌ యూనిట్‌పైనే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఏమాత్రం కెప్టెన్సీ అనుభవం లేని బుమ్రా జట్టును ఎలా నడిపిస్తాడన్నది ఆసక్తికరం. అయితే అతడు పంత్‌, రాహుల్‌లా తడబాటుకు గురికాకుండా ఉంటే మంచిది. అవసరమైతే కోహ్లీ లాంటి అనుభవజ్ఞుడి నుంచి సలహాలు, సూచనలు తీసుకోవడం ఉత్తమం. ఇప్పటికే టీమ్‌ఇండియా 2-1 తేడాతో ఈ సిరీస్‌లో ఆధిక్యంలో నిలవగా.. ఈ టెస్టు కూడా గెలిస్తే ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఇంగ్లాండ్‌ గడ్డపై 3-1 తేడాతో చారిత్రక విజయం సాధించే సువర్ణావకాశం ఉంది. మరోవైపు రాహుల్‌ ద్రవిడ్‌ లాంటి మేటి ఆటగాడు కోచ్‌గా ఉండటం అతడికి కలిసొచ్చే అంశం. అయితే, ఇంగ్లాండ్‌ జట్టు ఇప్పుడు న్యూజిలాండ్‌పై 3-0 తేడాతో గెలిచి మంచి ఆత్మవిశ్వాసంతో ఉన్న నేపథ్యంలో బుమ్రా సారథ్యంలోని టీమ్‌ఇండియా మరింత జాగ్రత్తగా ఆడాలి.

- ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని