Sanju Samson: ఈ సెంచరీ శాంసన్‌ కెరీర్‌కు ఎంత వరకు లాభం?

ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఇన్నింగ్స్‌ నిర్మించగలడు. ఫీల్డింగ్‌లోనూ అదరగొడతాడు. కానీ అంతర్జాతీయంగా అరంగేట్రం చేసిన ఎనిమిదేళ్లకు తొలి సెంచరీ సాధించాడు. మరి, ఈ సెంచరీ అతని కెరీర్‌ను పరుగులు పెట్టిస్తుందో.. లేదో చూడాలి. 

Updated : 22 Dec 2023 14:51 IST

పవర్‌ హిట్టింగ్‌తో.. భారీ షాట్లతో.. ఒంటిచేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని మార్చగల ఆటగాడతను. ఐపీఎల్‌లో ఎన్నో మెరుపు ఇన్నింగ్స్‌లాడాడు. మరోవైపు వన్డేల్లో కండీషన్స్‌కు తగ్గట్లు ఆటతీరు మార్చుకోగల నైపుణ్యం అతని సొంతం. అంతర్జాతీయ వన్డేల్లో అతని నిలకడే అందుకు నిదర్శనం. కానీ, తగినన్ని అవకాశాలు రాక.. వచ్చిన ఛాన్స్‌ను ఉపయోగించుకోలేక.. వెనుకబడ్డాడు. ఆ ఆటగాడే సంజు శాంసన్‌ (Sanju Samson). కానీ ఇప్పుడు దక్షిణాఫ్రికాతో చివరి వన్డేలో శతకంతో సత్తాచాటాడు. మరి ఒడిదొడుకులతో.. ఆగుతూ సాగుతున్న అతని కెరీర్‌ను ఈ సెంచరీ నిలబెడుతుందా? అతని ప్రయాణాన్ని పరుగులు పెట్టిస్తుందా? 

అన్నీ ఉన్నా..

దేశవాళీ క్రికెట్‌లో కేరళ తరపున శాంసన్‌ నిలకడగా రాణిస్తున్నాడు. ఐపీఎల్‌ (IPL)లో ఇప్పుడు రాజస్థాన్‌ రాయల్స్‌ (Rajasthan Royals) జట్టులోనూ కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఫస్ట్‌క్లాస్, లిస్ట్‌- ఎ, టీ20లు కలిపి దేశవాళీ క్రికెట్‌లో పదహారు సెంచరీలు చేశాడు. ఐపీఎల్‌లో 3 శతకాలు సహా ఇప్పటివరకూ 152 మ్యాచ్‌ల్లో 3,888 పరుగులు చేశాడు. ఇందులో 20 అర్ధ శతకాలున్నాయి. ఇలా దేశవాళీల్లో, ఐపీఎల్‌లో అతని ప్రదర్శన నిలకడగా ఉంది. కానీ అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం ఆశించినట్లుగా రాణించలేకపోతున్నాడు.  2015లో అంతర్జాతీయ అరంగేట్రం చేసినా తొలి శతకం సాధించేందుకు ఎనిమిదేళ్లు పట్టింది. ఇప్పటివరకూ అతను 16 వన్డేల్లో 56.66 సగటుతో 510 పరుగులు చేశాడు. 24 టీ20ల్లో 19.68 సగటుతో 374 పరుగులు సాధించాడు. 

అతని గురించే చర్చ..

క్రికెట్‌లో శాంసన్‌ పేరు మైదానం లోపల కంటే బయటే ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అతని గురించి తరచూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత జట్టులో అతని పేరు లేకపోతే, అది వెంటనే తీవ్రమైన టాపిక్‌గా మారుతుంది. ఇటీవల ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాలో అతనికి చోటు దక్కకపోవడం, అలాగే ఆ మెగా టోర్నీ తర్వాత ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు ఎంపిక కాకపోవడం తెలిసిందే. దీంతో శాంసన్‌ అనుకూల వర్గాలు గొంతెత్తాయి. ప్రతిభావంతుడైన శాంసన్‌కు ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించాయి. బీసీసీఐ, సెలక్షన్‌ కమిటీ తీరుపై మండిపడ్డాయి. మరోవైపు ఇచ్చిన అవకాశాలను వృథా చేసుకుంటున్నాడన్నది మరో వర్గం వాదన. టీ20ల్లో అతని ప్రదర్శనే అందుకు రుజువు. ఇప్పటివరకూ భారత్‌ తరపున టీ20ల్లో శాంసన్‌ చెప్పుకోదగ్గ ప్రదర్శనే చేయలేదు. 21 సార్లు బ్యాటింగ్‌ చేసిన అతను కేవలం ఒక్క హాఫ్‌ సెంచరీ మాత్రమే చేయగలిగాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఉండే ఒత్తిడిని అతను తట్టుకోవడం లేదంటూ, శాంసన్‌కు బదులు వేరే ఆటగాళ్లను ప్రోత్సాహించాలనే కామెంట్లూ వినిపిస్తూనే ఉంటాయి. 

రాత మారేనా?

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ సంజు శాంసన్‌ కెరీర్‌కు అతి పెద్ద పరీక్ష. ఈ సిరీస్‌లో విఫలమైతే మాత్రం అతను మళ్లీ జాతీయ జట్టుకు ఎంపికవడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తొలి వన్డేలో అతనికి బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. రెండో వన్డేలో 12 పరుగులే చేసి అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. దీంతో శాంసన్‌ కథ ఇక అంతేననుకున్నారు. కానీ చివరి వన్డేలో అద్భుత శతకంతో శాంసన్‌ ఆశలు నిలబెట్టుకున్నాడు. దక్షిణాఫ్రికా గడ్డపై కఠినమైన పరిస్థితుల్లో సెంచరీతో రాణించాడు. ఈ సెంచరీ శాంసన్‌ కెరీర్‌కు అవసరమైన వేగాన్ని అందిస్తుందనడంలో సందేహం లేదు. కానీ జట్టులో ఉన్న పోటీని దాటి అతను నెగ్గుకురాగలడా? అన్నదే ఇక్కడ ప్రశ్న. సెంచరీ తర్వాత కండలను చూపిస్తూ ‘ఇదీ నా  సామర్థ్యం’ అని శాంసన్‌ సంకేతాన్నిచ్చాడు. అయితే జట్టులో, బ్యాటింగ్‌ ఆర్డర్‌లో అతనికి ఓ నిర్దిష్టమైన ప్లేసంటూ లేదనే చెప్పాలి.

వన్డేల్లో పది ఇన్నింగ్స్‌ల్లో అతను 5 లేదా 6 ప్లేసులో బ్యాటింగ్‌ చేశాడు. కానీ దేశవాళీల్లో శాంసన్‌ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వస్తాడు. ఇప్పుడు దక్షిణాఫ్రికాతో వన్డేలో అదే ప్లేసులో వచ్చి సెంచరీ చేశాడు. కానీ వన్డేల్లో సాధారణంగా ఆ ప్లేసు కోహ్లిది. అంటే కోహ్లి ఉండగా శాంసన్‌ వేరే ప్లేసులో ఆడాల్సిందే. అయితే కోహ్లి ఇటీవల ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో శాంసన్‌ వన్‌డౌన్‌లో నిలకడగా రాణిస్తే.. కోహ్లి తర్వాత ఆ చోటు అతనిదే అని చెప్పాలి. మరి ఈ సెంచరీతోనైనా శాంసన్‌ రాత మారుతుందేమో చూడాలి.  

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని