Hyderabad Vs Punjab: దంచికొట్టి..దర్జాగా

అదే దూకుడు.. అదే దంచుడు. లక్ష్యం ఏమో 215. అయినా తమ ముందు అది చిన్నదే అంటూ.. సన్‌రైజర్స్‌ మరోసారి రెచ్చిపోయింది.

Updated : 20 May 2024 06:38 IST

టాప్‌-2లోకి సన్‌రైజర్స్‌
పంజాబ్‌పై విజయం
క్వాలిఫయర్‌-1కు అర్హత
చెలరేగిన అభిషేక్, క్లాసెన్‌

అదే దూకుడు.. అదే దంచుడు. లక్ష్యం ఏమో 215. అయినా తమ ముందు అది చిన్నదే అంటూ.. సన్‌రైజర్స్‌ మరోసారి రెచ్చిపోయింది. ఛేదనలో ప్రమాదకర హెడ్‌ తొలి బంతికే ఔటైనా తగ్గేదేలేదంటూ చెలరేగింది. అభిషేక్‌ శర్మ, క్లాసెన్‌ విధ్వంసంతో పంజాబ్‌పై అలవోకగా  విజయాన్ని అందుకుంది. ఐపీఎల్‌-17లో సొంతగడ్డపై ఆఖరి మ్యాచ్‌లో గెలిచి.. లీగ్‌ దశను దర్జాగా ముగించింది. అంతేకాదు హైదరాబాద్‌ 14 మ్యాచ్‌ల్లో 17 పాయింట్ల (8 విజయాలు, ఓ రద్దు)తో రెండో స్థానంలో నిలిచి తొలి క్వాలిఫయర్‌కు అర్హత సాధించింది. ఫైనల్లో చోటు కోసం సన్‌రైజర్స్‌.. టేబుల్‌ టాపర్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. మరోవైపు రాజస్థాన్‌కు క్వాలిఫయర్‌-1లో ఆడే అవకాశం చేజారింది. కోల్‌కతాతో మ్యాచ్‌లో గెలిస్తే ఆ జట్టు సన్‌రైజర్స్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానానికి వచ్చేది. కానీ వర్షం కారణంగా ఆ మ్యాచ్‌ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కావడంతో రాయల్స్‌ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. పాయింట్లలో హైదరాబాద్‌తో సమంగా నిలిచినా.. రన్‌రేట్‌లో ఆ జట్టు వెనుకబడింది. రెండో క్వాలిఫయర్‌లో స్థానం కోసం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును రాజస్థాన్‌ ఢీకొంటుంది.

ఈనాడు - హైదరాబాద్‌

పీఎల్‌-17లో సంచలన ప్రదర్శనతో సాగుతున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విజయంతో లీగ్‌ దశను ముగించింది. ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన ఈ జట్టు ఆదివారం తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై 4 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట పంజాబ్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 214 పరుగుల భారీ స్కోరు చేసింది. ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (71; 45 బంతుల్లో 7×4, 4×6), రొసొ (49; 24 బంతుల్లో 3×4, 4×6), అథర్వ (46; 27 బంతుల్లో 5×4, 2×6) సత్తాచాటారు. నటరాజన్‌ (2/33) మెరిశాడు. ఛేదనలో 6 వికెట్లు కోల్పోయిన హైదరాబాద్‌ మరో అయిదు బంతులు మిగిలి ఉండగా లక్ష్యాన్ని అందుకుంది. ‘‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’’ అభిషేక్‌ శర్మ (66; 28 బంతుల్లో 5×4, 6×6) మరోసారి చెలరేగాడు. క్లాసెన్‌ (42; 26 బంతుల్లో 3×4, 2×6), రాహుల్‌ త్రిపాఠి (33; 18 బంతుల్లో 4×4, 2×6), నితీశ్‌ కుమార్‌ (37; 25 బంతుల్లో 1×4, 3×6) కూడా రాణించారు. పంజాబ్‌ బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ (2/37), హర్షల్‌ పటేల్‌ (2/49) ఆకట్టుకున్నారు. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ ఒకేఒక్క విదేశీ ఆటగాడితో ఆడడం విశేషం.

అదే జోరు: బ్యాటింగ్‌కు వచ్చామా.. విధ్వంసం సృష్టించామా అన్నట్లు ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ సాగుతోంది. పంజాబ్‌తో ఛేదనలోనూ అభిమానులు అదే ఊచకోత ఆశించారు. కానీ తొలి బంతికే షాక్‌. సూపర్‌ ఫామ్‌లో ఉన్న ప్రమాదకర హెడ్‌ (0)ను అర్ష్‌దీప్‌ బౌల్డ్‌ చేశాడు. అయినా ఆ పరుగుల ప్రవాహం ఆగలేదు. బౌండరీల జోరు కొనసాగింది. ఓ ఎండ్‌లో అభిషేక్‌ ఎప్పటిలాగే రెచ్చిపోగా.. ఈ సారి త్రిపాఠి కూడా చెలరేగాడు. నేరుగా దూసుకొచ్చిన హర్షల్‌ ఫుల్‌టాస్‌ను కిందకు వంగి స్క్వేర్‌లెగ్‌లో త్రిపాఠి సిక్సర్‌గా మలచిన తీరు చూడాల్సిందే. కానీ అదే ఓవర్లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి అతను ఔటైపోయాడు. వికెట్లు పడ్డా తనకేమీ పట్టనట్లు.. కేవలం బౌండరీలే తన లక్ష్యమన్నట్లు అభిషేక్‌ వీరవిహారం కొనసాగడంతో సన్‌రైజర్స్‌ పవర్‌ప్లేలో 84/2 స్కోరుతో విజయానికి గట్టి పునాది వేసుకుంది. బంతి ఎక్కడ, ఎలా వేసినా బౌండరీకి తరలించడమే పనిగా పెట్టుకున్న అభిషేక్‌ 21 బంతుల్లోనే అర్ధశతకం అందుకున్నాడు. రాహుల్‌ చాహర్‌ బౌలింగ్‌లో నితీశ్‌ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్‌ ముందు పట్టిన శశాంక్‌.. నియంత్రణ కోల్పోయి బంతిని గాల్లోకి విసిరి లైన్‌ లోపలికి వెళ్లొచ్చాక పడదామనుకున్నాడు. కానీ ఆ బంతిని గీత బయటే పట్టుకోవడంతో సిక్సర్‌ అయింది. మరోవైపు హర్‌ప్రీత్‌ బౌలింగ్‌లో అభిషేక్‌ వరుసగా రెండు కళ్లుచెదిరే సిక్సర్లు కొట్టాడు. 10 ఓవర్లకు 129/2తో సన్‌రైజర్స్‌ లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. ఈ సీజన్‌లో మొదటిసారి బౌలింగ్‌ చేసిన శశాంక్‌ (1/5) తొలి బంతికే అభిషేక్‌ను ఔట్‌ చేసినా పంజాబ్‌కు ఆనందం లేకుండా పోయింది. విశాఖ కుర్రాడు నితీశ్, క్లాసెన్‌ కలిసి బౌలర్లపై విరుచుకుపడ్డారు. స్పిన్నర్లు చాహర్‌ (0/43), హర్‌ప్రీత్‌ బ్రార్‌ (1/36)కు సిక్సర్ల రుచి చూపించారు. విజయం సమీకరణం 35 బంతుల్లో 39 పరుగులుగా మారడంతో సన్‌రైజర్స్‌ విజయం దాదాపుగా ఖాయమైపోయింది. ఈ దశలో స్లో డెలివరీతో నితీశ్‌ను హర్షల్‌ బోల్తా కొట్టించాడు. షాబాజ్‌ (3) నిలబడలేకపోయాడు. సమద్‌ (11 నాటౌట్‌) సిక్సర్‌తో సమీకరణం 13 బంతుల్లో 9 పరుగులుగా మారింది. 19వ ఓవర్లో క్లాసెన్‌ను హర్‌ప్రీత్‌ బౌల్డ్‌ చేయడంతో కాస్త ఉత్కంఠ రేగింది. కానీ చివరి ఓవర్లో 4 పరుగులే చేయాల్సి రాగా.. సన్వీర్‌ (6 నాటౌట్‌) తొలి బంతికే ఫోర్‌ కొట్టి పని పూర్తిచేశాడు. 

బాదుడే బాదుడు: జీవం లేని పిచ్‌.. బ్యాటింగ్‌కు అనుకూల పరిస్థితులు.. ఎదురుగా ప్రమాదకర సన్‌రైజర్స్‌.. దీంతో భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలనే ధ్యేయంతో పంజాబ్‌ దూకుడు ప్రదర్శించింది. ఆరంభం నుంచి చివరివరకూ బాదుడే బాదుడు. ముఖ్యంగా ఓపెనర్లు అథర్వ, ప్రభ్‌సిమ్రన్‌ తొలి వికెట్‌కు 9 ఓవర్లలోనే 97 పరుగులు జోడించి జట్టుకు మెరుపు ఆరంభాన్నిచ్చారు. ఈ యువ ఆటగాళ్లు సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ను ఏ మాత్రం లెక్కచేయలేదు. మొదట్లో సన్‌రైజర్స్‌ పేస్‌ త్రయం (భువనేశ్వర్, నటరాజన్, కమిన్స్‌) పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. భువీ బౌలింగ్‌లో లెంగ్త్‌బంతిని బౌలర్‌ తలమీదుగా అథర్వ సిక్సర్‌గా మలిచిన తీరు ఆకట్టుకుంది. స్పిన్నర్లు రంగంలోకి దిగినా ఓపెనర్లు తగ్గలేదు. చివరకు అథర్వను ఔట్‌ చేసిన నటరాజన్‌ ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. కానీ రొసొ జతగా ప్రభ్‌సిమ్రన్‌ బౌండరీల వేటలో సాగడంతో సన్‌రైజర్స్‌కు ఉపశమనం దక్కలేదు. 14 ఓవర్లకే స్కోరు 150 దాటింది. ఈ దశలో వరుస ఓవర్లలో ప్రభ్‌సిమ్రన్, శశాంక్‌ (2)లను సన్‌రైజర్స్‌ వెనక్కి పంపింది. మరో వైపు బ్యాట్‌కు పనిచెప్పిన రొసో కూడా కాసేపటికే నిష్క్రమించాడు. నటరాజన్‌ బౌలింగ్‌లో సన్వీర్‌ వెనక్కి పడుతూ అద్భుతమైన క్యాచ్‌ అందుకోవడంతో అశుతోష్‌ (2) వెనుదిరిగాడు. కానీ నితీశ్‌ వేసిన ఆఖరి ఓవర్లో జితేశ్‌ (32 నాటౌట్‌; 15 బంతుల్లో 2×4, 2×6) చెలరేగడంతో స్కోరు 210 దాటింది. వరుసగా రెండు సిక్సర్లతో జితేశ్‌ ఇన్నింగ్స్‌ ముగించాడు.

పంజాబ్‌ ఇన్నింగ్స్‌: అథర్వ (సి) సన్వీర్‌ (బి) నటరాజన్‌ 46; ప్రభ్‌సిమ్రన్‌ (సి) క్లాసెన్‌ (బి) విజయకాంత్‌ 71; రొసొ (సి) సమద్‌ (బి) కమిన్స్‌ 49; శశాంక్‌ రనౌట్‌ 2; జితేశ్‌ నాటౌట్‌ 32; అశుతోష్‌ (సి) సన్వీర్‌ (బి) నటరాజన్‌ 2; శివమ్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 214; వికెట్ల పతనం: 1-97, 2-151,  3-174, 4-181, 5-187; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-36-0; కమిన్స్‌ 4-0-36-1; నటరాజన్‌ 4-0-33-2; విజయకాంత్‌ 4-0-37-1; షాబాజ్‌ అహ్మద్‌ 1-0-13-0; నితీశ్‌ 3-0-54-0

హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: హెడ్‌ (బి) అర్ష్‌దీప్‌ 0; అభిషేక్‌ (సి) శివమ్‌ (బి) శశాంక్‌ 66; రాహుల్‌ త్రిపాఠి (సి) అర్ష్‌దీప్‌ (బి) హర్షల్‌ 33; నితీశ్‌ (సి) శివమ్‌ (బి) హర్షల్‌ 37; క్లాసెన్‌ (బి) హర్‌ప్రీత్‌ 42; షాబాజ్‌ అహ్మద్‌ (సి) శశాంక్‌ (బి) అర్ష్‌దీప్‌ 3; సమద్‌ నాటౌట్‌ 11; సన్వీర్‌ సింగ్‌ నాటౌట్‌ 6; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం: (19.1 ఓవర్లలో 6 వికెట్లకు) 215; వికెట్ల పతనం: 1-0, 2-72, 3-129, 4-176, 5-197, 6-208; బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ 4-0-37-2; రిషి ధావన్‌ 3-0-35-0 హర్షల్‌ 4-0-49-2; రాహుల్‌ చాహర్‌ 4-0-43-0; హర్‌ప్రీత్‌ 3-0-36-1; శశాంక్‌ 1-0-5-1; అథర్వ 0.1-0-4-0


సన్‌రైజర్స్‌ ధన్యవాదాలు..

ఈ సీజన్‌లో సొంతగడ్డ ఉప్పల్‌ మైదానంలో ఆఖరి మ్యాచ్‌ ఆడేసిన సన్‌రైజర్స్‌.. అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది. పంజాబ్‌పై విజయం తర్వాత సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు మైదానంలో తిరుగుతూ స్టాండ్స్‌లోని అభిమానులకు అభివాదం చేశారు. స్టాండ్స్‌లోకి టెన్నిస్‌ బంతులు విసిరారు. ఐపీఎల్‌-17లో ఉప్పల్‌లో ఏడు మ్యాచ్‌లాడిన హైదరాబాద్‌ అయిదు గెలిచింది. ఆర్సీబీ చేతిలో ఓడిపోయింది. గుజరాత్‌తో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది.


41

ఐపీఎల్‌- 17లో 200కు పైగా పరుగులు వచ్చిన మ్యాచ్‌లు. ప్రపంచవ్యాప్తంగా టీ20 టోర్నీల్లో ఓ సీజన్‌లో ఎక్కువసార్లు 200 పరుగులు నమోదైన వాటిల్లో టీ20 బ్లాస్ట్‌ (2023లో 42 సార్లు) మాత్రమే ఐపీఎల్‌ కంటే ముందుంది. ఐపీఎల్‌లో ఇంకా నాలుగు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.


41

ఈ సీజన్‌లో అభిషేక్‌ శర్మ సిక్సర్లు. ఓ ఐపీఎల్‌ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా కోహ్లి (2016లో 38) రికార్డును అతను బద్దలు కొట్టాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని