DC vs SRH: హైదరాబాద్ అదిరెన్.. వరుసగా నాలుగో విజయం

హైదరాబాద్‌ జట్టు మరోసారి అదరగొట్టింది. దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 67 పరుగుల తేడాతో విజయం సాధించి.. ఈ సీజన్‌లో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది.

Updated : 20 Apr 2024 23:48 IST

దిల్లీ: ఐపీఎల్‌ 17 సీజన్‌లో హైదరాబాద్‌ మరోసారి అదిరిపోయే ప్రదర్శన చేసింది. దిల్లీని వారి సొంత మైదానంలో 67 పరుగుల తేడాతో ఓడించి వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్‌ 7 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యఛేదనలో దిల్లీ 19.1 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌటైంది.పృథ్వీ షా (16), డేవిడ్ వార్నర్‌ (1) విఫలమైనా.. జేక్ ఫ్రేజర్‌ (65; 18 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లు), అభిషేక్‌ పోరెల్‌ (42; 22 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించారు. ఫ్రేజర్, అభిషేక్ బౌండరీలతో విరుచుకుపడటంతో దిల్లీ స్కోరు 7 ఓవర్లకే 100 దాటింది. తర్వాత వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. రిషబ్‌ పంత్‌ (44; 34 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) భారీ స్థాయిలో హిట్టింగ్‌ చేయలేకపోయాడు. మరో వైపు హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొట్టడంతో దిల్లీ 200లోపే ఆలౌటైంది. నటరాజన్‌ (4/19) ఆకట్టుకున్నాడు. అతడు ఇన్నింగ్స్‌ 19 ఓవర్‌లోనే మూడు వికెట్లు పడగొట్టడంతోపాటు ఒక్క పరుగూ ఇవ్వలేదు. మయాంక్‌ మర్కండే 2, నితీశ్‌ కుమార్ రెడ్డి 2, భువనేశ్వర్, వాషింగ్టన్‌ సుందర్‌లకు తలో వికెట్ దక్కింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో హైదరాబాద్‌ (10 పాయింట్లు) రెండో స్థానానికి దూసుకెళ్లింది. 

ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (89; 32 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లు), అభిషేక్ శర్మ (46; 12 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించడంతో హైదరాబాద్‌ భారీ స్కోరుకు చేయడానికి బాటలు పడ్డాయి. చివర్లో షాబాజ్‌ అహ్మద్ (59*; 29 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. నితీశ్ రెడ్డి (37; 27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. మార్‌క్రమ్ (1) విఫలం కాగా.. హెన్రిచ్‌ క్లాసెన్ (15; 8 బంతుల్లో 2 సిక్స్‌లు), అబ్దుల్ సమద్ (13; 8 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. దిల్లీ బౌలర్లలో కుల్‌దీప్‌ యాదవ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ముకేశ్ కుమార్‌, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని